ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చు విషయంలో పరిమితి లేదు కాబట్టి సరిపోయింది… లేనట్లయితే అధికార పార్టీ అభ్యర్థులు పోలింగ్ కు ముందే చిక్కుల్లో పడేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం సూచించలేదు. దీంతో మీడియాను, ముఖ్యంగా ప్రింట్ మీడియాను అధికార పార్టీ ‘జాకెట్’ యాడ్స్ తో కుమ్మేస్తోంది. చిన్నా, పెద్దా పత్రికలనే తారతమ్యం ఏమీ లేదు. కాషాయ రంగును పులుముకున్న ‘వెలుగు’ వంటి ఒకటీ, అరా వ్యతిరేక పత్రికలకు మినహా భాషాభేదం సైతం లేకుండా గులాబీ పార్టీ జాకెట్ యాడ్స్ తో నింపేస్తున్నది. సందర్భానుసారం మాత్రమే ‘ప్రింటింగ్’ చేస్తున్న పత్రికలకు కూడా ఈ జాకెట్ యాడ్స్ ను టీఆర్ఎస్ పార్టీ విడుదల చేయడం విశేషం. తమ పార్టీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను గెలిపించాలని అభ్యర్థిస్తూ ఈ జాకెట్ యాడ్స్ ను విడుదల చేస్తున్నారు. రెగ్యులర్ పత్రిక మొదటి పేజీలోని ‘మాస్ట్ హెడ్’ (పత్రిక టైటిల్) మినహాయించి సెంటీ మీటర్ స్థలాన్ని కూడా వదలకుండా ఇచ్చే ప్రకటనలను పత్రికా పరిభాషలో జాకెట్ యాడ్స్ గా వ్యవహరిస్తుంటారు. జాకెట్ యాడ్స్ కు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. వీటిని ప్రచురించే పత్రిక ఏదైనా సరే తన ‘మాస్ట్ హెడ్’ను లోపలి పేజీల్లోనూ మళ్లీ ప్రదర్శించడమే వీటిలోని అసలు ప్రత్యేకత.

తెలంగాణాలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల సందర్భంగా ప్రింట్ మీడియా పంట పండిందనే చెప్పాలి. కరోనా కల్లోలం వల్ల యాడ్ రెవెన్యూ కోసం ముఖం వాచినట్లు వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్థలకు టీఆర్ఎస్ జాకెట్ యాడ్స్ వరంగా భావిస్తున్నారు. ఎందుకంటే పేజి, పేజీకి ఒక్కో రేటు ఉండడమే యాడ్స్ లోని ప్రత్యేకత. ఇక ఏబీసీ సర్టిఫికెట్ గల ప్రముఖ పత్రికలకు గల డిమాండ్ గురించి చెప్పనక్కరలేదు. సాధారణంగానే పేజీలను బట్టి 100-200 శాతం వరకు అధిక ధరలను కోట్ చేసే ప్రముఖ పత్రికలు జాకెట్ యాడ్స్ కు 500 శాతం వరకు పెంచి డబ్బు వసూల్ చేస్తాయనే ప్రచారం ఉంది. ఒక్కోసారి క్లయింటును బట్టి ఈ శాతాల్లో భారీ తేడా కూడా ఉండొచ్చు. నిన్న, ఈరోజు తెలుగు మీడియాలోని ‘ఈనాడు’ నుంచి మొదలుపెడితే పాఠకుల సోదిలో, యాదిలోనే పెద్దగాలేని అనేక చిన్నా చితకా పత్రికలకు కూడా టీఆర్ఎస్ పార్టీ జాకెట్ యాడ్స్ ను విడుదల చేసింది. ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ ఆంగ్ల పత్రికలకే కాదు, అదే భాషలో వెలువడే సాధారణ సర్క్యులేషన్ గల సంస్థలకూ టీఆర్ఎస్ పార్టీ వీటిని జారీ చేసింది. పోలింగ్ రోజైన ఆదివారం కూడా జాకెట్ యాడ్స్ విడుదల చేసినట్లు సమాచారం. ఆయా ప్రకటనలకు వ్యయం చేసిన మొత్తాన్ని అంచనా వేస్తే ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు బేజార్ కావలసిందే మరి.

