రాజకీయ పునరేకీకరణ వంటి మాటలు లేవు…మీరు చేయలేదా? మేం చేస్తే తప్పా? వంటి దబాయింపులు లేవు…విలీనాలు ముచ్చటే లేదు…విలువలకే కట్టుబడిన పద్ధతిలో అక్కడ తొలి అడుగు పడుతోంది… ఎక్కడ అంటే…పొరుగున గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఫిరాయింపుల అంశంపై చాలా స్పష్టత ఉంది. 2014 ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు సర్కార్ చేర్చుకున్న ఘటనల పరిణామాల నుంచి జగన్ కొన్ని పద్ధతులను ఎంచుకోవడమే ఇక్కడ విశేషం. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జగన్ పార్టీలో చేరడానికి ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీకి చెందిన శాసనసభ్యులు అనేక మంది రంగం సిద్ధం చేసుకున్నారు. ‘మీ వాళ్లు చాలా మంది టచ్ లో ఉన్నారు…చేర్చుకోమంటారా?’ అని విపక్ష నేత చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రశ్నించిన ఘటన    అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే పదవులకు రాజీనామా చేయకుండా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలెవరినీ తమ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఓ పద్ధతి అనడంకన్నా సిధ్ధాంతంగా జగన్ ఎంచుకున్నారు. ఈ సిధ్దాంతాన్ని కాస్త సడలిస్తే ఈపాటికి టీడీపీకి చెందిన ఎంత మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరేవారో అంచనా వేసుకోవచ్చు. అటు కేంద్రంలో, ఇటు ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో వర్తమాన రాజకీయాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి కూడా.

జగన్ ఫార్ములాకు అనుగుణంగా అడుగులు వేస్తున్న తొలి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచిన టీడీపీ నేత వంశీ. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా వంశీ పరిస్థితి రాజకీయంగా అశాజనకంగా ఏమీ లేదనే చెప్పాలి. టీడీపీ సర్కార్ లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమ, వంశీల మధ్య రాజకీయంగా పొసిగిన దాఖలాలే లేవు. దాదాపు దశాబ్ధకాలంగా వీరిద్దరి మధ్య పలు అంశాల్లో రాజకీయ వర్గపోరు సాగుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే 2011లో కృష్ణా జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర నిర్వహించిన సందర్భంగా విజయవాడ నగరంలోనే వంశీ ఆయనను కలిసి ఆలింగనం చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలకలానికి కారణమైంది. దీనిపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వాస్తవానికి గుడివాడ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా, వల్లభనేని వంశీ మంచి స్నేహితులు. నాని, వంశీలకు సినీ నిర్మాణ రంగంలోనూ ప్రవేశముంది. జూనియర్ ఎన్టీఆర్ తో పలు చిత్రాలు కూడా నిర్మించారు. వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం వివిధ మలుపులు తిరిగిన నేపథ్యంలో కొడాలి నాని జగన్ వెంట నిలిచారు. వంశీ సైతం జగన్ తో టచ్ లోనే ఉన్నట్లు ప్రచారం జరిగినా, ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ, తన అనుచరుల ఇళ్ల ధ్వంసం తదితర పరిణామాల నేపథ్యంలో వంశీ తాజాగా సీఎం జగన్ ను కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వంశీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం పూర్తిగా సిద్ధమైంది. అయితే జగన్ ఫార్ములాకు అనుగుణంగానే వంశీ అడుగులు వేయక తప్పని పరిస్థతి అనివార్యమైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకునేందుకు జగన్ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవిని త్యజించి అధికార పార్టీలో చేరుతున్న వంశీ తన రాజకీయ భవితను జగన్ చేతుల్లో పెట్టడడం విశేషం. వంశీకి జగన్ మళ్లీ టికెట్ ఇస్తారా? లేక గత ఎన్నికల్లో వంశీ చేతిలో ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావుకే మరోసారి అవకాశం కల్పిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. వంశీని రాజ్యసభకు పంపిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తంగా తాను ఎంచుకున్న ఫార్ములాలోనే జగన్ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు తలుపులు తెరవడం గమనార్హం. ఇందుకు వంశీ తొలి అడుగు వేస్తుండగా, ఈ బాటలో ఇంకెంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు పయనిస్తారన్నది వేచి చూడాల్సిందే.

Comments are closed.

Exit mobile version