వరంగల్ సెంట్రల్ జైలు ఖాళీ అవుతోంది. ఈమేరకు జైల్లోని ఖైదీలను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని, ప్రస్థుతం జైలు వున్న ప్రాంగణంలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. వరంగల్ జైలులో ప్రస్థుతం వున్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని, హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్దం చేయాలని తర్వాతి కేబినెట్ కు తీసుకురావాలని హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వరంగల్ జైలులో గల ఖైదీలను అనువైన వివిధ ప్రాంతాలకు తరలింపు ప్రక్రియను చేపట్టారు.

కాగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది వరంగల్ సెంట్రల్ జైల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 15 నుండి 20 రోజుల లో వరంగల్ కేంద్ర కారాగారాన్ని పూర్తిగా తరలిస్తామన్నారు. ఇప్పటికే 119 మంది ఖైదీలను తరలించామని, అందులో 80 మంది పురుషులు, 39 మంది మహిళా ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా 267 మంది సిబ్బంది ఉన్న వరంగల్ కేంద్ర కారాగారంలో వారి ఇష్టానుసారంగా, అనుకూలంగా ఉన్న చోటుకు బదిలీ చేస్తామన్నారు. రెండేళ్లలో అత్యాధునిక హంగులతో కొత్త జైల్ నిర్మిస్తామని, మొత్తం 956 మంది ఖైదీలు వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్నారని రాజీవ్ త్రివేది వివరించారు.

Comments are closed.

Exit mobile version