విపక్షంలో ఉన్నపుడు పత్రికలైనా, ప్రసార మాధ్యమాలైనా రాజకీయ నేతలకు ఓ అస్త్రంలా కనిపిస్తాయి. తమకు గొంతుకను వినిపించే శస్త్రాల్లా సాక్షాత్కరిస్తాయి. అధికారం చేపట్టిన తర్వాతే పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఈ నాయకులకు అంటరానివిగా మారుతాయి. విలేకరులను ప్రజాశత్రువులుగా కూడా అభివర్ణిస్తుంటారు. అది అమెరికా కావచ్చు…ఆంధ్రా కావచ్చు…తెలంగాణా కావచ్చు. ప్రాంతం ఏదైనా, దేశం ఏదైనా కొందరు నాయకులు అధికారం చేపట్టగానే పత్రికలు, ప్రసార మాధ్యమాలు వారికి ఆగర్భ శత్రువులుగా కనిపిస్తాయి. పత్రికలపై, విలేకరులపై అక్కసు వెళ్లగక్కడం ఈనాడు కనిపిస్తున్న దృశ్యాలు ఏమీ కాదు. పూర్వ కాలంలో కొందరు నాయకులు తమకు నచ్చని వార్తలు ప్రచురితమైతే గుడ్లురిమి చూడడమో, గట్టిగా గద్దించడమో చేసేవారు. కొన్ని సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసేవారు. కానీ ప్రకటితంగానో, అప్రకటితంగానో నిషేధం మాత్రం విధించిన దాఖలాలు అరుదనే చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే…

అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ కు అకస్మాత్తుగా పత్రికలపై కోపం వచ్చిందట. చిర్రెత్తుకొచ్చి రెండు పత్రికలను నిషేదించారట. వైట్ హౌస్ లో ఆ పత్రికలు కనిపించరాదని ట్రంప్ ఆదేశించినట్లు ఓ వార్తా కథనం. అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ పత్రికల తీరుపై ట్రంప్ మండిపడుతున్నారు. ఆయా పత్రికలు ఫేక్ వార్తలు రాస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలలో వాటికి చందా నిలిపివేయాలని కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారుట. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ట్రంప్ ఆ రెండు పత్రికలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ సందర్భంలో విలేకరులను ప్రజా శత్రువులుగా ట్రంప్ అభివర్ణించారట. ఇదిలా ఉండగా 1960వ దశకంలో అప్పటి అమెరికా అద్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి కూడా కొన్ని పత్రికలను ఇలాగే నిషేధించారట. ఇప్పుడు ట్రంప్ కూడా అలాగే చేశారని అంటున్నారు. ట్రంప్ ఆదేశాల మేరకు వైట్ హౌస్ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలను నిలిపివేశారు.

పత్రికలపై, ప్రసార మాధ్యమాలపై అక్కసు వెళ్లగక్కడం అమెరికాలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనూ చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి వెనక్కి వెడితే… ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తాను వినియోగించే యాదగిరి హెలీకాప్టర్ ను తనకు ఎక్కడో చోట తగిలించి కార్టూన్లు వేస్తున్నారని, వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఓ పత్రికా విలేకరిని తోలు తీస్తానని హెచ్చరించినట్లు అప్పటి సీనియర్ జర్నలిస్టులు చెబుతుంటారు. వారి కథనం ప్రకారం… సెక్రటేరియట్, అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కవద్దని అంజయ్య హుంకరించారు. చెన్నారెడ్డా? చందా రెడ్డా? అనే శీర్షికన వార్త రాసినందుకు ఏకంగా ఈనాడు ఆఫీసులో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పోలీసులతో లాఠీ ఛార్జి చేయించారు. బోఫోర్స్ లో…లోఫర్స్ అనే శీర్షికన వార్తా కథనం రాసినందుకు మరో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారట.

ఇక గడచిన దశాబ్ధంన్నర కాలంలో మీడియాపై అధికారంలో గల ముఖ్యమంత్రుల వ్యవహార శైలిని పరిశీలిస్తే…2004లో అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఆ రెండు పత్రికలు’ అంటూ పరోక్షంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిల వైఖరులను తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. ఈ పత్రికల వైఖరిపై ఆయన విసిగిన కారణంగానే సాక్షి పత్రిక ఆవిర్భావం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమం సందర్భంగా ఆంధ్రా పత్రికలు అంటూ కేసీఆర్ నిందించేవారు. ఈ నిందల్లో భాగంగానే రామోజీ ఫిలింసిటీలో లక్ష నాగళ్లతో దున్నిస్తానని హెచ్చరికలు జారీ చేసేవారు. సీఎం అయ్యాక రామోజీ ఫిలింసిటీని సందర్శించి అద్భుత కట్టడంగా అభివర్ణిస్తూ… కేసీఆర్ కితాబు ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లపై కొంతకాలం పాటు అప్రకటిత నిషేధం విధించిన విషయమూ విదితమే. కాలక్రమంలో టీవీ9 ఛానల్ ప్రస్తుతం కేసీఆర్ సన్నిహితుడు మైహోం రామేశ్వరరావు చేతుల్లోకి వెళ్లింది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు సాక్షి పత్రికపై నిప్పులు కక్కారు. సాక్షి విలేకరులను పాత్రికేయ సమావేశాలకు పిలవరాదని నిషేధం విధించుకున్నారు. ఎన్ టీవీ ప్రసారాలను కూడా కత్తిరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గత ఎన్నికల్లో తెలంగాణ సీఎంగా రెండోసారి పగ్గాలు చేపట్టిన కేసీఆర్ మీడియాను భయపెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో భారీ విజయాన్ని సాధించి సీఎంగా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లపై అప్రకటిత నిషేధం విధించినట్లు ఆయా సంస్థల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

కొసమెరుపు ఏమిటంటే…మీడియాపై అప్రకటిత నిషేధం విధించడం అప్రజాస్వామికమని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన సన్నిహితులు ప్రస్తుతం గగ్గోలు పెడుతుండగా, ప్రస్తుత పాలకపక్ష నేతలు పలువురు విపక్షంలో ఉన్నపుడు పత్రికా స్వేచ్ఛ గురించి గతంలో గొంతు చించుకోవడం.

Comments are closed.

Exit mobile version