తెలంగాణాలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆర్టీసీ ఎదుర్కుంటున్న క్లిష్ట పరిణామాల నుంచి గట్టెక్కేందుకు ఛార్జీల పెంపు అనివార్యంగా సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని సంస్థ ప్రధాన బాధ్యులు నిర్ణయించారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ఆర్టీసీ ఛార్జీలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పట్లో కిలోమీటరుకు రూ. 20 పైసల చొప్పున పెంచారు. ఆ తర్వాత చిల్లర కష్టాల పేరుతో మరో రూ. 10 పైసలు పెంచారు. అయినప్పటికీ ఆర్టీసీని నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం పెద్దగా లభించడం లేదు. దీంతో ఛార్జీలు పెంచడం అనివార్యంగా ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.

ఇటీవలే రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌లు సమావేశమై బస్సు ఛార్జీలు పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కిలోమీటరుకు 25 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వ పరంగా ఆమోదం లభిస్తే తక్షణమే అమలు చేస్తారా? వ్యవధి తీసుకుంటారా? అనేది స్పష్టం కావలసి ఉంది. ఈమేరకు బుధవారం రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version