తెలంగాణాలో తాగుబోతులకు హక్కులుండవా? కనీసం స్వేచ్ఛ కూడా ఉండదా? అరె… ’సుక్క దాగక శెక్కరొచ్చిందనే’ తాజా పాట సంగతి పక్కన బెట్టండి. తాగిన సుక్క, నోట్లో వేసుకున్న సికెన్ ముక్కో, మామిడి కాయ పచ్చడి తొక్కో గొంతు దాటకముందే గీ పోలీసులోళ్ల లొల్లి ఏంది మరి? మస్తు పైసల్ కర్సు బెట్టి తాగినంక, కొంచెం గూడ రిమ్మ రాకముందే… తాగిన జాగ నుంచి జానెడు కూడా జర్గక ముందే నోట్లో పీకలు బెట్టుడేంది? ఊదుమనుడేంది? గిదేం పద్ధతి…గిదేం తరీక? అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన తాగుబోతులు… సారీ.. మద్య పాన ప్రియులు.

పోలీసులనే కాదు వైన్ షాపు యజమానులను సైతం మందు బాబులు నిందిస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. దమ్మపేటలోని జనావాసాల మధ్యనే గల ఓ వైన్ షాపులో మద్యపాన ప్రియులు కాస్త సురాపానం సేవించి షాపు నుంచి అలా అడుగు బయటపెడుతున్నారో లేదో, షాపు ఎదురుగానే తిష్ట వేసిన పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పేరుతో తాగుబోతుల నోట్లో పీకలు పెట్టి ఊదమంటున్నారట. చాలా కాలంగా ఈ తంతు జరుగుతూనే ఉందట. ఇందులో భాగంగానే ఈరోజు రాత్రి కూడా కొందరు మద్యపాన ప్రియులు సదరు వైన్ షాపులో ఓ సుక్కేసుకుని ఇలా బయటకు వచ్చారో లేదో… మన రక్షక భట సోదరులు అప్రమత్తమై షాపు ఎదురుగానే పీకలు తీసి నోట్లో పెట్టి ఊదమన్నారట.

దమ్మపేట సెంటర్ లో మద్యపాన ప్రియుల ఆందోళన దృశ్యం

ఇదిగో ఇక్కడే చిర్రెత్తుకొచ్చిందట మద్యపాన ప్రియులకు. ఇంకేముంది ‘ఒరే ఎల్లయ్యా… ఫుల్లయ్యా రండర్రయ్యా. మన పోలీసులు తాగుబోతులకు మరీ అన్నేయం షేసేత్తున్నారు. ఈ తాగుడేంది? ఆ ఫీకలేంది? అసలు న్యాయమంటూ లేదా? ఇదేం ఫద్ధతి?’ అంటూ తోటి తాగుబోతులకు గట్టి పిలుపునిచ్చారు. ఊళ్లోనే ‘మందు’ షాపు పెట్టారు సరే. కానీ తాగిన తర్వాత కనీసం జానెడు దూరం కూడా తూలుకుంటూ వెళ్లే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని నిరసనకు దిగారు. షాపు మందే ఆందోళన చేపట్టారు. తాగడానికి స్వేచ్ఛ లేనిచోట లిక్కర్ షాపు ఉండడానికి వీల్లేదని, ఊరికి దూరంగా షాపును ఎత్తేయాలని డిమాండ్ చేశారు. బయటేదో గొడవ జరుగుతోందని తెలుసుకున్న వైన్ షాపులోని మిగతా మద్యపాన ప్రియులు కూడా బయటకు వచ్చి ఆందోళనకారులతో జత కలిశారు. ఇంకేముంది..వైన్ షాపు ముందు రచ్చ…రచ్చ. ‘అసలు ఊళ్లోనే ‘మందు’ షాపు ఉండడానికి వీల్లేదు. దాని ఎదురుగానే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించడానికి ఒప్పుకోం’ అంటూ నినదించారుట. బడికి, గుడికి నిర్ణీత దూరంలో వైన్ షాపు ఉన్నట్లే, డ్రంకెన్ డ్రైవ్ ను కూడా పోలీసులు లిక్కర్ షాపునకు నిర్ణీత దూరంలో నిర్వహించాలని పట్టబట్టారట. ఈ విషయంలో పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారట.

మొత్తంగా వైన్ షాపు ముందు మద్యపాన ప్రియుల గోల ఎక్కువయ్యేసరికి దమ్మపేట ఎస్ఐ రంగప్రవేశం చేసి వారికి నచ్చజెప్పారట. ‘తాగుబోతుల ’సుక్క‘ డిమాండ్ లో సక్కటి అర్థమే ఉన్నది కదా? మరీ వైన్ షాపు ఎదురుగానే పోలీసులు ఉంటే తాగే మందుకు తలకెక్కుతుందా?’ అన్నది తాగుబోతుల సందేహం. పోలీసులు కాస్త ఆలోచించాలి మరి.. అంటున్నారు దమ్మపేట మద్యపాన ప్రియులు.

Comments are closed.

Exit mobile version