అన్ని పత్రికల్లో యూనిఫామ్ గా 52X33 సైజులో జాకెట్స్ యాడ్ రిలీజ్ చేశారు. ఉదాహరణకు ఈనాడు పత్రికకు సంబంధించి వరంగల్ జిల్లా మెయిన్ ఎడిషన్ రేట్ కార్డు ప్రకారం స్క్వేర్ సెంటీ మీటర్ కు రూ. 295 చొప్పున 500 శాతం అదనంతో కలిపితే ఒక్కరోజు ప్రకటన ఖర్చు భారీగానే ఉంటుంది. కానీ ప్యాకేజీగా భావించి కేవలం 300 శాతం అదనపు రేటుతో గణిస్తే వరంగల్ జిల్లా వరకే రూ. 20,24,880 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు వేర్వేరుగా ఆయా జిల్లాల రేట్ కార్డు ప్రకారం రూ. 19,56,240 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ మూడు జిల్లాలకు కలిపి ఒకరోజుకయ్యే జాకెట్ యాడ్ ప్రకటనకయ్యే ఖర్చును దాదాపు రూ. 60.00 లక్షలుగా అంచనా వేయవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ప్యాకేజీ ఇతర జిల్లాలకంటే రెట్టింపు స్థాయిలో ఉంటుంది. హిందూ పత్రిక స్టేట్ వైడ్ జాకెట్ యాడ్ ప్రకటనకు ఒక్కరోజుకు రూ. 50.00 లక్షలు వసూల్ చేస్తుంటారని, కానీ ఈ ప్యాకేజీలో దినసరి రూ. 8.00 లక్షల చొప్పున మొత్తం రూ. 24.00 లక్షలకే మూడు రోజులపాటు ప్రచురిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కల ప్రకారం చిన్నా, పెద్దా పత్రికలకు కలిపి ‘జాకెట్ యాడ్స్’ కోసం టీఆర్ఎస్ పార్టీ వెచ్చిస్తున్న మొత్తాన్ని అంచనా వేయవచ్చు. మొత్తంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రింట్ మీడియాకు టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాకెట్ యాడ్స్ విలువ కనీసం రూ. 10.00 కోట్ల వరకు ఉండవచ్చని మీడియా యాడ్ ఏజెన్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం పత్రికల్లో ప్రకటనలకే ఇంత భారీ మొత్తాన్ని కేటాయిస్తే మిగతా ఖర్చులను బేరీజు వేసుకోవచ్చంటున్నారు.

గమనించాల్సిన అంశమేమిటంటే… ఎన్నికల సందర్భంగా పొలిటికల్ యాడ్స్ ప్యాకేజీల వ్యవహారం ‘కతలు’ కథలుగా ఉంటుంది. ‘పెయిడ్ ఆర్టికల్’ వ్యవహారం బహిర్గతం కాకుండా ఆయా మొత్తాలను కూడా ఇదే ప్యాకేజీల్లో కలిపి కొన్ని సంస్థలు వసూల్ చేస్తాయనే వాదనా లేకపోలేదు. విచిత్రమేమిటంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ ఈసారి ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం ఊదరగొట్టడం లేదు. దీని భావమేమిటో తెలియక మీడియా వర్గాలు తలలు నిమరుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు చెందిన ఈ జాకెట్ యాడ్స్ నేరుగా హైదరాబాద్ నుంచే విడుదల కావడం గమనార్హం. ఫలితంగా స్థానిక విలేకరులకు యాడ్ రెవెన్యూ ద్వారా వచ్చే కమీషన్ రాకుండాపోవడమే కొసమెరుపు.

Comments are closed.

Exit mobile version