వన దేవతలు సమ్మక్క, సారలమ్మలపై త్రిదండి చినజీయర్ చేసిన వ్యాఖ్యలపై నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. జీయర్ వ్యాఖ్యలపై ఆగ్రహిస్తున్న ఆదివాసీలు ఆయన దిష్టిబొమ్మలకు చెప్పుల దండ వేసి, దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వన దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన జీయర్ ను అరెస్ట్ చేయకుంటే ప్రత్యక్ష దాడులకు దిగుతామని సారలమ్మ పోరుగడ్డ కన్నెపల్లి నుంచి ఆదివాసీలు హెచ్చరించారు. ఈమేరకు తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ జీయర్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

కన్నెపల్లిలో జీయర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఆదివాసీలు

గురువారం నాటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివాసీల ఆరాధ్య దైవం సారలమ్మ గుడి ప్రాంగణం కన్నెపల్లిలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ బృందం, కన్నెపల్లి యూత్ సభ్యులు సంయుక్తంగా చిన్న జీయర్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. నార్లాపురంలో నాగులమ్మ పూజారులు, ఊకె వంశస్తులు కూడా జీయర్ వ్యాఖ్యలను నిరసిస్తూ అతని దిష్టిబొమ్మను దహనం చేశారు.

అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, చిన్న జీయర్ కి తెలివి ఉంటే పైసలు ఉంటే బయట తైతక్కలు ఆడాలే తప్ప, ఆదివాసీల జోలికి వస్తే ప్రత్యక్ష దాడులు విల్లంబులతో చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

సమ్మక్క, సారలమ్మలు పకృతి దేవతలని, నీలాగా విగ్రహాలు పెట్టుకుని అమాయక ప్రజలను దోచుకు తినేవారు కాదని జీయర్ ను ఉద్ధేశించి అన్నారు, భారత దేశ చరిత్ర లో శాస్త్రీయ మూలాలకు కేంద్రమైన శక్తి పీఠాలను, ఆలయాలను ఆధ్యాత్మిక శక్తులుగా మార్చి వ్యాపారం చేసే సంస్కృతి గల వ్యక్తులు ఆదివాసీ సమాజాన్ని ధ్వంసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు

నార్లాపురంలో నాగులమ్మ వంశస్తుల నిరసన చిత్రం

సమ్మక్క, సారలమ్మలు గిరిజన దేవతలని, చట్ట ప్రకారం ప్రభుత్వం చిన జీయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జీయర్ వ్యాఖ్యలు ఉన్నందున మత కల్లోల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం ఆదివాసీల ఆత్మగౌరవం కోసం చర్యలు తీసుకోకుంటే, జీయర్ ను అరెస్ట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలుస్తామని అరుణ్ కుమార్ హెచ్చరించారు.

ఈ కార్య క్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి గణేష్, చర్ప రవి, కాక రంజిత్, శోలం మధు, పాయం నాగరాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version