అందిన ప్రతి అవకాశాన్ని రాజకీయ ప్రచారానికి అనుకూలంగా మార్చుకోవడంలో తెలంగాణాలోని అధికార పార్టీ నేతలకు బహుషా ఎవరూ సాటి రాకపోవచ్చు. సరితూగక పోవచ్చు కూడా. ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్న ‘కరోనా’ వ్యాధి గురించి ప్రభుత్వాధినేతలు, సచివులు, అధికారులు ఎవరి శైలిలో వారు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. అప్రమత్తంగా ఉండాలని పాలకులు ప్రజలకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే కరోనా వ్యాధి అంశంలో తెలంగాణా సర్కార్ ఓపోస్టర్ ను కూడా విడుదల చేసింది. సర్కారువారి చర్యకు బాసటగా కాబోలు… ఎవరో బాలు నేత అట. ‘టీఆర్ఎస్ సీనియర్ నాయకులు’ అని స్వయం ప్రకటన చేసుకుంటూ కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్తలను వివరిస్తూ ఓ సోషల్ మీడియా పోస్టును విడుదల చేశారు. అందులో తన అభిమాన నాయకుల ఫొటోలను కూడా జత చేశారు. జనహితం కోసం బాలు నేత చర్య సబబే కావచ్చు. కానీ పార్టీ నేతల ఫొటోలతో చేసిన ఈ పోస్ట్ తీరుపైనే ఒకింత విమర్శలు వస్తున్నాయి. కరోనా అయినా, మరేదైనా రాజకీయ ప్రచారానికి వాడుకోవడంలో ‘సరిలేరు మీకెవ్వరు’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి పబ్లిసిటీ స్టంట్ కన్నా ప్రజలకు మాస్కుల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత ప్రయోజనకరంగా ఉండేదని, పార్టీ అగ్ర నేతల దృష్టిలో బాలు నేత పడేవారని అంటున్నారు. అదీ సంగతి.

Comments are closed.

Exit mobile version