రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులే ‘పొలిటికల్’గా ఫిక్స్ చేశారా? ఖమ్మం ఎంపీ టికెట్ ప్రామాణికంగా ఏకంగా ఆయనను ఫ్యామిలీ పరంగానూ ఉచ్చులో బిగించారా? ఇదే నిజమైతే ‘రాజకీయం’ కారణంగా పొంగులేటి మున్ముందు కుటుంబపరంగా సమస్యలను ఎదుర్కోవలసిన అనివార్యత ఏర్పడుతుందా? అంటే.. ఔననే విధంగా రాజకీయ పరిణామాలు జరుగుతున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోందనే అంశంలోకి సూటిగా పాయింట్ల వారీగా పరిశీలిస్తే..

  • ఖమ్మం నుంచి ఎంపీగా తన తమ్ముడు ప్రసాదరెడ్డిని పోటీ చేయించి, గెలిపించుకునేందుకు మంత్రి పొంగులేటి దీర్ఘకాలిక పథక రచన చేశారు.
  • ఇందులో భాగంగానే కమ్మ సామాజిక వర్గం నుంచి తన తమ్ముడికి టికెట్ పోటీ ఏర్పడకుండా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు దక్కడంలో తనదైన ప్లాన్ ను అమలు చేసినట్లు రాజకీయ వర్గాల భావన.
  • ఇంత వరకు బాగానే ఉంది. తన తమ్ముడికి ఇక టికెట్ సులభంగానే దక్కుతుందని పొంగులేటి భావించి ఉండవచ్చు.
  • కానీ పార్టీలోని ప్రత్యర్థులు అత్యంత వేగంగా పావులు కదిపారు. అన్న మంత్రి, తమ్మడు ఎంపీ అయితే పొంగులేటి బ్రదర్స్ ఆధిపత్యానికి ఎదురులేకుండాపోతుందని ప్రత్యర్థులు అంచనా వేశారట.
  • ఇందులో భాగంగానే ఇద్దరు ముఖ్య నాయకులు ఏకమై అత్యంత వ్యూహాత్మకంగా పొలిటికల్ పావులు కదిపారనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది.
  •  పొంగులేటి అంచనాను తలకిందులు చేస్తూ కమ్మ సామాజిక వర్గం నుంచి పలువురు నాయకులను ఏకంగా టికెట్ కోసం రంగంలోకి దించినట్లు కాంగ్రెస్ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
  • మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయుడు యుగంధర్ తదితరులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
  • ముగ్గురు మంత్రుల కుటుంబీకులెవరికీ టికెట్ ఇవ్వరాదనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్లు ప్రచారం జరిగింది.
  • పార్టీలో చేరేముందు తనకు ఇచ్చిన మాటను పొంగులేటి పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించారట.
  • ఈ సమయంలోనే పొంగులేటి కుటుంబానికి టికెట్ దక్కవద్దని భావించిన ప్రత్యర్థులు అనూహ్యంగా వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం.
  • దీంతో పొంగులేటి కాదనలేని అనివార్య పరిస్థితి, పరిణామాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే రఘురాంరెడ్డి స్వయానా పొంగులేటికి వియ్యంకుడు. తన కూతురు సప్నిరెడ్డిని రఘురాంరెడ్డి కుమారునికి ఇచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివాహం చేశారు.
  • ఇటు చూస్తే తమ్ముడు ప్రసాదరెడ్డి.. అటు చూస్తే వియ్యంకుడు రఘురాంరెడ్డి.. ఇద్దరిలో శ్రీనివాసరెడ్డి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇదీ అసలు సందిగ్ధావస్థగా ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.
  • ఇటువంటి పరిణామాల్లోనే రఘురాంరెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయినట్లు 48 గంటల క్రితం తాజా పరిస్థితి.
  • ఈ నేపథ్యంలోనే రఘురాంరెడ్డి తరపున ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్, కాంగ్రెస్ నేత నూకల నరేష్ రెడ్డి తదితరులు ఓ నామినేషన్ సెట్ దాఖలు చేశారు.
  • మంత్రి పొంగులేటి శిబిరానికి చెందిన స్వర్ణకుమారి, బొర్రా రాజశేఖర్, నిరంజన్ రెడ్డి తదితరులు కూడా రఘురాంరెడ్డి తరపున మరో నామినేషన్ దాఖలు చేశారు.
  • ఇక అంతా రెడీ.., రఘురాంరెడ్డి తరపున ప్రచారం నిర్వహించడమే తరువాయి అనే తరహాలో ప్రచార సామాగ్రిని కూడా సిద్దం చేశారు.
  • కానీ నిన్న పొంగులేటి క్యాంపులో భిన్న వాతావరణమట. రఘురాంరెడ్డి నామినేషన్ దాఖలుకు సంబంధించి ఎటువంటి ప్రచారాన్ని కూడా మంత్రి శ్రీనివాసరెడ్డి శిబిరం నుంచి చేయకపోవడం గమనార్హం.
  • పొంగులేటి శిబిరంలో ఆయన వర్గీయులు ఎక్కడో ఓ చిన్న ఆశతో ఉన్నారట. తన తమ్ముడికే టికెట్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి చివరి ప్రయత్నం చేస్తున్నారట. ఈ యత్నం ఫలిస్తే టికెట్ ప్రసాదరెడ్డిదే.. కాకుంటే రఘురాంరెడ్డిదే అంటున్నారు.
  • ఈ మొత్తం ఎపిసోడ్ లో తాజా ట్విస్ట్ ఏమిటంటే.. ఖమ్మం బరిలో ప్రియాంకా గాంధీని నిలిపే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ఓ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది.  
  • ఖమ్మం ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ పార్టీలో మరెన్ని ట్విస్టులో అనుకుంటున్నారా..? ఏ ట్విస్టు ఏ మలుపునకు దారి తీసినా మరి కొద్ది గంటలు మాత్రమే..

Comments are closed.

Exit mobile version