ఫలానా వాడిది మంత్రాల బలం కాదు…తుప్పిర్ల బలం మాత్రమే అని వ్యాఖ్యానిస్తుంటారు. కొందరు వ్యక్తులు నోరు పారేసుకుని బతికేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను ఉద్దేశించే ‘తుప్పిర్ల’బలం నానుడి పుట్టి ఉంటుంది. తుప్పిర్లకు ఏ బలమూ ఉండదనేది మొత్తంగా సామెత సారాంశం. ఇటువంటి తుప్పిర్ల బలంగల వ్యక్తులను తేలిగ్గానే తీసిపారేస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు తిరగబడిన ప్రమాద ఘంటికలు. తుప్పిర్లకూ అత్యంత భయానక బలం వచ్చింది. తుప్పిర్లను చూసి మనిషి గజగజ వణకాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి.

మన దేశంలోకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించినట్లు ఆనవాళ్లు లభించిన ‘కరోనా’ వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని, తుప్పిర్లకు మాత్రం దూరంగా ఉండాలని తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ‘కరోనా’ వైరస్ లక్షణాలు గల వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా తుప్పిర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నదే తాజా సూచన. వైరస్ సోకిన వ్యక్తి తుప్పిర్లు ఇతరులపై పడినా, ఏదేని వస్తువుపై పడిన తుప్పిర్లను ఇతరులు చేతులతో తాకి కళ్లు, ముక్కు నలుముకున్నా కరోనా బారిన పడే ప్రమాదం ఉందట.

అందుకే క్షణ, క్షణం అప్రమత్తంగా ఉండాలని, పదేపదే చేతులను శుభ్రం చేసుకోవాలని సలహాలు, సూచనలు చేస్తున్నారు. మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే ప్రస్తుతం మనిషి భయపడాల్సింది తుప్పిర్లకు మాత్రమే… మంత్రాలకు కాదు. కాబట్టి మంత్రాల బలం కన్నా తుప్పిర్ల వల్లనే మానవునికి ప్రాణాంతక ప్రమాదమన్న మాట. తుప్పిర్లకూ ఓ రోజు రానే వచ్చింది. జాగ్రత్తగా ఉండడమే మానవుని ప్రథమ కర్తవ్యం.

Comments are closed.

Exit mobile version