మేడిన్ చైనా…. కరోనా వైరస్ పై వర్థమాన కవులు కలం ఝుళిపిస్తున్నారు. తమ కవితలతో దాడి ప్రారంభించారు. చైనా ఆహార అలవాట్లను ఎత్తిచూపుతూనే, ఆ దేశపు వస్తువులను మనం ముద్దాడుతున్న తీరునూ తమ కవితల్లో ఉటంకించారు. నువ్వేం చేయగలవని కరోనాను ప్రశ్నిస్తూనే, మనం పాటించాల్సిన పరిశుభ్రత ఆవశ్యకతను గుర్తు చేశారు. కరోనా వైరస్ పుణ్యమా అని పిజ్జాలు, పబ్బుల కల్చర్ నుంచి వెల్లుల్లి రసానికి మారిన తీరునూ రసవత్తరంగా వెటకరించారు. రచయితలు ఎవరోగాని తమ పేర్లు రాసుకోకుండా సోషల్ మీడియాలో వదిలిన అనేక కవితల్లో మచ్చుకు కొన్నింటిని దిగువన చదువుతూ… కాసేపు కరోనా భయాన్ని మర్చిపోండిక.
UPDATE: ఈ పోస్టు ప్రచురితమైన కాసేపటికే కరీంనగర్ నగర్ నుంచి పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ బెల్లపు స్వామి ఫోన్ చేశారు. ‘ఎంత పని చేశావే కరోనా?’ అనే కవితను తానే రాసినట్లు వెల్లడించారు. ఈమేరకు రచయిత పేరును ఆయా కవితకు దిగువన యాడ్ చేయనైనది.

కలుగుల దాగిన ఎలుకల
పిలకలగొని వెలుపలికిడి
సల సల కాగే నూనెలో
మల మల మాడ్చితివి కదా!

కుక్కల, నక్కల వదలక
సందుల పందుల విడువక
రంజుగ నంజుకు తింటివి
అదియే సుఖమనుకుంటివి!

కొత్తగ వచ్చిన గత్తెర
మింగగ పైపైకి దునుక
మనుషుల తాకగ కూడా
గజ గజ వణికితివి కదా!

చేతులు పిసుకుట పాయే
మూతులు నాకుట పాయె
“నమస్తే” నే శ్రేష్ఠంబను
సత్యం అవగతమాయే!

ప్రకృతితో ఆటలాపి
జీవులపై కరుణ చూపి
ప్రళయాన్నే ఆపుదువో
పతనాన్నే కోరుదువో…..నీ ఖర్మ!

ఎంత పని చేసావే కరోనా…?

కరం కరం కలిపితే …
మనిషికి హానికరం అన్నావు…

మందు బిళ్ళ లేదని ….
మందిలోకి వెళ్ళకన్నావు….

సూది మందు లేదని …
సుట్టాలింటికి వద్దు అన్నావు….

తొలి సారి నువ్వు చైనాలో…
త్వరితగతిన మొత్తం దునియాలో….

నువ్వు పుట్టిన దేశంది …
వస్తువు అయితే వారెవ్వా..
వైరస్ అయితే వామ్మో …

చైనా హద్దు దాటావు…
స్విస్ ముద్దును ఆపావు…

కనిపించవు ఏ కంటికి..
రావొద్దు నువ్వు మా ఒంటికి….

గాలి ద్వారా రాను అని
గాలి మోటార్ ద్వారా వస్తున్నావు ….

నీ గాలి సోకిన వారు …
గాలి దూరని గదుల్లో…
నీ వార్త విన్ననాడు…
భయం దూరేను మా మదుల్లో..

ఏమి చేస్తావే నువ్వు…?

నా దేహం శుద్ది …
తప్పదు నీకు ఇక దేహశుద్ది…
నా ప్రదేశం, పరిశుభ్రం…
వెళ్లక తప్పదు నువ్వు పరలోకం….

మమ్ముల విడగొట్టక …
విడిచి వెళ్లు మా దేశం…
తోక ముడిచి వెళ్లు మా దేశం…


-రచయిత: స్వామి బెల్లపు, ఎస్ఐ, కరీంనగర్

కరోనా క్యా కహోనా?

‘డ్రాగన్’కు కన్నబిడ్డవు నీవు
సామ్రాజ్యవాదానికి ముద్దుబిడ్డవు నీవు
ప్రపంచానికి పాడు బిడ్డవు నీవు.
స్వార్ధానికి సొంత బిడ్డవు ఐన
నీవు వచ్చావు.

కరచాలనాలకు స్వస్తి చెప్పావు.
ఇంగ్లీష్ రాజును సైతం
చేతులు జోడించి వందనం చేసేలా చేసావు.

పడమటి దేశాల వ్యవహారాలకు
పాశ్చాత్యదేశ నాగరికతలకు
గులాం గిరి చేసే
పద్ధతులకు స్వస్తి పలికావు.

పబ్బులు, పిజ్జాలు, ఐస్ క్రీంలు, ఏ.సి లకు దూరం చేసావు.
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోని వారు నేడు ముక్కుకు నోటిని మూసుకునేలా చేసావు.

బార్లలో మందు తాగుతూ, మత్తులో
ఏమి తింటున్నారో
తెలియని వారిని తులసి,అల్లం.వెల్లుల్లి
రసం తాగేలా మార్చావు

సూపులు తాగడం మోజు అనుకునే వాళ్ళతో మిరియాలు,ఇంగువ చారును తాగించేలా చేసావు.
బయట తిండి తినేవాళ్ళను
ఇంటి బాట పట్టించావు.

పడిపడి పైనపడి ఎగపడి
రాసుకు పూసుకు తిరిగే నాగరికులను దూరం దూరం నిలబడి మాట్లాడేలా చేసావు.

బయటంతా తిరిగొచ్చిన చెప్పులతో ఇళ్ళంతా కలయదిరిగే ఫ్యాషనిస్టుల
కాళ్ళు కడిగి లోనికి వెళ్ళేలా చేసావు.

చెరపకురా చెడేవు, ఒక్కని స్వార్ధం ఖగోళానికే కీడు అనే
సనాతన వాక్యాన్ని గుర్తు చేసావు.

మెత్తగ చెబితే నిద్ర నటించే
మహానటులకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చావు.

హైదరాబాదుకు హైరానా
కలిగించావు.
భస్మాసుర కథను గుర్తు చేసావు.
కరోనా క్యా కహోనా?

Comments are closed.

Exit mobile version