దేశంలో స్త్రీలపై జరుగుతున్న హింసపై, అత్యాచారాలపై ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికి స్త్రీలపై ఘోరాలను అరికట్టకలేకపోతున్నారు. ఈ తరుణంలో స్త్రీలపై ఇలాంటి అమానవీయ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నట్లు? ఇలాంటి అత్యాచారాలకు కారణాలేంటో తెలుసుకోకుండా స్త్రీలకు రక్షణ ఇవ్వలేము.

1. దేశంలో రోజు రోజుకు సంపన్నుల ఆస్తులు రెట్టింపై కోటీశ్వర్లుగా మారుతుంటే పేదలు మరింత పేదలై కూటికోసం కోటి తిప్పలు పడుతున్నారు. ప్రజల మధ్య ఆర్ధిక అసమానాతలతో పాటు సామాజిక, సాంఘీక అసమానతలు నానాటికి పెరిగిపోతున్నాయి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిశ్రామికీకరణ వల్ల పల్లెల్లో ఉపాధి కరువై బతుకుకోసం పేదలు పట్టణాలకు వలసలు పోతున్నారు. దాంతో పట్టణాలు విస్తరించి పట్టణాల్లో అసమానతల సమాజం ఏర్పడుతుంది. బతుకు కోసం పట్టణాలకు వలస వచ్చిన ప్రజలకు పట్టణాల్లోని సంపన్నుల పోకడలు, వేష, భాషలు ఈర్ష్యా, ద్వేషాలను పెంచుతున్నాయి. నిత్యం శ్రమ చేసే వర్గాల ముందు సంపన్నుల పోకడలు, ఆర్ధిక అసమానతలు, సామాజిక అసమానాతల వల్ల స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. పట్టణాల్లోని సంపన్న వర్గాలు, ఉన్నత మధ్యతరగతి వర్గాలు పేదలతో, శ్రామికులతో మర్యాదగా ప్రవర్తించే లక్షణాలు చాలా తక్కువ అందువల్ల కూడా ప్రజల మధ్య అగాధం నెలకొన్నది. పట్టణాల్లో సంపన్న వర్గాల చీకటి నేరాలు బయటపడటం, ఆ చీకటి నేరాల్లో పేదలు బలికావడం, ఈ వైట్ కాలర్ నేరాలు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కావడం వల్ల కూడా నేరాల పెరుగుదలకు హేతువవుతున్నాయి. పట్టణ నాగరిక పోకడలు పల్లె సంస్కృతి మధ్య విపరీత వైరుధ్యమే ఇలాంటి నేరాలకు హేతువు అవుతుంది. పట్టణాలకు విపరీత వలసలవల్ల స్త్రీలపై అత్యాచారాలే కాక మోసాలు, దోపీడీలు, వైట్ కాలర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి.

2. చరిత్ర – వర్తమానం:
స్త్రీలపై అత్యాచారాలకు చరిత్రలోని కథలు, పురాణాలు కూడా కారణమే. రామాయణంలో శూర్పణఖను ముక్కు చెవులు కోసిన రాముడు, మహాభారతంలో స్నానం చేస్తున్న స్త్రీల బట్టలు ఎత్తుకెళ్లిన కృష్ణుడు, నిండు పురుషుల సభలో ద్రౌపదిని వివస్త్రను చేయడం. ఆ విధంగా చేయడం మా హక్కుగా మాట్లాడిన చరిత్ర మన దేశంలో ఉంది. చరిత్రలో ఇలాంటి ఎన్నో ఘటనలను ఆనాటి నుండి నేటివరకు ప్రజలకు బోధిస్తూ స్త్రీలపై అత్యాచారాలు పెరగడానికి మన పాలకులు కారణమయ్యారు. వర్తమానంలో ప్రజలముందుకొస్తున్న సినిమాల్లో కూడ స్త్రీలను చిన్న చూపుగా చూపించడం, స్త్రీలను విలన్ రేప్ చేయడం, హీరో ఒక అమ్మాయి వెనుకబడి వేధించి, బెదిరించి ప్రేమించడం, విలన్లు స్త్రీలను కిడ్నాప్ చేయడం ఇలా అన్ని సందర్భాల్లో స్త్రీని ఏమైనా చేయవచ్చు అనే సందేశాన్నిస్తున్న సినిమాలు కూడా స్త్రీలపై దాడులకు కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ వల్ల కూడా యువత పెడ దారి పడుతుంది. సినిమాలను, సీరియళ్లను, ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే అశ్లీల చిత్రాలను అరికట్టడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం వల్ల కూడా స్త్రీలపై నేరాలు పెరిగిపోతున్నాయ

