ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు ‘షాక్’నిచ్చారా? సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదా? అనే ప్రశ్నలకు సందేహాస్పదమైన సమాచారం వస్తోంది. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన జిల్లాల్లోని పాత్రికేయ మిత్రుల అంచనా ప్రకారం… వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పట్ల గ్రాడ్యుయేట్లు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్ లో ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిల మధ్య గట్టి పోటీ ఉందంటున్నారు. గిరిజన ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లు కోదందరాంవైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో కూడా కోదండరాం వైపే డిగ్రీహోల్డర్స్ ఎక్కువగా మొగ్గు చూపారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణం మినహా మిగతా ప్రాంతాల్లోనూ కోదండరాం ప్రభావం తీవ్రంగా ఉందంటున్నారు. ప్రాంతాలవారీగా డాక్టర్ చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్నలు కూడా కొంతమేర ఓట్లు చీల్చారంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిస్థితిపై పలువురు జర్నలిస్టు మిత్రులు పెదవి విరుస్తుండడం గమనార్హం. మొత్తంగా ఆయా జిల్లాల్లో కోదండరాంకే ఎక్కువగా తొలి ప్రాధాన్యత ఓట్లు పడ్డాయంటున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లపై కోదండరాంకు మొగ్గు ఉండవచ్చనే అంచనాలకు విరుద్ధంగా తాజా సమాచారం వస్తుండడం ఆసక్తికర పరిణామంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుల మధ్య ఏర్పడిందంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపుపై ఆ పార్టీ వర్గాలు మాత్రం ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ అంచనాల్లో ఎంతవరకు నిజముందనే అంశం ఈనెల 17న జరిగి ఓట్ల లెక్కింపులో మాత్రమే తేలే అవకాశం ఉంది.

Comments are closed.

Exit mobile version