తెలంగాణా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు చెందిన INB NEWS కేబుల్ ఛానల్ కు రాజకీయంగా చెక్ పడిందా? ఛానల్ మూతపడడానికి ‘రాజకీయమే’ కారణమా? అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్ల మేరకే మంత్రి తన ఛానల్ కు తాళం వేశారనే ప్రచారం మీడియా సర్కిళ్లలో జోరుగా సాగుతోంది. దాదాపు 20 రోజుల క్రితమే మూడపడినట్లు తెలుస్తున్న INB NEWS కేబుల్ ఛానల్ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వెనుకబడిన తరగతుల వాయిస్ గా భావిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ ఛానల్ ను కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. వ్యవస్థాపకుల నుంచి పలువురి చేతులు మారిన INB NEWS కొద్ది సంవత్సరాల క్రితమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల్లోకి వచ్చింది. అధికార పార్టీ గొంతుగా పనిచేస్తుందనే భావనతోనే ఆయన ఈ ఛానల్ ను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అనేక మంది మీడియా పెద్దలను ఆహ్వానించి మరీ INB NEWS లోగో ఆవిష్కరణ వంటి కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ప్రారంభంలో కొంతకాలం చురుగ్గానే నడిచిన ఛానల్ గత కొంత కాలంగా నెమ్మదించింది. కేబుల్ ఛానల్ గా మాత్రమే నిర్వహిస్తున్న INB NEWS రాజధాని కేంద్రంలో అనేక ప్రాంతాల్లో పాతుకుపోయింది కూడా.

(FILE)

మరికొద్ది రోజుల్లోనే దీన్ని శాటిలైట్ ఛానల్ గా మారుస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూతురే స్వయంగా చూస్తున్న ఛానల్ అకస్మాత్తుగా మూడపడడాన్ని జర్నలిస్టు వర్గాలు ఓ విషాదంగా అభివర్ణిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దల ఒత్తిడి వల్లే ఛానల్ మూత పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ గొంతును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ తరపున ప్రస్తుతం గల మీడియా హౌజ్ లు సరిపోతాయని, అవి ఉండగా మరికొన్ని సంస్థల అవసరం లేదని పాలక పార్టీ నేతలు హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గత్యంతరం లేక శ్రీనివాస్ గౌడ్ INB NEWS కేబుల్ ఛానల్ ను మూసేసినట్లు జర్నలిస్టు వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈమేరకు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు నెల వేతనం అదనంగా చెల్లించి యాజమాన్యం వారిని వదిలించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణాలో మరో మీడియా సంస్థ మూడపడడం జర్నలిస్టు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  

Comments are closed.

Exit mobile version