తనతో పెట్టుకోవద్దని, తాను మంచోన్ని కాదని తెలంగాణా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం వరంగల్ నగర పర్యటనకు వచ్చిన కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్ధేశించి సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్లెప్రగతి, దేవాదుల ప్రాజెక్టు తదితర ప్రగతి అంశాలను సీఎం ప్రస్తావిస్తూ, ‘దయాకర్ రావు గారు… నేను మంచోన్ని కాదు సుమీ’ అని వ్యాఖ్యానించిన కొద్దిక్షణాల్లోనే ‘అంటే నాతో పెట్టుకోవద్దు మరి’ అని నవ్వుతూ కేసీఆర్ అన్నారు. పల్లెల్లో పరిశుభ్రత, దేవాదుల ప్రాజెక్టు లక్ష్యాలను వివరిస్తూ సీఎం దిశా, నిర్దేశం చేశారు. దయాకర్ రావును ఉద్దేశించి సీఎం చేసిన ఆయా వ్యాఖ్యలపై భిన్న చర్చ జరుగుతోంది.

కాగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. చారిత్రక నగరాలైనవ వరంగల్, హన్మకొండ పేర్లపై మాత్రమే ఇక ఈ రెండు జిల్లాలు ఉంటాయని, రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ప్రకటించారు. వరంగల్ జిల్లాకు వెటర్నరీ, డెంటల్ కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Comments are closed.

Exit mobile version