3. ప్రగతిశీల శక్తులు:
ప్రగతిశీల, ప్రజాస్వామిక ఉద్యమాలు సన్నగిల్లినప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతుంటాయి. ప్రగతీల ఉద్యమాలపై, ప్రశ్నించే గొంతుకులపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించడం వల్ల ప్రజలకు సంఘటిత చైతన్యం కోల్పోయి నానాటికి ఒంటరి జీవితాలు ఎక్కువై కూడా స్త్రీలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఇండియాలో గతంలో ఎన్నో ప్రగతిశీల ఉద్యమాలు, ప్రగతిశీల విద్యార్థి సంఘాలు, ప్రగతిశీల యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు ఉండేవి ఈ సంఘాల వారు నిత్యం విద్యా సంస్థల్లో, యువతలో, కార్మికుల్లో మానవీయ విలువల బోధనలు, స్త్రీ సమానత్వం, స్త్రీలను గౌరవించడం గూర్చి భోధిస్తూ, ఆచరనాత్మకంగా జీవించేవారు. పాలకుల ఆధిపత్య పోకడలతో ప్రగతీల శక్తులు క్రమేనా కనుమరుగవుతుండడడం తో మానవీయ విలువలకు దూరమైన ప్రజలు స్త్రీలపై, బలహీన వర్గాలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.

4. ప్రజల ఆందోళనలు – చట్టాలు – కఠినమైన శిక్షలు:
స్త్రీలపై దాడులు, హత్యాచారాల్లో, హింసలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులకు రక్షణ కల్పించడంలో చూపిన శ్రద్ధ మహిళలకు రక్షణ ఇవ్వడంలో మన ప్రభుత్వాలు చూపించడంలేదు. జనాభాకు సరిపడా పోలీసులు లేరు. ఒక లక్ష జనాభాకు 130 మంది పోలీసులు మాత్రమే ఉండగా, ప్రజలకు సత్వర న్యాయం అందించి దోషులను శిక్షించే న్యాయస్థానాల్లో 50 శాతం ఖాళీలు ఉన్నాయి. మహిళలపై మానభంగాలు చేసినవారు చట్టసభల్లో కూర్చున్నారు. అలాంటి వారు మహిళా రక్షణకు ఏమి చట్టాలు తెస్తారు? ఒకవేళ ప్రజల ఆందోళనతో చట్టాలు తెచ్చిన వాటి అమలులో అలసత్వమే చూపిస్తారు.

స్త్రీలపై హత్యాచారాలు జరిగినప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి వారి ఆవేశాన్ని వెళ్లగక్కి నిందుతులను కఠినంగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఉరిశిక్ష వేయాలి, నడి వీధిలో బహిరంగంగా ఉరి తీయాలి, రాళ్ళతో కొట్టి చంపాలి, హింసించి చంపాలి అంటూ కాండీల్ ర్యాలీ, ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేయడం, అందుకు బదులుగా పోలీసులు ఎన్కౌంటర్ చేసి నిందితులను చంపేయడంతో చేతులు దులుపుకుంటున్నారు. కోర్టులు ఉరిశిక్షలు వేయడంతో వారి పని అయిందనిపిస్తున్నారు. ప్రజల డిమాండ్ తో పాలకులు కొత్త చట్టాలను తెచ్చి ప్రజలను శాంత పరుస్తున్నారు తప్ప స్త్రీలపై దాడులను అరికట్టడంలేదు. పాలకులకు చిత్తశుద్ధి లేకుండా ఎన్ని చట్టాలు తెచ్చిన ఫలితమేముండదని తెలుస్తుంది. పోలీసుల ఎన్కౌంటర్లు, కోర్టుల కఠిన శిక్షలు స్త్రీలపై అత్యాచారాలను, దాడులను ఆపలేకపోతున్నాయనేది మితిమీరుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

