మావోయిస్టు నక్సల్స్ ఏరివేతలో భాగంగా పొరుగున గల ఛత్తీస్ గఢ్ అడవుల్లో ‘ఆపరేషన్ ప్రహార్’ మొదలైంది. ఈ ఆపరేషన్ ఛత్తీస్ గఢ్ అడవుల్లో ప్రారంభించడం ఇది మొదటిసారి కాకపోయినా, కొత్త సంవత్సరం 20202లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అడవుల్లో ఆకు రాలే కాలం ప్రారంభంలోనే ‘ఆపరేషన్ ప్రహార్’ ప్రారంభించడంతో ఛత్తీస్ గఢ్ అడవులు మళ్లీ రక్తమోడుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ‘ఆపరేషన్ ప్రహార్’ ప్రస్తుతం నిరవధికంగా కొనసాగుతోంది.

మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతాలపై ఆకస్మికంగా, ముప్పేట దాడులు నిర్వహిస్తూ విరుచుకుపడడమే ‘ఆపరేషన్ ప్రహార్’ అసలు నిర్వచనంగా చెబుతున్నారు. ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్, మరోవైపు ఒడిషా, ఇంకోవైపు మహారాష్ట్ర సరిహద్దుల నుంచేగాక మావోయిస్టుల ప్రాబల్యంగల ఛత్తీస్ గఢ్ లోని జిల్లాల నుంచి పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తారు. ఒక్కో పోలీస్ టీమ్ కనీసం 20-25 కిలోమీటర్ల మేర అడవుల్లోకి చొచ్చుకుపోయి కూంబింగ్ తోపాటు గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తారు.

ఈ ఆపరేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలగాల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. డ్రోన్ కెమెరాల సాంకేతికతను సైతం వినియోగిస్తున్నారు. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం, డ్రోన్ కెమెరాల ఫొటోల సమాచారం ఆధారంగా నక్సల్స్ సంచరిస్తున్నట్లు గుర్తించిన ప్రాంతాల్లో వివిధ రకాల పోలీసు బలగాలు ముప్పేట దాడులు నిర్వహించడమే ‘ఆపరేషన్ ప్రహార్’ అసలు లక్ష్యం. గతంలో గ్రీన్ హంట్ వంటి పేర్ల స్థానంలోనే ప్రస్తుతం ‘ఆపరేషన్ ప్రహార్’ అనే పదాన్ని వాడున్నట్లు ఛత్తీస్ గడ్ మీడియా వర్గాల కథనం. మావోల ప్రధాన స్థావరాలుగా ఛత్తీస్ గఢ్ పోలీసులు అంచనా వేసిన తెలంగాణా సరిహద్దుల్లోని కిష్టారం, పామేడ్, సుక్మా ప్రాంతాల్లోనేగాక నారాయణ్ పూర్, బీజాపూర్, అబూజ్ మడ్ అడవుల్లో ‘ఆపరేషన్ ప్రహార్’ చేపట్టారు.

ఈ ఆపరేషన్ సందర్భంగా గడచిన 40 గంటల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించగా, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) విభాగానికి చెందిన జవాన్ కూడా ఒకరు గాయపడినట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది. తెలంగాణా సరిహద్దు నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు ఏకకాలంలో ‘ఆపరేషన్ ప్రహార్’ ప్రారంభించినట్లు ఛత్తీస్ గఢ్ డీజీపీ డీఎం అవస్థీ మీడియాకు తెలిపారు. ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్ (డీఆర్జీ)కి చెందిన 1,400 మంది, కోబ్రా బెటాలియన్ కు చెందిన 450 మంది జవాన్లు పాల్గొంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా వంద మందికి పైగా నక్సల్స్ ఉన్నారనే సమాచారం మేరకు బుర్కపాల్ క్యాంపునకు చెందిన 600 మంది జవాన్లు ‘ఆపరేషన్ ప్రహార్’ నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా తొమ్మది మంది నక్సల్స్ గాయపడినట్లు ఎస్పీ శాలబ్ సిన్హా చెప్పారు. బీజేపీ రమణ్ సింగ్ ప్రభుత్వంలోనే ప్రారంభమైన ‘ఆపరేషన్ ప్రహార్’ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొనసాగుతుండడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version