తెలంగాణా సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు కొనియాడారు. ఎంతో మంది అమరవీరుల పోరాటాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, అంతిమంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన మహోన్నతమైన తుది సమరం ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అత్యున్నత ప్రగతిని సొంతం చేసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ నామ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆనాడు సీఎం కేసీఆర్ సారధ్యంలో సర్వ జనులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత,సకల జనులు ఉప్పెనలా కదిలారని అన్నారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరణ దీక్షకు దిగిన ఫలితంగానే కేంద్రం దిగివచ్చి, తెలంగాణ ఇవ్వక తప్పలేదన్నారు.

ఎంతో మంది అమరవీరులు తెలంగాణ కోసం రక్త తర్పణం చేసి, అమరులయ్యారని గుర్తు చేసుకుంటూ, వారికి జోహార్లు అర్పి స్తున్నట్లు నామ పేర్కొన్నారు. అనేక ఉద్యమాలు, బలిదానాలు, లాఠీదెబ్బలు, ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమ జన సమూహానికి కేసీఆర్ ఆనాడు నాయకత్వం వహించి, ఉద్యమాన్ని కీలక దశకు తీసుకువెళ్లారన్నారు. ఎవరి దయాదక్షిణ్యాల వల్లనో తెలంగాణ రాలేదని, ప్రాణాలకు తెగించి, పోరాడి సాధించుకున్నామని నామ స్పష్టం చేశారు. ఆనాడు తెలంగాణ సాధన ఉద్యమానికి నాయకత్వం వహించి, పోరాట స్ఫూర్తిని మరింత రగిల్చిన ఉద్యమ నేత కేసీఆర్ అని కొనియాడారు. ఆయనే ప్రాణాలకు తెగించి, అమరణ దీక్షకు పూనుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.

ఒకప్పుడు తెలంగాణ ఎలా ఉంది.. నేడు సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో తెలంగాణ ఎంతగా అభివృద్ధిని సాధించిందో వేరే చెప్పనక్కర్లేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట
వేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు భీమా, మిషన్ భగీరధ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి దేశానికి వన్నె తెచ్చారన్నారు. నీటిపారుదల రంగంలో వేల కోట్లు ఖర్చుతో కాళేశ్వరం, సీతారామ వంటి పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణo చేపట్టి, సాగునీటి రంగంలోను, వ్యవసాయం రంగంలోను విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చి, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసి, తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చిన ఘనత ఒక్క కేసీఆర్ కే సాధ్య మైందన్నారు. ప్రతి పథకంలోను కేసీఆర్ మార్క్ కనిపిస్తుం దన్నారు. రైతుబంధు దేశానికే ఆదర్శవంతమైన పథకమని, యావత్ దేశమంతా ఈ పథకాన్ని మెచ్చుకున్నారని అన్నారు. అలాగే మిషన్ భగీరధ పథకం కూడా అన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వ్యవసాయ రంగానికి అగ్రతాంబులం ఇచ్చి, దేశానికే తలమానికంగా తెలంగాణాని తీర్చి దిద్దారని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారన్నారు.

కరోనా సమయంలో సైతం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు కదులుతున్నారని అన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చి దిద్దడంతో నేడు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు, సవాళ్లు ఎదురైనా చెదరని గుండె ధైర్యంతో లక్ష్య సాధన కోసం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఉజ్వలమైన భవిష్యత్ కల్పించేందుకు కేసీఆర్ అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారని అన్నారు. భవిష్యత్ తరాలు గర్వపడేలా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని ఎంపీ నామ పేర్కొన్నారు. నాడు ఎడారిలా ఉన్న తెలంగాణ ప్రజల జీవన స్థితిగతుల్లో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పార్లమెంటులో తాను రాష్ట్ర పథకాలపై మాట్లాడుతుంటే పలు రాష్ట్రాల ఎంపీలు ఆశ్చర్యపోయారని, ఇటువంటి పథకాలు మా రాష్ట్రంలో కూడా అమలు చేస్తే ఎంత బాగుండునని అన్నారంటే కేసీఆర్ పాలన దక్షత గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదని ఎంపీ నామ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో కేసీఆర్ కు అండగా నిలబడి, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోదామని నామ పిలుపునిచ్చారు. ఉద్యమకారులు, వారి కుటుంబాలకు ఎంపీ నామ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

Comments are closed.

Exit mobile version