తలాపున గోదావరి ఉన్నా, తాగు, సాగునీటికి దారేది? అనేక సందర్భాల్లో నీటి కటకటపై పత్రికల్లో వచ్చే వార్తా కథనాలకు తరచుగా వాడే హెడ్డింగ్ ఇది. పత్రిక ఏదైనా ఎక్కువ సందర్భాల్లో వాడిన శీర్షిక ఇది. ప్రస్తుతం ఈ శీర్షికను కాస్త మార్చి తెలంగాణాలోని అధికార పార్టీకి అన్వయించాల్సిన రాజకీయ పరిస్థితి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పడుతున్న తపనను టీఆర్ఎస్ నేతలు ఎంతగానో కీర్తిస్తున్నారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన అపర భగీరథునిగా గులాబీ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లోనే గోదావరి పరీవాహక, దాని పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీ అపసోపాలు పడుతున్న తాజా స్థితి.

వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి పరీవాహక, పరిసర ప్రాంతాల్లోని అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో గులాబీ పార్టీ చేదు ఫలితాలను చవి చూసింది. గోదావరి బెల్ట్ పొడవునా ఫలితాలు విపక్ష పార్టీకి అనుకూలంగా రావడం గమనార్హం. తెలంగాణాలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రవహించే గోదావరి పరీవాహక, పరిసర ప్రాంతాల్లోని అనేక స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కు (కాంగ్రెస్), రామంగుండంలో కోరుకంటి చందర్ (ఇండిపెండెంట్), మంథనిలో శ్రీధర్ బాబు (కాంగ్రెస్),భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి (కాంగ్రెస్), ములుగులో సీతక్క (కాంగ్రెస్), పినపాకలో రేగా కాంతారావు (కాంగ్రెస్), ఇల్లందులో హరిప్రియా నాయక్ (కాంగ్రెస్), వైరాలో రాములు నాయక్ (ఇండిపెండెంట్), భద్రాచలంలో పొదెం వీరయ్య (కాంగ్రెస్), సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ), కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్), అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయా ఎమ్మెల్యేల్లో శ్రీధర్ బాబు, సీతక్క, పొదెం వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు మాత్రమే తమకు టికెట్ ఇచ్చిన పార్టీలను అంటిపెట్టుకుని ఉండగా, మిగతా వారంతా ఎన్నికల అనంతరం కేసీఆర్ కు జైకొట్టారన్నది వేరే విషయం.

అటవీ అధికారుల చెరలో ఆదివాసీల బతుకు చిందర వందర (ఫైల్)

ప్రస్తుతం తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలోనేగాక గోదావరి పరీవాహక, పరిసర ప్రాంతాల్లోనూ అనేక పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది మాత్రమే పూర్తి కాగా, కేసీఆర్ పార్టీకి జై కొట్టిన విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు సైతం ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయంటున్నారు. ‘వందకు వంద శాతం గెలిపించాల్సిందే. ఒక్కటి ఓడినా పదవులు ఊడుతయ్. అడ్రస్ లేకుండా పోతరు. చివరికి ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోతరు.’ అంటూ పార్టీ అధినేత కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇటీవల పార్టీ సమావేశంలో నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, అప్పటి పరిస్థితులను బేరీజు వేసినపుడు గోదావరి పరీవాహక, దాని పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టికి ప్రజలు ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాన్నిస్తారన్నదే ప్రస్తుతం చర్చకు దారి తీసింది.

కుమ్రం భీం జిల్లాలో అటవీ అధికారులపై టీఆర్ఎస్ నేత దాడి చేసిన దృశ్యం (ఫైల్)

వాస్తవానికి విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీకి జై కొట్టించుకున్నప్పటికీ, ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి అనుకూలంగా మారినట్లేనా? ఇదీ ప్రశ్న. ఇదేమీ అంత సులభమైన అంశం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గోదావరి పరీవాహక, పరిసర ప్రాంతాల్లోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో అనేక సున్నిత సమస్యలు అధికార పార్టీకి సవాల్ గా పరిణమించడమే అసలు కారణం. ముఖ్యంగా పోడు భూముల సమస్య అధికార పార్టీ నేతలను వెంటాడుతోంది. అటవీ హక్కుల చట్టం కింద పోడు భూములకు యాజమాన్య హక్కు పత్రాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కేసీఆర్ సర్కార్ కు ఎన్డీఏ ప్రభుత్వం ఇందుకు సహకరిస్తుందా? అనేది మరో ప్రశ్న. ఇంకోవైపు ఆదివాసీ, బంజారా గిరిజనుల మధ్య ‘రిజర్వేషన్ల’ సమస్య మరింత అగాధానికి తోడైంది. బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీల తరపును తుడుందెబ్బ తన పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇందుకు బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వంటి నేతలు సహకరిస్తూ ఉద్యమానికి మరింత ఊపిరి పోస్తున్నారు.

ఆదివాసీల పాకలను ధ్వంసం చేసిన దృశ్యం (ఫైల్)

ఇది చాలదన్నట్లు చాపకింద నీరులా మావోయిస్టు కార్యకలాపాలు వేళ్లూనుకుంటున్నట్లు పోలీసు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పొరుగున గల ఛత్తీస్ గఢ్ అడవుల నుంచి గోదావరికి ఇవతలి వైపు వేలాదిగా వలస వస్తున్న గొత్తి కోయల్లో ఎవరు మావోయిస్టులో, ఎవరు పొట్ట కూటి కోసం వస్తున్నారో ఇతమిద్దంగా తేల్చి చెప్పే పరిస్థితి లేదంటున్నారు. అటు పోడు భూములు, ఇటు గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ల చిచ్చు, ఇంకోవైపు మావోయిస్టుల నిశ్శబ్ద కార్యకలాపాలు గోదావరి పరీవాహక, పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీ విజయాకవకాశాలపై ప్రభావం చూపవచ్చనే వాదన వినిపిస్తోంది. పోడు భూముల సమస్యలో ఘర్షణ ఘటనలు, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో వాటిని పరిష్కరిస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. అవసరమైతే క్షేత్ర స్థాయికి తానే వచ్చి, కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. అయితే ఆ అవసరం ఎప్పుడనేదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారడం కొసమెరుపు.  

Comments are closed.

Exit mobile version