తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు నీళ్లు, నిధులు, నియామకాల నినాదమే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న నాడే తెలంగాణ ప్రజలకు అన్నింటా న్యాయం జరుగుతుందని ఉద్యమ నేతగా ఉన్నపుడు చెప్పారు కె.చంద్రశేఖర్ రావు. అనంతరం, 2014లో స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా స్పష్టమైన కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారాయన.

కోటి ఎకరాల సాగు లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం..
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో మొదటిదైన నీళ్ల విషయానికొస్తే… తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని, వలసలను నివారించడానికి సాగునీటి సౌకర్యం అత్యవసరమని ప్రభుత్వం భావించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి, అన్ని వనరుల ద్వారా రాష్ట్రంలో ఒక కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గడిచిన పదేళ్లలో 23 జిల్లాలకు కలిపి 94వేల కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు చేశారు. తెలంగాణ ఏర్పడిన ఆరేండ్ల కాలంలోనే ప్రభుత్వం బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.1,14,434 కోట్లు కేటాయించింది.

సాగునీటి లక్ష్యసాధన కోసం రాష్ట్రంలో 38 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టగా అందులో 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో కొన్నింటి పనులు పాక్షికంగా పూర్తవగా, మిగతా ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. కోయిల్ సాగర్, కిన్నెరసాని, మత్తడివాడు ప్రాజెక్టులను పూర్తిచేసింది. చనఖా-కొరటా ప్రాజెక్టు, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్ మాట్ బ్యారేజీ, మల్కాపూర్ రిజర్వాయర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వట్టిపోయిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు పునరుజ్జీవం కలిగించే గొప్ప పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు, నిరంతర నీటి లభ్యత కోసం గోదావరిపై తుపాకుల గూడెం వద్ద సమ్మక్క బ్యారేజీని కూడా నిర్మిస్తున్నది. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు , జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసింది. కాళేశ్వరంలాంటి అతిపెద్ద ప్రాజెక్టును తక్కువ సమయంలోనే పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టినే ఆకర్శించింది.

సంపద సృష్టించాలి.. ప్రజలకు పంచాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం
ఇక రెండవదైన నిధుల విషయానికొస్తే… సంపదను సృష్టించాలి, దాన్ని ప్రజలకు పంచాలి అనే ధ్యేయంతో ముందుకు పోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉండేది. తెలంగాణ ఆవిర్భవించిన ఆరేండ్లలోనే అది రెట్టింపై రూ.8.5 లక్షల కోట్లకు చేరింది. జాతీయ సగటును మించి వృద్ధిరేటు సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. రాష్టం ఆవిర్భానికి ముందు తలసరి ఆదాయం రూ.95,361 ఉంటే.. ఆరేండ్లలో అత్యధికంగా రూ.2,28,216 వరకు పెరిగింది. గత ఆరేండ్లుగా దేశవ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తే తెలంగాణ సంపద రికార్డుస్థాయిలో పెరుగుతున్నది. జాతీయస్థాయిలో జీడీపీ వృద్ధిరేటు తగ్గుతుంటే.. రాష్ట్రస్థాయిలో జీఎస్డీపీ వృద్ధిరేటు పెరుగుతుండటం గమనార్హం. ఇలా అనూహ్యంగా సృష్టించిన సంపదతో దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.40 వేల కోట్లతో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో తెలంగాణలో నివసించే ప్రజలకు కనీస జీవన భద్రత ఏర్పడింది.

