ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ రాతలపై ఆదివారం సోషల్ మీడియాలో దాడి ప్రారంభమైంది. ప్రతి ఆదివారం తన పత్రికలోని ఎడిటోరియల్ పేజీలో ‘కొత్తపలుకు’ శీర్షికన రాధాకృష్ణ రాస్తున్న రాతలు అటు ఏపీ, ఇటు తెలంగాణా పాలకవర్గాలకు రుచించడం లేదనే అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆదివారం ఇదేనా ‘బంగరు’ భవిత? శీర్షికన తన వ్యాస పరంపరను ఆర్కే కొనసాగించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ల వైఖరిపై ఆర్కే తన సహజ శైలిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ వ్యాసమే కారణమా? గతంలో ఆయన రాసిన రాతలు కూడా కారణమేనా? అనే సంగతి తెలియకపోయినా, రాధాకృష్ణను టార్గెట్ గా చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్టును పాలకవర్గ అభిమానులో, అనుయాయులో తయరు చేసి ఉంటారని ఆంధ్రజ్యోతి ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు రాతలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఉన్నది ఉన్నట్టుగానే….ఇక చదవండి.

కొత్త పలుకుల థాట్ పోలీసింగ్ నుంచి..
రక్షించడం.. మహా ప్రభో రక్షించండి…

‘‘హింస భౌతికమైందే కాదు..
మానసికమైంది కూడా..’’ అని చాలామందే చెప్పినా..
వో సందర్భంలో తెలంగాణ రచయిత, విమర్శకుడు.. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ గారు కూడా అన్నమాటలు..ఇవి. అవి అక్షర సత్యాలని..ఆర్కే కొత్త పలుకులు…ప్రతివారం నిరూపిస్తున్నవి.
అయ్యా ఎడిటర్ గారూ.. మా అక్షరం మీ ఆయుధం అంటే..మీరు రాసే ప్రతి అక్షరం మాకు ఆయుధాల్లాగా మారుతాయేమో, వాటిని మా సమస్యల పరిష్కారం కోసం ఎక్కుపెట్టి వాడుకుందాం అనుకున్నాం..కానీ ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా ఊహించలేక పోయాం. మీరిట్లా అక్షరాలను ఆయుధాలుగా రాల్లుగా సూదులుగా కత్తులుగా ఇనుప గుండ్లుగా మార్చి మా మీదనే వారం వారం విసురుతారనుకోలేదయ్యా. మీ ఆయుధాల దెబ్బలకు మా మనసులు క్షతగాత్రలై రక్తాలోడుతున్నాయి..మహాప్రభో.

పేపరు చదువుదామని తెరిచిన ఆంధ్రజ్యోతి అభిమానులమైన మాకు మీ కొత్తపలుకులు పోస్టల్ బాంబులై మా మనసులను ఛిద్రం చేస్తున్నవి. మీ హింసాత్మక రాతల ద్వారా మానసిక హింసను ప్రేరేపిస్తున్న ఆర్కేగారూ.. సాహిత్యం పేరుతో మీరు నడుపుతున్న వ్యాస హింసను తక్షణమే నిలిపేయాలని విజ్జప్తి చేస్తున్నాం. మీ చేంతాడు వ్యాసాల థాట్ పోలీసింగ్ నుంచి తెలుగు చదవడం వచ్చిన ప్రజలను రక్షించాలని కోరుతున్నాం. లేకుంటే మీ హింసను భరించలేక పిచ్చిలేసిపోయే ప్రమాదముంది మాకు. మీ వ్యాసం చదివిన తర్వాత మాకు తిక్కలేసి ఎక్కడ ఎవరిని కొడుతామో ఎవరిని కొరుకుతామో పుసుక్కున ఇంకా ఎవరినైనా చంపుతామో అని భయమైతున్నది. ఆర్కే పాన్ మసాలాను మించిన మీ ఆర్కే కామెంట్ తో మాకు మెంటల్ లేపవద్దని..తద్వారా మమ్మల్ని నేరస్తులుగా మార్చవద్దని ప్రాథేయపడుతున్నాం. మీరు తక్షణమే మా మొర ఆలకించి మీ మసాలా కామెంట్లను నిలిపివేస్తారని…ప్రార్ధిస్తూ..

– తెలుగు వార్తా పత్రిక పాఠకుల సంఘం

( a message forwarded as recieved )

Comments are closed.

Exit mobile version