తెలంగాణా ఆర్టీసీలో మళ్లీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటైంది. మొత్తం పది యూనియన్లతో జేఏసీ ఏర్పాటు కావడం విశేషం. అయితే టీఎంయూ మాత్రం జేఏసీలో చేరకపోవడం గమనార్హం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఏర్పాటు చేశామని, తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటాలకు సిద్ధమని ఆర్టీసి యూనియన్ల నేతలు ప్రకటించారు. హైదరాబాద్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ జేఏసీ చైర్మెన్, ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ, కార్మిక సమస్యల పరిష్కారానికి జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ప్రతి ఉద్యోగికి జీతాలు పెరిగాయని, తమకు మాత్రం పెరగలేదని, మూడేళ్ల క్రితమే పెరిగేవని, అసెంబ్లీలో సీఎం స్వయంగా హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు నెరవేరలేదన్నారు. సంస్థలో కొత్త బస్సుల కొనుగోలు లేదని, సీసీఎస్ లో నిధులు లేవని, దీన్ని మూసివేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ జరగాలని, ఉద్యోగ భద్రత హామీ ఇచ్చారే తప్ప నెరవేరలేదన్నారు. అదేవిధంగా రిటైరైన వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.

జేఏసీని ప్రకటిస్తున్న టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు

జేఏసీ వైస్ చైర్మెన్ హన్మంతు ముదిరాజ్ మాట్లాడుతూ, ఆర్టీసీలోని 11 యూనియన్లలో 10 యూనియన్లతో జేఏసీ ఏర్పడిందని, టీఎంయూ జేఏసీలో పాల్గొనలేదన్నారు. ఆర్టీసీ రోజురోజుకు క్షీణిస్తున్నదని, సంస్థ పరిరక్షణకోసం తదుపరి కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, టీఎంయూ బయటకు వచ్చి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కార్యాచరణ రూపొందించి ఉద్యమాలకు సిద్ధమవుతామని, ముఖ్యమంత్రి తన ప్రకటనలతోనే యూనియన్లు లేవని చెబుతున్నారని, యూనియన్లు రద్దు చేసే అర్హత ముఖ్యమంత్రికి లేదని ఆయన అన్నారు.

Comments are closed.

Exit mobile version