కొత్త చట్టాలను తీసుకొచ్చి మేము సైతం స్త్రీల పక్షాన ఉన్నామని నమ్మబలుకుతూ ప్రజల ఆందోళనకు పాలకులు సమాధానం చెబుతుండడం పరిపాటయింది. నిర్బయ హత్యాచారం తో ప్రజల నుండి వచ్చిన ఆందోళనలతో ఏడేండ్ల కింద నిర్బయ చట్టం తీసుకొచ్చారు. తలాక్ చట్టం తీసుకొచ్చి ముస్లిం మహిళల పక్షాన ఉన్నట్లు చెప్పుకుంటున్న పాలకులు కులం పేరున, మతం పేరున జరిగే దాడులను అరికట్టడం లేదు. కుల మతాల అడ్డు గోడలను దాటి ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వాళ్ళను కులం, మతం పేరున హింసిస్తున్నప్పటికి, మత మార్పిడులకు పాల్పడుతున్నారని దాడులు చేస్తున్నా అడిగేవారు లేరు. చట్టాలు తెస్తున్న పాలకులు నగర సంస్కృతిలో పట్టణీకరణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పాలకులు అదుపుచేయడంలో విఫలమవుతున్నారు.

పాక్షిక సమాజానికి ప్రజాస్వామిక స్వేచ్ఛను కల్పిస్తున్న ప్రభుత్వాలు విచ్చలవిడిగా అనేక రూపాల్లో జరుగుతున్న విచక్షణా రహిత పాశవిక దాడులను నిర్మూలించలేకపోవడం పెద్ద ప్రశ్న. వీటన్నిటిని నియంత్రించకుండా తలాక్, నిర్బయ లాంటి చట్టాల వల్ల ఆ వైపు ఉన్న సమాజానికి ఒరిగేది ఏముండదు. ప్రశ్నించే గొంతుకలు, మేధో సంపత్తి కలిగిన నరేంద్ర దబోల్కర్, గౌరి లంకేశ్ ల మీద పాలకవర్గానికి చెందిన వారే దాడులు చేసి చంపేస్తుంటే ఎన్ని చట్టాలు తెచ్చిన ఏమి ఫలితం?

5. పాలకుల బాధ్యత:
సామాజిక అసమాతలను రూపుమాపి సమానత్వాన్ని సామాజిక సమతుల్యతను స్థాపించాల్సిన బాధ్యత రాజ్యంపై ఉంది. కొద్ది మంది చేతిలో దేశ సంపద పోగు పడకుండా చూసే బాధ్యత కూడా రాజ్యం మీదనే ఉంది. సామాజిక సమతుల్యతను కాపాడాలనే చొరవ పాలకులకు తగ్గిపోయినందునే ఇన్ని అసమానతలు ఏర్పడి స్త్రీలపై అఘాయిత్యాలకు కారణమవుతున్నాయి. సమాజంలో సకల అసమానతలు పెరిగి ఎన్నో నష్టాలకు దారి తీస్తున్నాయి. తద్వారా కలిసి మెలిసి బతకాల్సిన ప్రజలు కలహించుకుంటున్నారు.
ప్రజలందరికి సమాన విద్య అందించాల్సిన రాజ్యం అందుకు భిన్నంగా ఉన్నోళ్లకు ఒక విద్య లేనోళ్ళకు ఒక విద్య అందిస్తూ కూడా చాలా మందికి విద్యను దూరం చేయడం వల్ల అసమానతలు పెరిగిపోతున్నాయి. ప్రజలు వ్యసనాల బారిన పడకుండా చూడాల్సిన పాలకులు ఏకంగా మద్యం వ్యాపారం చేస్తూ బార్లను బార్లా తెరిచి నేరాలకు కారకులవుతున్నారు. మద్యం ఆదాయంతో ప్రభుత్వాలను నడపాలనే దృక్పధాన్ని పాలకులు వీడి మద్యపాన నిషేధం లేదా మద్యపాన నియంత్రణ చేసిన నాడే ఇలాంటి ఘోరాలను అదుపు చేయవచ్చు.

