సుమారు 500 పైచిలుకు ప్రజాప్రతినిధులు. వీరిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఒకేచోటకు చేరారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వీరందరినీ తెలంగాణా అధికార పార్టీ నేతలు ఒకే చోటకు చేర్చారనే విమర్శలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అధికార పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమె గెలుపుపై ఎటువంటి సందేహాలు కూడా లేవు. కానీ ఎన్నికలన్నాక ఓట్లు వేసే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద చేయాలి కదా? ఇందుకు విరుద్ధంగా జరిగితే తమను కనీసం పట్టించుకోలేదనే భావన వారిలో కలిగితే, ఎన్నికల్లో ఏవేని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే…? అంతా తారుమారయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు.

అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు గల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికార పార్టీ నేతలు మాంచి ‘విందు’ను ఏర్పాటు చేశారు. క్యాంపు రాజకీయాల్లో భాగంగా వారందరినీ రాజధాని శివార్లలోని ఓ రిసార్ట్స్ కు తరలించి ఫుల్ ఖుషీ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ విందులో ముక్కతోపాటు మందు ఏర్పాట్లు కూడా చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత తరపున అధికార పార్టీ నేతలు ఈ తతంగాన్ని నడిపినట్లున్నారు.

అయితే ఈ విందుకు సంబంధించిన వీడియో లీకైంది. ఇంకేముంది ఓ వైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మందు, విందు, చిందు ఏర్పాట్లేమిటనే సారాంశంతో విమర్శలు గుప్పించారు. ‘మందు’ పార్టీ ఏర్పాటు ద్వారా ప్రజల ప్రాణాలకన్నా కేసీఆర్ కూతురు రాజకీయ ఉద్యోగమే ముఖ్యమైందని తెలంగాణా కాంగ్రెస్ వ్యాఖ్యనించింది. కరోనా వైరస్ తీవ్రత వల్ల పెళ్లిళ్లు, విద్యార్థుల పరీక్షలే రద్దయ్యాయని, ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రచారం 500 మంది కుటుంబాలను ‘రిస్క్’లోకి నెట్టినట్లయిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

Comments are closed.

Exit mobile version