నియామకాలు..
ఈ క్రమంలో మూడోదైన నియామకాల విషయానికి వస్తే.. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వశాఖల్లో చేసే ఉద్యోగాలే అన్న అపోహ చాలామందికి ఉంటుంది. కానీ, టీఎస్ పీఎస్సీ ద్వారా చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలేకాక, ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణితోపాటు, విద్యుత్ శాఖ, పోలీసుశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గురుకులాలు, విశ్వ విద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో నియామకాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కిందకే వస్తాయి. అంతేకాకుండా, కేవలం ప్రభుత్వశాఖలోనే కాకుండా ఒక నిరుద్యోగికి ఏ విధంగా పరిశ్రమల్లో, ఐటీ తదితర ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి కల్పించినా అవి కూడా ఉద్యోగాల కిందకే వస్తాయనే విషయాన్ని మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 6 సంవత్సరాల్లోనే యువత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో 1 లక్షా 32 వేల 899 ఉద్యోగాలను భర్తీ చేయించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2021 మార్చి వరకు.. శాఖల వారీగా భర్తీ చేసిన మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899 కాగా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 30,594, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ -31,972, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు- 3,623, జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ – 9,355, టిఎస్-ఆర్ టి సి- 4,768, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-12,500, జెన్కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్ పి డి సి ఎల్ – 6,648, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ – 22,637, భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు – 6,258 భర్తీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాజాగా మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను అన్నిశాఖల్లో భర్తీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అంటే ప్రభుత్వమే దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలిస్తున్నట్లుగా చెప్పవచ్చు. అలాగే, ప్రభుత్వేతర ఐటీ రంగంలో చూస్తే.. తెలంగాణ ప్రభుత్వ చొరవ, సానుకూల విధానాల వల్ల 5 లక్షల 82 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ పాలసీ రూపొందించి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కల్పించడంతో రాష్ట్రంలో దాదాపు 14 వేలకు పైగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి, మొత్తం 7 లక్షల 59 వేల మందికిపైగా ఉపాధి లభిస్తున్నది. ఇలా మొత్తంగా కలిపి చూస్తే 15 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన తెలంగాణ… దేశంలోనే సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. ఇంత తక్కువకాలంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రత కల్పించే విషయంలోగానీ, ఈపాటికే విధుల్లో వున్న ప్రభుత్వ-ప్రభుత్వరంగ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విషయంలోగానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లుగా బహుశా దేశంలోని మరే రాష్ట్రం చర్యలు చేపట్టలేదంటే అతిశయోక్తి కాదేమో.

ఇక సంక్షేమరంగంలో కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి వసతి లేక వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైపోవడంతో రైతులు కూడా పేదరికం అనుభవించాల్సిన దుస్థితి ఉండేది. కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలేని దుర్భర పరిస్థితులను పేదలు అనుభవించేవారు. ఇక్కడ రోజూ ఆకలి చావులే. తెలంగాణ ఏర్పడే నాటికి ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండేది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆకలి చావులనేవి ఉండకూడదని, కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంకల్పించారు. అందుకే, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.40 వేల కోట్లతో వివిధ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.

సామాజిక బాధ్యతగా.. ‘ఆసరా పెన్షన్లు’
నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు అండగా నిలవడం సామాజిక బాధత్యగా భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 39,07,818 మందికి ప్రతినెలా ఆసరా పెన్షన్లు అందిస్తున్నది.

ఇందులో రాష్ట్రంలోని 13,41,380 మంది వృద్ధులు, 13,91,041 మంది వితంతువులు, 35,527 మంది నేత కార్మికులు, 59,920 మంది గీత కార్మికులు, 32,185 మంది ఎయిడ్స్ పేషంట్లు, 4,17,757 మంది బీడీ కార్మికులు, 1,19,640 మంది ఒంటరి మహిళలు, 16,131 మంది బోదకాలు బాధితులకు రూ.2016 చొప్పున, 4,76,864 మంది వికలాంగులకు, 43,504 మంది వృద్ధ కళాకారులకు రూ.3,016 చొప్పున ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అందజేస్తున్నది. వీరందరి పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.855 కోట్ల చొప్పున ఏటా 10,266 కోట్లు ఖర్చు చేస్తున్నది.

పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం తీర్చేందుకు ‘కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్’
రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.దీంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు కళ్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టి, రూ.1,00,016 చొప్పున అందజేస్తున్నది. ఇందులో షాదీ ముబారక్ పథకం ద్వారా 2,04,915 మందికి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 4,14,526 మందికి 6,19,441 మందికి ఈ పథకాలను అందజేశారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5556 కోట్లు ఖర్చు చేసింది.

ఆహార భద్రత కోసం‘ప్రతీ వ్యక్తికీ ఆరు కిలోల బియ్యం’
రాష్ట్రంలో ఏ పేద కుటుంబం ఆకలికి అలమటించవద్దని, కనీస ఆహార భద్రత ఉండాలని ప్రభుత్వం రేషన్ బియ్యం కోటాను పెంచింది. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యాన్ని అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 17,010 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన మొత్తం 87,93,000 కుటుంబాల్లోని 2.83 కోట్ల మందికి సంవత్సరానికి 1,78,754 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఈ పథకాలన్నింటితో తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు కనీస జీవన భద్రత ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనా విధానంతో పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి తప్పింది. అతి తక్కువ సమయంలోనే దేశంలో మరెవ్వరూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించిందనడంలో సందేహం లేదు.

గోపాల బాలరాజు,
సీనియర్ జర్నలిస్టు, 7337082570

Comments are closed.

Exit mobile version