‘‘జన క్షేత్రంలో తేల్చుకుందాం. అవాస్తవ ఆరోపణలకు భయపడేది లేదు. రాజకీయ బ్రోకర్లు మీకు సానుభూతిపరులుగా మారారు. నక్సలైట్ నేత సబిత బేషరతుగా నాకు క్షమాపణ చెప్పాలి.’’

గుర్తున్నాయి కదా ఈ వ్యాఖ్యలు. సరిగ్గా మూడు నెలల క్రితం ములుగు జిల్లా పరిషత్ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ మావోయిస్టు పార్టీ ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో విడుదలైన లేఖపై స్పందిస్తూ చేసిన సవాల్ ఇది.

సరే… కుసుమ జగదీశ్వర్ పూర్వకాలంలో మాజీ మావోయిస్టు కాబట్టి, ఆ పార్టీ అగ్ర నేత ఆర్కేకు ఒకప్పటి కొరియర్ కాబట్టి, రాడికల్ యువజన సంఘం ఏరియా కమిటీ కార్యదర్శి కాబట్టి, తెలంగాణా జనసభకు నాయకత్వం వహించిన నేత కాబట్టి నక్సల్స్ ఆరోపణలను ధైర్యంగా తిప్పికొడుతూ ‘రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం’ అని సవాల్ విసిరినట్లు కాసేపు భావిద్దాం.

ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్

ఈ దిగువన గల ఓ పత్రిక వార్తా కథనాన్ని పరిశీలనగా చూడండి. ‘మావోయిస్టులకు సవాల్’ శీర్షికన ప్రచురితమైన ఈ వార్త వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ నక్సల్స్ పేరుతో విడుదలైన ప్రకటనను ఖండఖండాలుగా ఖండిస్తున్నట్లు చేసిన ప్రకటన బాపతు ఇది. ఆశ్చర్యకర పరిణామమే కదా? ఇది కూడా అన్నల బెదిరింపులకు వెరవని ధైర్యమే కదా? నక్సల్స్ పేరుతో ఏదేని లేఖ విడుదలైతే ‘ఆరోపణలు అవాస్తవం… దయచేసి మరోసారి పునః పరిశీలించాలని మనవి చేస్తున్నాం’ అనే వినతి నుంచి సవాల్ విసిరే ధైర్యపు స్థాయి పరిణామంపైనే మరోసారి చర్చ జరుగుతోంది. దాదాపు వారం క్రితం మావోయిస్టు పార్టీ జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో విడుదలైన ఓ ప్రకటన ఓరుగల్లు నగరంలో భిన్నాభిప్రాయాలకు తావు కల్పించింది. అధికార పార్టీకి చెందిన అనేక మంది నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వెలువడిన ప్రకటన వెనుక ‘రాజకీయ’ లబ్ధి ఉందనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కున్న వారిలో ఒకరైన వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి సహా పలువురు ప్రతినిధులు నక్సలైట్ల పేరుతో విడుదలైన ప్రకటనకు ప్రతి సవాల్ విసరడమే విశేషం. తమపై చేసిన భూకబ్జాలు, సెటిల్మెంట్ల ఆరోపణలు నిరూపించాలని, తాము కబ్జా చేసిన స్థలాలు ఉంటే పేద ప్రజలకు నక్సల్సే పంపిణీ చేయాలని, తాము అక్రమాలకు పాల్పడితే ప్రజలే శిక్షించేవాళ్లను కూడా కుమారస్వామి పేర్కొన్నారు. తాను అక్రమ దందాలకు పాల్పడి ఆస్తులు సంపాదించినట్లు నిరూపిస్తే వాటిని పేదలకు పంచేస్తానని కూడా పేర్కొన్నారు. మావోయిస్టుల ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కున్న మరికొందరు కూడా వారివారి పద్ధతుల్లో స్పందించారు.

గడచిన మూడు నెలల కాలంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ సోదరుడు బాలసాని ముత్తయ్య, వరంగల్ జిల్లా హన్మకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు, కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి తదితరులపై భూకబ్జాల వంటి ఆరోపణలు చేస్తూ మావోయిస్టు నక్సల్స్ పేరుతో లేఖలు విడుదల కావడం ఇది మూడోసారి. ఆయా మూడు లేఖల్లోనూ ఆరోపణలు ఎదుర్కున్నవారిపై భూ సంబంధిత అంశాలే ఉండడం గమనార్హం.

మూడు నెలల క్రితం ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో, ఆ తర్వాత వెంకటాపూర్-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరుతో, తాజాగా జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి జిల్లాల కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖలు విడుదలయ్యాయి. ఆయా లేఖల్లో అధికార పార్టీ నేతల భూకబ్జాలు, బెదిరింపులు, రౌడీయిజం వంటి ఆరోపణల అంశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, లేఖల ‘ఒరిజినాలిటీ’పైనే అనేక సందేహాలు ఉన్నాయి.అధికార పార్టీ నేతల మధ్య గల ఆధిపత్య పోరు సైతం లేఖలకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ విసిరిన సవాల్ కు ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ ప్రతిస్పందించకపోవడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. అసలు ‘సబిత’ అనే పేరుతోనే మావోయిస్టు లీడర్ లేరనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరంలోని కొందరు ముఖ్యులను, ప్రముఖులను టార్గెట్ చేస్తూ విడుదలైన లేఖపైనా ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నిజానిజాలను తేల్చాల్సింది మాత్రం పోలీసులే. లేని పక్షంలో తమకు గిట్టని నేతలపై, వ్యక్తులపై ఇదే తరహా లేఖల పరంపర కొనసాగే అవకాశాలు లేకపోలేదన్నది నిర్వివాదాంశం.

ఇదీ చదవండి: తుపాకీకే సవాల్… ఏమిటీ ధైర్యం? ఎవరీ నేత?! https://ts29.in/mulugu-zilla-parishath-chairmen-kusuma-jagadeeshwar-recounter-questions-against-maoist-naxals-upon-threatening-him/

Comments are closed.

Exit mobile version