మనిషికి కులం ఉండవచ్చు. కానీ నేరానికి కులం ఉండకూడదు కదా? ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏ కులానికి చెందిన వారు దారుణ హత్యకు గురైనా అది అన్యాయమే. న్యాయం జరగాలని అందరూ నినదించాల్సిందే. జరిగే వరకు పట్టుబట్టాల్సిందే. ఎవరిదైనా ప్రాణమే కదా? ఇందులో ఏ వివక్షా ఉండకూడదు.

హైదరాబాద్ లో జరిగిన దిశ హత్యోదంతం తెలంగాణా రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా కుదిపేసింది. పార్లమెంట్ లోనూ ప్రకంపనలు సృష్టించింది. దిశ ఘటన చాలదన్నట్లు తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో మరో దురాగతం. అత్యాచార బాధితురాలి సజీవ దహనానికి దుండగులయత్నం. చివరికి ఆమె కూడా తుది శ్వాస విడిచింది. ఈ నేపథ్యంలోనే మరో ఘటనపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కుల వివక్షపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో అత్యాచారాలు, హత్య కేసుల్లో దళిత మహిళలకు సత్వర న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. శంషాబాద్ లో జరిగిన దిశ హత్యోదంతంకన్నా ముందు జరిగిన దళిత మహిళలపై అత్యాచారాలు, హత్యలకు గురైన ఘటనలపై ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ లో దళిత మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని, ఈ ఘటనను ఎవరూ పట్టించుకోవడం లేదని మంద కృష్ణ నిరసనకు దిగారు. కానీ ఆ తర్వాత జరిగిన శంషాబాద్ దిశ హత్యోదంతంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర న్యాయం కోసం డిమాండ్ చేయడం కుల వివక్ష కాదా? అని ఆయన ప్రశ్నిస్తున్న తరుణంలోనే దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన జరిగింది.

ఇక అసలు విషయానికి వద్దాం. ఒకరు కాదు ఇద్దరు కాదు అక్షరాలా పదిహేడు మంది ఆదివాసీల ప్రాణాలు. పోలీసు భద్రతా బలగాలు పొట్టన పెట్టుకున్నాయి. మావోయిస్టు నక్సల్స్ నెపంతో పిట్టలను కాల్చినట్లు కాల్చారు. ఇది ఆరోపణ కాదు. జస్టిస్ వీకే అగర్వాల్ కమిషన్ తన న్యాయ విచారణలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎక్కడో కాదు తెలంగాణా సరిహద్దుల్లోని ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో గల బీజాపూర్ జిల్లా సర్కేగూడ అడవుల్లో. సాధారణంగా ఎన్కౌంటర్ల ఘటనలపై ఎక్కువగా మెజిస్టీరియల్ విచారణలే జరుగుతుంటాయి. కానీ కొన్ని సంఘటనల్లో న్యాయ విచారణ కూడా జరుగుతుంటుంది.

సర్కేగూడ ఎన్కౌంటర్ పై కూడా బీజేపీకి చెందిన అప్పటి ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. జస్టిస్ అగర్వాల్ కమిషన్ సర్కేగూడ ఎన్కౌంటర్ పై పోలీసుల తీరును బట్టబయలు చేసింది. భద్రతా బలగాల పొరపాటువల్లనో, కంగారు వల్లనో ఎన్కౌంటర్ జరిగిందని, చనిపోయిన 17 మంది ఆదివాసీలు మావోయిస్టులని నిరూపించేందుకు పోలీసుల వద్ద ఎటువంటి ఆధారాలు లేవని కూడా కుండబద్దలు కొట్టింది. ఈ ఎన్కౌంటర్ పై జస్టిస్ అగర్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదిక లీకై మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. అన్యాయంగా 17 మంది అడవి బిడ్డలను పొట్టన పెట్టుకున్న ఈ అంశం ఇప్పడు పార్లమెంట్ లో ప్రస్తావనకు రావడం లేదు. ఎవరూ తీసుకురావం లేదు కూడా. బాధ్యులపై చర్యలకు ఎంపీలెవరూ పట్టుబట్టడం లేదు. ఎందుకంటే వాళ్లంతా అడవి బిడ్డలు, వారంతా చదువుకున్నవారు కాదు. అడవితల్లినే నమ్ముకుని జీవించేవారు. తమ కుటుంబాలకు జరిగిన అన్యాయం గురించి ఎవరిని ప్రశ్నించాలో కూడా తెలియని దైన్య స్థితి. ధైర్యం చేసి ప్రశ్నిస్తే మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళన. ఇప్పటికే చెట్టుకొకరు…పుట్టకొకరు…చెల్లా చెదురైన ఆదివాసీల జీవితాలు. తెలంగాణా అడవులకు బతుకు జీవుడా అంటూ తట్టా, బుట్టా సర్దుకుని వలస బాటన పరుగెడుతున్న పరిస్థితి. సర్కేగూడ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అధికారంలో గల బీజేపీ నేతలు ఈ ఘటనపై ఇప్పడేమంటున్నారో తెలుసా? అసలు జస్టిస్ అగర్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఎలా లీకైంది? అని.

అందుకే సర్కేగూడ అడవుల సాక్షిగా జరిగిన అన్యాయంపై, ఆ 17 మంది అడవిబడ్డల ప్రాణాల గురించి కూడా ప్రశ్నించేందుకు అక్కడా ఓ మంద కృష్ణ లాంటి నాయకుడు కావాలి.

Comments are closed.

Exit mobile version