మాజీ మంత్రి, అధికార పార్టీ నేత తుమ్మల నాగేశ్వర్ రావు వర్గీయులకు పోలీసుల నుంచి అనూహ్య అనుభవం ఎదురైంది. తుమ్మల వర్గానికి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ పై ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిన ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం రాత్రి పొద్దుపోయాక జరిగిన ఈ ఘటన తుమ్మల వర్గీయులకు పెద్ద షాక్ గా పలువురు అభివర్ణిస్తున్నారు.

తుమ్మల నాగేశ్వర్ రావు వర్గానికి చెందిన జంగం భాస్కర్ అనే మాజీ కార్పొరేటర్ పై అక్రమంగా కేసు బనాయించి, అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారని ఆరోపిస్తూ పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం రాత్రి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. భాస్కర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరో టీఆర్ఎస్ కార్యకర్త మేకల ఉదయ్ అనే వ్యక్తిని జంగం భాస్కర్ ఫోన్ ద్వారా బెదిరించాడనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే జంగం భాస్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారని, భాస్కర్ ఆచూకీ చెప్పాలని పోలీసులతో తుమ్మల వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుని తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మల అనుచరగణం భారీ సంఖ్యలో స్టేషన్ కు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. అర్థరాత్రి దాటాక కూడా తుమ్మల అనుచరుల ఆందోళన కొనసాగింది.

ఇదిలా ఉండగా గురువారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగినవారిలో మరికొందరిపైనా కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై ఐపీసీ 353 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు ధ్రువపడని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ పరిణామాల్లో తుమ్మల అనుచరులు న్యాయపోరాటం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

Comments are closed.

Exit mobile version