ఒకటి కాదు, రెండూ కాదు. మొత్తం ఇరవై కేసులు. దాదాపు రూ. 70 వేల కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అయిదేళ్లపాటు అప్రతిహత మనీలాండరింగ్ ఆరోపణలు. మొత్తం 38 ప్రాజెక్టులకు సంబంధించి విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆప్ గవర్నింగ్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండానే అనుమతులిచ్చినట్లు ఆరోపణలు. ఇవిగాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం కేసులో ఇద్దరు పవార్ లపై ఈడీ కేసుల నమోదు. అందులో అజిత్ పవార్ కూడా ఉన్నారు. ఆయనేనండీ…మహారాష్ట్ర తాజా రాజకీయాల్లో దేశ వ్యాప్తంగా గణతికెక్కిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కుమారుడు. అయితే ఏంటీ అంటారా?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్

నిన్నగాక మొన్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అజిత్ పవార్ హృదయపూర్వకంగా సహకరించిన సంగతి తెలిసిందే కదా? అదిగో అందుకు బహుమానంగా ఆయనపై ఉన్న కేసుల్లో అనేక కేసులను మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర ఏసీబీ అధికారులు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. బాబాయ్ శరద్ పవార్ కు జెల్ల కొట్టి బీజేపీకి మద్ధతు ఇచ్చి మూడు రోజులైనా గడవకముందే ఈ కేసుల మాఫీ పరిణామాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. అజిత్ పవార్ కు ఇది బీజేపీ ఇచ్చిన గిఫ్ట్ గా ఎన్సీపీ నేతలు వ్యాఖ్యానించారు. అంతేాకాదు ఈ వార్త దావానలంలా వ్యాపించి దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో మహారాష్ట్ర ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి నాలుక మడతేసి మాట్లాడినట్లు కనిపిస్తోంది. అజిత్ పవార్ కు సంబంధించిన తొమ్మిది కేసుల్లో దేన్నీ మూసివేయలేదని మహారాష్ట్ర ఏసీబీ డీజీ పరంబీర్ సింగ్ వెల్లడించారు. అంతేకాదు, ఈరోజు మూసేసిన కేసులు అజిత్ పవార్ కు సంబంధించినవి కావని కూడా పేర్కొన్నారు. కాగా అజిత్ పవార్ అంశంలో సీఎం ఫడ్నవీస్ కూడా గతంలో బీరాలు పలికారు. తాము అధికారంలోకి రాగానే అజిత్ పవార్ జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర తాజా రాజకీయాల్లో ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 2014లో అజిత్ పవార్ గురించి ఫడ్నవీస్ పలికిన మాటలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేచురల్లీ కరప్ట్ పార్టీ‘గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని అభివర్ణించిన ప్రధాని మోదీ ప్రస్తుతం అజిత్ పవార్ ను అభినందిస్తూ చేసిన ట్వీట్ పైనా నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. అస్వాదిస్తూనే ఉండండి…మహారాష్ట్ర రసవత్తర రాజకీయాలను.

Comments are closed.

Exit mobile version