నిష్పక్షపాత జర్నలిజం. నిజం నిర్భయంగా చెబుతాం. ప్రతి అక్షరం ప్రజాపక్షమే. ప్రతి దృశ్యం ప్రజా ప్రయోజనమే. మీడియా సంస్థల నినాదాల్లో ఇవి కొన్ని మాత్రమే. ప్రింట్ మీడియా నినాదాలు వేరు, ఎలక్ట్రానిక్ మీడియా సూక్తులు వేరు. సుద్దులు చెప్పడం వేరు..ఆచరించి చూపడం వేరు. నినదించడం వేరు. కార్యాచరణ వేరు. ఎవరి డప్పు వారిదే. ఎవరి ప్రయోజనం వారిదే. తాము నిఖార్సయిన జర్నలిజం చేస్తున్నామని ఎవరైనా చెబితే అది ఆత్మవంచనే. ఇందులో సందేహమేమీ లేదు. ఇదేమీ కొత్త విషయం కాకపోవచ్చు. కానీ ఏదేని ప్రధాన ఘటన జరిగినపుడు ‘జర్నలిజపు’ పోకడను, ఇజాన్ని, నిజాన్ని మళ్లీ ఓసారి మననం చేసుకోవడం అనివార్యమవుతుంది. ఇది కూడా అటువంటి ప్రయత్నమే.

తెలుగు మీడియాలో పత్రికలకు పార్టీల జెండా ‘రంగు’ పడిన సంగతి తెలిసిందే కదా? పత్రికలకేం ఖర్మ. న్యూస్ ఛానళ్లు సైతం ‘కలర్’ ఫుల్ గానే మారాయనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఎక్కువ ఉపోద్ఘాతం అక్కరలేదు. తాజా ఘటననే చూడండి. అమరావతి రాజధాని ‘మూడు ముక్కల’ అంశంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా? టీడీపీ కస్సుబుస్సులు, వైఎస్సార్ సీపీ హుంకరింపులు అనేక పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఎమ్మెల్యేలకు, నాయకులకు చేదు అనుభవాలు, కార్లపై దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వంటి అనేక ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ అధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభానికి ముందే రసాభాసగా మారింది. దీంతో బుధవారం రాత్రి విజయవాడలోని బెంజ్ సర్కిల్ ప్రాంతం అట్టుడికిపోయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వంటి అనేక సంఘటనలకు బెంజ్ సర్కిల్ వేదికైంది.

ఈ అంశాన్ని కవర్ చేసే ప్రక్రియలో భాగంగా వివిధ న్యూస్ ఛానళ్లు తమ వంతు పాత్రను రాత్రే ‘కలర్’ ఫుల్ గా పోషించాయి. ప్రింట్ మీడియా ‘రంగు’ ల విశ్వరూపం చూడడానికి మరుసటి రోజు వరకు ఆగక తప్పదు కదా! ఇదిగో తెలుగు మీడియాలో ప్రధాన తెలుగు పత్రికలు అంటే.. ‘THE LARGEST CIRCULATED TELUGU DAILY’ ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు ఈ సంఘటనకు సంబంధించి ఇచ్చిన న్యూస్ కవరేజ్ ను ఓసారి నిశితంగా పరిశీలించండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఉద్రిక్తం, హైటెన్షన్ అనే శీర్షికలతో బ్యానర్ స్టోరీలుగా అచ్చేసి, చంద్రబాబు కష్టాన్ని, తపనను ఫుల్లుగా కీర్తించగా, ‘బెంజ్ సర్కిల్ వద్ద బాబు హైడ్రామా’ అనే శీర్షికతో సాక్షి పత్రిక విషయానికి పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదని, బాబుకు అంత సీన్ లేదనే తరహాలో తేల్చేసింది. ఇందులో భాగంగానే ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతకు సంబంధించిన వార్తను ఎక్కడో 8వ పేజీలో కనిపించీ, కనిపించకుండా ముద్రించడం గమనార్హం. తమ ప్రయోజనం లేని నేతలకు సంబంధించిన వార్తల విషయంలో ఈ తరహా విద్యకు ఆద్యులెవరో కూడా జర్నలిస్టులకు తెలిసిందేననుకోండి.

అందుకే చెప్పొచ్చేదేమిటంటే.. జర్నలిజంలో ఎవరి ప్రాధాన్యత వారిది. ఎవరి అవసరాలు వారివి. ఎవరి కలర్ వారిదే. చూసే కళ్లు, రాసే పెన్నును బట్టి వార్తలు ఉంటాయనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఫలానా ఘటనలో ఫలానా విధంగా వార్తా కథనం ఉండాలని, ఫలానా పేజీలోనే ముద్రించాలని, మరెవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరమే లేదు. తమకు మాత్రమే ’పరిగ్నానం’ ఉందని, మిగతావారు ‘అగ్నానులు’ అని అంతిమ తీర్పు చెప్పడం మూర్ఘత్వమే అవుతుంది. ఇటువంటి పరిణామాలవల్లే కాబోలు మీడియా ‘కలర్’ పులుముకుంది. ఎల్లో మీడియా, పింక్ మీడియా, బ్లూ మీడియా అనే పేర్లను ఆపాదించుకుంది.

విషయం మొత్తం చదివాక, ఆయా ప్రధాన పత్రికల కవరేజ్ క్లిప్పింగులు చూశాక, ఏది నిఖార్సయిన జర్నలిజం అని మాత్రం అడక్కండి. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపే ప్రజా తీర్పునకు ప్రామాణికంగా భావించినపుడు, మీడియాలోనూ ’ అత్యధిక’ సర్క్యులేషన్ సూత్రమే గీటురాయిగా స్వీకరించక తప్పదేమో. ఎందుకంటే మీడియాలో ఇప్పుడెవరూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామ్ నాథ్ గోయెంకాలు లేరు… అవసరమైతే మళ్లీ మర చెంబు పట్టుకుని వ్యాపారం చేసుకుంటానే తప్ప, నీ బెదిరింపులకు తలొగ్గేది లేదు’ అని పాలకుల తీరును ధిక్కరించే గోయెంకా వంటి యాజమాన్యాలూ లేవు. అందుకే మీడియా దయ.. పాఠకుడి/వీక్షకుడి ప్రాప్తం.. అంతే..!

Comments are closed.

Exit mobile version