దిగువన గల రెండు ఫొటోలను నిశితంగా పరిశీలించాక త్రిదండి చినజీయర్ తాజాగా ఎదుర్కుంటున్న పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వనదేవతలైన మేడారం సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యల వీడియో వెలుగులోకి వచ్చాక తెలంగాణా వ్యాప్తంగా జీయర్ కు వ్యతిరేంకగా ఆందోళనలు, నిరసనలు తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో నెటిజన్లు జీయర్ వైఖరిని తూర్పారబడుతున్నారు. విపరీతమైన ట్రోలింగ్ కు దిగుతున్నారు. రాయలేని భాషలో ఆయన తీరును నిరసిస్తున్న వ్యాఖ్యలు అనేకం కాగా, కాస్త సంస్కారమైన భాషలోనే జీయర్ వ్యవహారశైలిపై మరికొందరు నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు.

ఇక్కడ గల గ్రాఫిక్ చిత్రాన్నిచూశారుగా…? ‘తెలంగాణా అస్థిత్వాన్ని పరిహసించాడు… ప్రతిష్ట కోల్పోయి మరుగుజ్జుగా మిగిలిపోయాడు’ అంటూ వ్యాఖ్యానించారు తెలంగాణా ఉద్యమకారుడు అర్వపల్లి విద్యాసాగర్. మేడారం వనదేవతలపై జీయర్ ఎదుర్కుంటున్న పరిణామాలను రెండు వాక్యాల్లో వివరిస్తూ.., విద్యాసాగర్ తన ఫేస్ బుక్ వాల్ పై ఈ ఫొటోను జతచేస్తూ ఆయా వ్యాఖ్యలు చేయడం విశేషం.

అదేవిధంగా జీయర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న ఆదివాసీలు ఆయన చిత్రపటాన్ని దిష్టిబొమ్మగా మార్చి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గల ఈ పొటోను చూస్తే జీయర్ వ్యాఖ్యలపై ఆదివాసీల ఆగ్రహ తీవ్రతను అవగతం చేసుకోవచ్చు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వనీదత్ అయితే జీయర్ పై ఓ న్యూస్ ఛానల్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చినజీయర్ పెద్ద వెధవ… బ్లాక్ టికెట్లు అమ్ముకునే సన్యాసి’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా చిన జీయర్ వ్యాఖ్యలపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. జీయర్ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం చినజీయర్ దిష్టిబొమ్మల దహనానికి పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణా గిరిజన సంఘం, కుల వివక్ష పోరాట సమితి, తెలంగాణా దళిత హక్కుల పోరాట సమితిలు చినజీయర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చాయి.

Comments are closed.

Exit mobile version