కల్వకుంట్ల చంద్రశేఖర్రావు…, వైఎస్ జగన్మోహన్ రెడ్డి…తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు…ప్రస్తుతానికైతే ఇద్దరు మంచి దోస్తులు. (ప్రస్తుతానికి అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే…రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శత్రుత్వం ఉండదు. రాజకీయ అవసరాలు, పరిస్థితులను బట్టి మార్పులు అనివార్యం. మానుకోట రాళ్లదాడి నుంచి వర్తమాన రాజకీయాలు ఇదే అంశాన్ని మరోసారి స్పష్టం చేశాయి.) ఆంద్ర రాష్ట్రంలో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోవాలని, జగన్ రావాలని కోరుకున్నవారిలో కేసీఆర్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తన ఆకాంక్ష సిధ్ధించిన తర్వాత జగన్ తో కేసీఆర్ దోస్తీ గురించీ తెలిసిందే. ఇక్కడి సీఎం అక్కడికి, అక్కడి సీఎం ఇక్కడికి పరస్పరం పర్యటనలు జరపడం, సమావేశాల నిర్వహణ, పలు అంశాలపై చర్చోపచర్చల గురించి తాజాగా చెప్పుకోవలసింది కూడా ఏమీ లేదు. మనిద్దరం కలిసి ఉంటే కేంద్రంతో పనే లేదనే విధంగా ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఆంధ్ర రాష్ట్రం పచ్చగా వర్ధిల్లడానికి తన వంతు సాయం చేస్తానని కూడా పలు సమావేశాల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ఇందులోభాగమే గోదావరి జలాల తరలింపు అంశం.

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీఎస్ ఆర్టీసీని విలీనం చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. అర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు జగన్ సర్కార్ అధికారికంగానే ప్రకటించించింది. ఇందులో భాగంగా ఓ అధ్యయన కమిటీని కూడా వేశారు. ప్రక్రియలోభాగంగా సంబంధిత శాఖలకు చెందిన ఏడుగురు ఉన్నతాధికారులతో వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నవంబర్ 15వ తేదీలోపు ఈ కమిటీ పూర్తి ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నికల హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ పట్ల అక్కడి కార్మికులు ఆనందంలో నిమగ్నమైన వేళ….టీఎస్ ఆర్టీసీ సమ్మె అంశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త సందేహాన్ని కలిగిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

భూగోళం ఉన్నంత వరకు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరగదు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీకి సబంధించి ప్రయోగం చేశారు. మన్ను కూడా జరగలేదు. ఆర్డర్ తీసి కమిటీ ఏసిండ్లు. ఏమైతదో ఏమో దేవునికే ఎరుక. మూడు నెలలకో…ఆరు నెలలకో ఏదో కత చెబుతారట.’  అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల్లో కొత్త సందేహాలను, భయాలను కలిగిస్తున్నాయా? కేసీఆర్ ఎటువంటి సమాచారం లేకుండానే ఏపీఎస్ ఆర్టీసీ విలీనంపై ఆయా విధంగా మాట్లాడారా? తాను చెఫ్పింది ఖచ్చితంగా జరుగుతుందని పదే పదే పేర్కొనే కేసీఆర్ జగన్ సర్కార్ చర్యను ముందుగానే ఊహించి మాట్లాడారా? లేక ఏదేని సమాచారం ఉందా? లేక అక్కడేమీ జరగదని పరోక్షంగా చెప్పారా? కేసీఆర్ చెప్పినట్లు జరిగితే జగన్ విశ్వసనీయతకు విఘాతం కలగదా? ఇవీ కేసీఆర్ కామెంట్ పర్యావసనపు సందేహాలు. ఏపీఎస్ ఆర్టీసీ విలీనపు అంశంలో ఏం జరుగుతుందో వేచి చూస్తే తప్ప అసలు విశ్వసనీయత ఏమిటి అనేది బహిర్గం కాదు మరి.

Comments are closed.

Exit mobile version