కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ జర్నలిస్ట్ భార్య ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తున్న ఘటన తీవ్ర కలకలం కలిగిస్తోంది. ఓ ప్రధాన పత్రికలో బ్యూరో ఇంచార్జిగా పనిచేస్తున్న ఆయా జర్నలిస్టు తన భార్యను శారీరకంగా తీవ్రంగా హింసించడంతో, దెబ్బలకు తట్టుకోలేక శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు తన భార్య సైకో అని, తనను వేధిస్తోందని సదరు జర్నలిస్టు ముందు జాగ్రత్తగా పోలీసులకు ఫిర్యాదు చేశారనే కథనం కూడా వ్యాప్తిలో ఉంది. అయితే ఫిర్యాదు గురించి అధికారికంగా ధ్రువపడలేదు. కానీ జర్నలిస్టు భార్య శానిటైజర్ తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్న మాట వాస్తవమేనని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తర తెలంగాణా వ్యాప్తంగా జర్నలిస్టు సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఘటన పూర్వపరాల్లోకి వెడితే…

పగిలిన ముక్కు.. కమిలిన కళ్లు, వాచిన పెదాలు… వెరసి ఓ మహిళా మూర్తి తీవ్ర హింసకు గురైన భయానక దృశ్యం. సాధారణంగా ఇటువంటి హింసాత్మక ఘటనలపై జర్నలిస్టులు తీవ్రంగా స్పందిస్తుంటారు. ఆ మహిళకు అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తూ వార్తా కథనాలు రాస్తుంటారు. పాత్రికేయ వృత్తిలో ఇదో భాగం. కానీ సమాజ హితాన్ని కోరే జర్నలిస్టే ఇటువంటి ఘటనలకు పాల్పడితే…? ఇది ఆ తరహా ఘటనకు సంబంధించిన క్లుప్త కథనమే.

ఉత్తర తెలంగాణాకు గుండెకాయ లాంటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో అతనో ప్రధాన పత్రికకు బ్యూరో ఇంచార్జిగా పనిచేస్తున్నాడు. కట్టుకున్న తనను గాలికొదిలేసి, భర్త చనిపోయిన మరదలిని ఇంట్లోకి తీసుకువచ్చి ఆమెతో కాపురం చేస్తున్నాడనేది బాధిత జర్నలిస్టు భార్య ఆరోపణ. తన భర్తను ఉన్న ఫళంగా హైదరాబాద్ కు బదిలీ చేయాలని, తాను, తన పిల్లలు అగాధంలో కూరుకుపోయినట్లు సదరు జర్నలిస్ట్ భార్య వాపోతున్నారు. చేస్తున్న వృత్తిని, ఉద్యోగాన్ని, పరపతిని అడ్డుగా పెట్టుకుని మరదలితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడని జర్నలిస్ట్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని కార్యకలాపాల వల్ల పిల్లలు చెడుమార్గంలో పయనించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తన భర్త వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుని తనను వేధిస్తున్నాడని, శారీరకంగానూ హింసిస్తున్నాడని, ఎంత చెప్పినా వినడం లేదంటున్నారు. తన భర్త దురాగతంపై పత్రిక యాజమాన్యానాకి, ఎడిటర్ కు కూడా ఫిర్యాదు చేశానని చెబుతున్నారు. కనీసం ప్రస్తుత స్థానం నుంచి అతన్ని బదిలీ చేస్తే తన కాపురం చక్కబడుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ తనకు న్యాయం చేయడం జరగడం, తన ఆవేదనను పత్రిక యాజమాన్యంగాని, ఎడిటర్ గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని జర్నలిస్ట్ భార్య వాపోతున్నారు. భర్త చనిపోయిన తన తోడి కోడలుతో ఇతను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనకు తన పిల్లలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెకు ఇల్లు కూడా కట్టిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్ లో తనను ఉంచి, కుటుంబ ఆలనా, పాలనా పట్టించుకోవడం లేదని ఆమె వాపోతున్నారు. గడచిన కొద్దిరోజులుగా ఈమె తన భర్త పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని పలువురు జర్నలిస్టుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని జర్నలిస్టులను సైతం అభ్యర్థిస్తున్నారు. తన భర్త తనకు చేస్తున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. అంతేకాదు. ప్రశ్నించిన తనను తీవ్రంగా కొడుతున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కాపురం కూలిపోతుందనే ఆందోళనను కూడా ఆమె వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

మొత్తం ఘటనలో కొసమెరుపు ఏమిటంటే తన భర్త ఉద్యోగానికి ఏ ముప్పూ రాకూడదని, అతన్ని బదిలీ మాత్రమే చేయాలని ఆయా జర్నలిస్టు భార్య ఇప్పటికీ కోరుకుంటుండడం.

( గమనిక: బాధిత మహిళ చేసిన మరిన్ని ఆరోపణల ఆడియోను, భర్త దాష్టీకం కారణంగా తీవ్రంగా ‘హింస’కు గురైన ఫొటోలను ఆమె కాపురం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం లేదు.)

Comments are closed.

Exit mobile version