తెలంగాణా రాష్ట్రంలో నక్సలిజాన్ని కూకటివేళ్లతో నిర్మూలించామని చెబుతుంటారు పోలీసు ఉన్నతాధికారులు కొందరు. ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో మావోయిస్టులు చొరబడ్డారని కూడా వాళ్లే చెబుతుంటారు. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ నక్సలైట్లకు షెల్టర్ జోన్ గా మారిందని, అవసరమైనప్పడు అడపా దడపా గోదావరి నది దాటి వస్తూ, వెళ్లిపోతూ ఉనికిని చాటుతుంటారని కూడా అదే పోలీసు వర్గాలు నివేదిస్తుంటాయి.

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన లేఖ

తెలంగాణాలో నక్సలైట్ల కదలికలపై పోలీసుల డేగకళ్ల గురించి ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. కానీ రాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ అన్నల అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వరుసగా వస్తున్న వార్నింగ్ లేఖలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణాలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ  ఈ లేఖలు ఉండడం గమనార్హం. గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుకుని ఉన్న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో మావోయిస్టు నక్సల్స్ లేఖలు అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు పట్టనీయడం లేదు. ములుగు జిల్లా పరిషత్ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ పై భూఆక్రమణ తదితర అరోపణలు చేస్తూ ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తనపై నిరాధార ఆరోపణలతో లేఖ విడుదల చేసిన సబిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఏటూరునాగారం జన క్షేత్రంలోనే తేల్చుకుందామని జగదీశ్వర్ సవాల్ విసరడం సంచలనానికి దారి తీసింది. ఈ ఘటనను మరువక ముందే అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ సుధాకర్ పేరుతో మరో లేఖ విడుదలైంది. టీఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని భూ దందాలకు, అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. ప్రశ్నించిన ప్రజలను పోలీసుల ప్రోద్భలంతో భయ, భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చింతలూరి వెంకటేశ్వర్లు గౌడ్, బాలసాని ముత్తయ్య తదితరులపై భూ అక్రమణ ఆరోపణలు చేశారు. అనేక మంది రైతులకు చెందిన భూములను వీరు దురాక్రమణ చేశారని సుధాకర్ తన లేఖలో పేర్కొన్నారు. సుధాకర్ ఉటంకించిన పేర్లలో బాలసాని ముత్తయ్య అనే టీఆర్ఎస్ నేత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ సోదరుడు కావడం గమనార్హం. అక్రమ, దందాలు, దౌర్జన్యాలను మానుకోవాలని, ఆక్రమించిన రైతుల భూములను తిరిగి అప్పగించాలని, లేకపోతే ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని కూడా సుధాకర్ హెచ్చరించారు. అయితే మావోయిస్టు నేత సుధాకర్ విడుదల చేసిన ప్రకటనలో ఎటువంటి వాస్తవం లేదని గిరిజన సంఘాల నేతలు ఖండించారు. తాము ఎవరి భూములు ఆక్రమించలేదని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ సోదరుడు ముత్తయ్య తదితరులపై సుధాకర్ లేఖ ఇదే

గమనించాల్సిన అంశమేమిటంటే ఆరోపణలు, హెచ్చరికలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు… ఇది కాదు అసలు విషయం. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు తిరిగి తెలంగాణాలో వేళ్లూనుకుంటున్నాయా? షెల్టర్ జోన్ ఛత్తీస్ గఢ్ ను వీడి నక్సల్స్ తెలంగాణా జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నారా? సాయుధ దళాలు ఏర్పాటవుతున్నాయా? ఏరియా కమిటీలు ఇందులో భాగమేనా? ఇవీ సందేహాలు. గోదావరి నదికి ఇరువైపుల గల ప్రాంతాల పేరుతో మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీల పేరుతో లేఖలు విడుదల కావడం కూడా పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నది. ఇదే దశలో తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా మరో లేఖ కూడా విడుదలైంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పీఎల్జీఏ 19వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థలో భర్తీ కావాలంటూ కూడా జగన్ తన లేఖలో యువతీ, యువకులకు పిలుపునిచ్చారు.

ఈ అంశంలో ఛత్తీస్ గఢ్ సరిహద్దు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి భిన్నంగా స్పందించడం విశేషం. మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించడంలో గట్టి దిట్టగా ప్రాచుర్యం పొందిన ఆ పోలీసు అధికారి మావోల లేఖల అంశంపై భిన్నంగా స్పందించడం గమనార్హం. తెలంగాణాలో మావోయిస్టు పార్టీకి చెందిన సాయుధ నక్సల్ దళాల కదలికలు లేవని, దాదాపు ఎనిమిది నెలల క్రితం మాత్రం నక్సల్స్ సంచరించి, తిరిగి ఛత్తీస్ గఢ్ అడవులకు వెళ్లిపోయినట్లు చెప్పారు. మావోల లేఖలు, కదలికలపై ఆ పోలీసు అధికారి చెప్పిన మరో అంశం అత్యంత ఆసక్తికరంగా ఉండడం విశేషం.

‘ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల కార్యకలాపాలను ఆయా రాష్ట్రాల నక్సల్ నేతలు అంగీకరించడం లేదు. ఏ ప్రాంతం నక్సల్స్ అదే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. అందువల్లే ఛత్తీస్ గఢ్ అడవుల నుంచే తెలంగాణా ప్రాంత కమిటీల పేరుతో లేఖలు వస్తున్నాయి. కొన్ని లేఖల విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకు స్థానిక పరిస్థితులు కారణంగా భావిస్తున్నాం’ అని ఆ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

Comments are closed.

Exit mobile version