కడియం శ్రీహరి.. తెలంగాణా మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూడా. రాజకీయ చతురతను ప్రదర్శించడంలో శ్రీహరి లౌక్యం తరచూ చర్చకు దారి తీస్తుంటుంది. తనదైన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ అధికార పదవులను దక్కించుకోవడంలో శ్రీహరికి మరెవరూ సాటి రారనే ప్రచారం పార్టీ కార్యకర్తల్లో సాగుతోంది. తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో శ్రీహరి అడుగులు హాట్ టాపిక్ గా మారిన పరిణామాలు ఆయన నేపథ్యాన్ని స్ఫురణకు తీసుకువస్తున్నాయి. మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో కడియం శ్రీహరి అనుసరిస్తున్న రాజకీయ వ్యవహార శైలి పరిశీలకులకు సైతం అంతుబట్టకపోవడమే అసలు విశేషం.

నిజానికి కడియం శ్రీహరి కాకలుతీరిన రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన నాయకుడేమీ కాదు. వరంగల్ మహానగరంలో ఒకప్పుడు సాధారణ లెక్చరర్ మాత్రమే. ఎన్టీఆర్ పిలుపుమేరకు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన కడియం తొలుత వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో తలపడ్డారు. వరంగల్ మున్సిపల్ చైర్మెన్ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాదరాజు చేతిలో పరాజయం పాలయ్యారు. లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంలోకి వచ్చిన కడియం శ్రీహరి అప్పట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారనే ప్రచారం ఉంది. తన సహాధ్యాయులైన లెక్చరర్లు కొందరు శ్రీహరిని ఆర్థికంగా ఆదుకున్నారనే కథనాలు ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్నాయి.

వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన కడియం శ్రీహరి 1994 ఎన్నికల్లో తొలిసారి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా, చంద్రబాబు కేబినెట్ లో సంక్షేమ, విద్య, నీటిపారుదల శాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగానూ వ్యవహరించారు. టీడీపీకి రాజీనామా చేసి 2013లో టీఆర్ఎస్ లో చేరిన కడియం ఆ పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.

పదేళ్ల బంధానికి వీడ్కోలు?

అయితే తెలంగాణా తొలి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించి ఆ స్థానంలో అప్పటి సీఎం కేసీఆర్ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను తోసిరాజని పార్టీ టికెట్ ను దక్కించుకుని విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరపై కేవలం 7,779 ఓట్ల అధిక్యతతో శ్రీహరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై శ్రీహరి వ్యాఖ్యలు వివాదాస్పమయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేల సంఖ్యను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కడియం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. శ్రీహరి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీలో తనదైన శైలి రాజకీయం నెరపడంలో శ్రీహరి అనుసరించే వైఖరిపైనే భిన్న వాదనలున్నాయి. రాజకీయ ఎత్తులు, పైఎత్తులు వేయడంలో శ్రీహరి చతురతను ప్రదర్శిస్తుంటారని ఆయనతో సన్నిహితంగా మెలిగేవారు చెబుతుంటారు. కడియం ధాటికి అనేక మంది సొంత పార్టీ నాయకులే తలోదారిని వెతుక్కున్నారనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. టీడీపీ నుంచి బీఆర్ఎస్ వరకు అనేక ఉదంతాలు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయని ఆయా పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తుంటాయి. టీడీపీలో ప్రణయభాస్కర్ తో సాగిన రాజకీయ ఆధిపత్యంపై అప్పట్లో సంచలన వార్తా కథనాలు కూడా వచ్చాయి. విజ‌య‌రామారావు, రాగమళ్ళ ప‌ర‌మేశ్వ‌ర్‌, దొమ్మాటి సాంబ‌య్య‌, ప‌సునూరి ద‌యాక‌ర్‌, ఆరూరి ర‌మేష్ వంటి నాయకులు బీఆర్ఎస్ కు దూరం కావడానికి కడియం స్వార్థమే కారణమని హన్మకొండ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శుక్రవారం విమర్శించారు.

కడియం రాకను వ్యతిరేకిస్తూ సింగాపురం ఇందిర అనుచరుల సమావేశం

ఆయా పరిణామాల మధ్య శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడియం శ్రీహరి రాకను వ్యతిరేకిస్తూ గత ఎన్నికల్లో ఆయనపై ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిర అనుచరులతో హైదరాబాద్ వెళ్లారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో సమావేశమై కడియంను పార్టీలో చేర్చుకోవద్దని అభ్యర్థించినట్లు సమాచారం. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని, పార్టీ కార్యకర్తలను శ్రీహరి ఎలా ఇబ్బంది పెట్టారనే అంశంపై ఇందిర తన అనుచరులతో కలిసి దీపాదాస్ కు వివరించారట.

కడియం వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

ఆయా పరిణామాల్లోనే తన కూతురు కావ్య సహా కడియం శ్రీహరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం కూతురు రాజకీయ భవితవ్యాన్ని వెతుక్కుంటూ పుత్రికా వాత్సల్యంతోనే శ్రీహరి పార్టీ మారుతున్నారా? లేక రేవంత్ ప్రభుత్వంలో ఏదేని కీలక స్థానాన్ని ఆశిస్తూ శ్రీహరి అడుగులు వేస్తున్నారా? అనే సందేహాలను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ లో కడియం ఆధిపత్యానికి పెద్దగా ఇబ్బందులేమీ లేవంటున్నారు. కడియం కోసమే ప్రస్తుం ఎంపీ పసునూరి దయాకర్ ను, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్యను, ఆరూరి రమేశ్ తదితర నాయకులను కేసీఆర్ వదిలేసుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. అంతేగాక కడియానికి కేసీఆర్ గౌరవం ఇస్తూ ఆయన కుమార్తె కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారంటున్నారు. అయినప్పటికీ కడియం శ్రీహరి తాజా అడుగుల వెనుక అసలు మర్మం అధికారమేనా? అనే ప్రశ్నను పార్టీ శ్రేణులు ఉటంకిస్తున్నాయి. ఆయా పరిణామాల మధ్య రాజకీయంగా శ్రీహరి వేస్తున్న తాజా అడుగులకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా స్పందిస్తారనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తుండడం కొసమెరుపు.

ఇమేజ్: తన కూతురు కావ్యతో కడియం శ్రీహరి

Comments are closed.

Exit mobile version