స్త్రీ విద్యలో రాణించాలని ప్రచారం చేస్తున్న పాలకులు స్త్రీ మనోధైర్యంగా బతికే బోధనలు, విద్యా సంస్థల్లో స్త్రీ సమానత్వం గూర్చి విలువల బోధన చేయాల్సిన బాధ్యత కూడా పాలకులపైనే ఉంది. చట్టాలు చేసి సమాజాన్ని రక్షించాలనుకునే పాలకులు అందులో కాసింత శ్రద్ధ తీసుకొని అసమానాతలను తొలిగిస్తే ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు. ఘోర సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, కొత్త చట్టాలను రూపొందించడం ఎన్కౌంటర్ లో నిందితులను హతమార్చడం రాజ్యానికి పరిపాటయింది. నిర్బయ సంఘటన జరిగిన తర్వాత నిర్బయ చట్టం తేవడమే కాకుండా బాధితుల సహాయ నిధి కింద వెయ్యి కోట్లు మంజూరు చేస్తే అవి ఇప్పుడు 3,600 కోట్లు అయ్యాయి. అయినా నేరాలు ఆగడం లేదనే విషయం పాలకులు ప్రజలు ఆలోచించాలి. నేరాల అదుపుకు సమానత్వం అవసరమనే విషయం గుర్తించాలి. సమాజాన్ని సక్కదిద్ధి చట్ట ప్రకారం పాలన చేయాల్సిన పాలకులు చట్ట సభల్లో సామాన్య ప్రజలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ లోని నాయకులు సమాజంలోని ఇలాంటి రుగ్మతలను రూపుమాపడానికి చర్చలు చేయడం లేదు ఏపాటికి చట్టాలు, శిక్షలపైనే మాట్లాడుతున్నారు. ఏ బావాజాలం వల్ల స్త్రీలపై దారుణాలు ఎక్కువవుతున్నాయో ఆ బావాజాలానికి సంబందించిన సంఘాలు, విద్యార్థి సంఘాలు, పాలకవర్గాలు విద్యార్థుల చేత ర్యాలీలు చేయిస్తుండడం దుర్మార్గం. కట్టుకున్న భార్యను, కన్న తల్లిని కడతేర్చే సమాజం ఎందుకు నిర్మితమవుతుందో మన పాలకులు ఆలోచించాలి.

6. ప్రజల తీరు మారాలి
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే రోడ్ల పైకి వచ్చి నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు చేసే వాల్లు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి పాలన అవసరమో అందుకోసం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. స్త్రీని అందరూ నమ్మించి నట్టేట ముంచుతున్నారు. అన్న, తమ్ముడు, తండ్రి అందరూ సెక్స్ సింబల్ గా చూస్తున్నారు. స్త్రీకి మనసుంటుదని, వారి శరీరంపై వారికి ప్రత్యేక గౌరవం ఉంటుందని ఈ సమాజానికి తెలియ చెప్పాలి. విద్యకు దూరమవుతున్న పేదలకు సినిమాలు,మద్యం తోడై మృగాలుగా మారుతున్నారు. మానవులు మృగాలుగా మారుతున్న విషయాలపై ఇంట బయట చర్చ జరగాలి. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలకు మరొకరు బలి కాకుండా చూడవచ్చును.

7. ఎన్కౌంటర్, ఉరిశిక్షలతో స్త్రీలపై అత్యాచారాలు ఆగవు:
ఎన్కౌంటర్, ఉరి శిక్షాలతో స్త్రీలపై అత్యాచారాలు ఆగవని పెరుగుతున్న నేరాలు రుజువు చేస్తున్నాయి. గత 10 ఏండ్ల క్రితం వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడిలో ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ లో నిర్బయ ఘటన జరిగింది. నిర్బయ నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేశారు. వరంగల్ లో మరొక కేసులో ఉరిశిక్ష విధించిన కొద్ది రోజుల్లోనే తొమ్మిదవ తరగతి అమ్మాయిని చంపారు. దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుండగానే స్త్రీలపై హత్యాచారాలు జరుగుతున్నాయంటే కఠినమైన శిక్షలతో నేరాలు ఆగవని తెలుసుకోవాలి. సామాజిక సమతుల్యత వల్ల, సమాజంలో ఉన్న అసమానాతల వల్ల, ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని అర్ధం చేసుకోవాలి.
ఏ పరిస్థితుల్లో, ఏ నేపథ్యంలో ఇలాంటి దూరాఘాతాలకు పాల్పడుతున్నారో పరిశోధించాలి. మెజార్టీ ప్రజలను చదువుకు ఉపాధికి దూరం చేసి, సంస్కారవంతమైన జీవితాలకు దూరం చేసి, మంచి చెడులు తెలియని వింత పశువులను చేసి, మానవ మృగాలుగా తయారు చేసి, ఈరోజు మనం ఎంత మొత్తుకున్నా, ఎన్ని శిక్షలు వేసినా, ఎన్కౌంటర్లు చేసినా ఇలాంటి నేరాలు, ఘోరాలు అదుపు చేయలేము. ఆర్ధిక అసమానతలు, సామాజిక అసమానతలు రూపమాపకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని ఘటనలు జరుగుతాయని సమాజం అర్ధం చేసుకోవాలి.

-సాయిని నరేందర్,

సీనియర్ జర్నలిస్టు,

రాష్ట్ర కన్వీనర్, బీసీ స్టడీ ఫోరం

Comments are closed.

Exit mobile version