వాళ్లు రెడ్లే.. కానీ బలిసిన రెడ్లు కాదు.. రావులుగా మారిన దేశ్ ముఖ్ రెడ్లు కూడా కాదు. మధ్య తరగతీ కాదు, ‘మిద్దె’ తరగతీ కాదు. కనీసం బక్క రెడ్లు కూడా కాదు. అడవులే వారి జీవనాధారం. పోడు వ్యవసాయం ద్వారా జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను పండిస్తూ పొట్ట పోసుకుంటుంటారు. ఓ రకంగా చెప్పాలంటే బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు కూడా తక్కువే. గిరిజన జాతుల్లో వీరిదీ ఓ తెగ. పేరు చివరన ‘రెడ్డి’ ఉంటుందే తప్ప, గొడ్డలి చేబూని, గోచీ గుడ్డతో దర్శనమిస్తుంటారు. అడవి తల్లి ఒడిలోనే వీరి జీవనం. వీళ్లనే కొండరెడ్లు అంటారు. పక్కా ఆదివాసీ గిరిజనులు.

తెలంగాణాలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో కొండరెడ్డి గిరిజనులు కనిపిస్తుంటారు.అడవుల్లోని కొండలనే తమ ఆవాసంగా చేసుకుని జీవిస్తుంటారు కాబట్టే వీళ్లను కొండరెడ్లు అంటుంటారు. ఇదిగో ఇటువంటి కొండరెడ్లు అడవుల్లోనూ జీవించే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణాలో కనిపించడం లేదు. ‘మీ బతుకు దెరువు కోసం శాశ్వత ప్రాతిపదికన దుకాణాలను నిర్మించి ఇస్తాం’ అని సాక్షాత్తూ ఓ ఐఏఎస్ అధికారి, గిరిజన సంక్షేమ బాధ్యతలు చూసే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఇచ్చిన హామీని అపహాస్యం చేస్తూ, అటవీ అధికారులు కొండరెడ్ల బతుకు చిత్రాన్ని ఛిద్రం చేశారు. సర్వం చిందర వందర చేశారు. గిరిజనుల జీవన విధానానికి ఐఏఎస్ అధికారులు అండగా ఉంటే, మేం శిథిలం చేస్తామని చెప్పకనే చెప్పారు. అటవీ అధికారుల నిర్వాకం వల్ల కొండ దిగి వచ్చిన ఆ 40 కుటుంబాలు ప్రస్తుతం దిక్కూ, మొక్కూ లేని విధంగా అడవుల్లో మూగరోదనను అనుభవిస్తున్నాయి.

అటవీ అధికారులు ధ్వంసం చేసిన కొండరెడ్ల పాకలు

వాస్తవానికి ఇదో దురాగతం. వాళ్లేమీ ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు కాదు. ప్రమాదకారులని భయాందోళన చెందడానికి. కనీసం పొరుగున గల ఛత్తీస్ గడ్ నుంచి వచ్చిన గొత్తి కోయలు కూడా కాదు… వాళ్ల వెంట మావోయిస్టులు వస్తున్నారని అనుమానించడానికి. దశాబ్ధాల తరబడి మనకళ్ల ముందే బతుకుతున్న గిరిజన జీవులు. ఎక్కడో కొండపైన ప్రశాంతంగా జీవిస్తున్న గోగులపూడికి చెందిన కొండరెడ్లను పోలీసు బలప్రయోగంతో కిందకు దించిన ఘనత కూడా మన పాలకులదే. దాదాపు 19 ఏళ్ల క్రితం 2001లో ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గోగులపూడి కొండలపై నివసించే కొండరెడ్ల గిరిజన కుటుంబాలను తుపాకులు చూపి మరీ కొండ జీవనం నుంచి కిందకు దించారు. అప్పట్లో కొండపై 300-500 గజాల విస్తీర్ణంలో చిరుధాన్యాలు పండించుకుని బతికే కొండరెడ్లకు కొత్త కన్నాయగూడెంలో ఇళ్లు నిర్మించారు. అవి శిథిలం కావడంతో తెలంగాణా ప్రభుత్వం వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇచ్చింది.

కానీ నివాసం ఉంటే సరిపోదు కదా? పొట్ట పోసుకునేందుకు ఉపాధి కూడా అవసరమే. ఎన్నో ఏళ్లుగా తాము నమ్ముకున్న ఆరాధ్య దైవమైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్నే ఈ కొండరెడ్లు తమ బతుకు దెరువుకు మార్గంగా ఎంచుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోకి వెళ్లిన దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని, చిన్న చిన్న పాకలు నిర్మించుకుని అక్కడే ఈ కొండరెడ్లు తమ ఉపాధిని పొందుతున్నారు. గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తుల వంట కోసం చిన్న, చిన్న కట్టెపుల్లల సరఫరా, మొక్కులు చెల్లించుకున్నవారి కోళ్లను కోసి శుభ్రం చేయడం, కొబ్బరికాయలు, బొమ్మల విక్రయం వంటి కార్యకలాపాల ద్వారా కొండరెడ్లు పొట్ట పోసుకుంటున్నారు. పూర్వీకుల కాలం నుంచి తమ ఆరాధ్య దైవమైన గుబ్బల మంగమ్మ తల్లికి పూజలు చేసేది కూడా వీళ్లే.

అయితే ఎంతో కాలంగా అమ్మవారి ఆలయాన్నే నమ్ముకుని, అక్కడే పాకలు వేసుకుని పొట్ట పోసుకుంటున్న కొండరెడ్ల బతుకుపై తెలంగాణా అటవీ అధికారులు ఉన్నట్టుండి దాడి చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా గిరిజనుల పాకలను కూల్చేశారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ గత నవంబర్ 27న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్న సందర్శించి, కొండరెడ్ల యువకులకు శాశ్వత ప్రాతిపదికన దుకాణాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అడవుల్లో కొండరెడ్ల బతుకు చిత్రాన్ని చూసిన ఐఏఎస్ అధికారి గౌతమ్ గుండె కరిగినప్పటికీ, అటవీ అధికారులు కర్కశంగా వ్యవహరించడమే తీవ్ర విమర్శలకు తావు కల్పించింది. తమ అడవులను కేంద్రంగా చేసుకుని జీవించే హక్కు వీళ్లకు లేదని అటవీ అధికారులు వాదించవచ్చు. తమ డ్యూటీ తాము చేశామని సమర్ధించుకోవచ్చు.

కానీ కొండరెడ్లు కలపను అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు కాదు. అక్కడెక్కడో మంథని అడవుల్లో గల నయా వీరప్పన్ లు అంతకన్నా కాదు. నగర జీవులకు దుప్పి, జింక వంటి మాంసాలను సరఫరా చేసే నిత్య వేటగాళ్లు కాదు. అటవీ హక్కుల యాజమాన్య పత్రాలను ప్రామాణికంగా చేసుకుని కూలీలతో వేలాది ఎకరాల అడవులను నేలమట్టం చేస్తున్న భూస్వాములు కూడా కాదు. అటవీ అధికారులపై కర్రలతో దాడి చేసి వాళ్ల తలలు పగులగొట్టే కోనేరు కృష్ణారావులు కూడా వీళ్లలో ఎవరూ లేరు. వాళ్లు పుట్టింది అడవుల్లోనే. బతికేది కొండల్లోనే. వాళ్లను కొండ దించింది పాలకులే. బతుకుదెరువు కోసం వాళ్లు వేసుకున్న చిన్న చిన్న పాకల స్థలం ఎంత? వాళ్లు నాశనం చేసిన అటవీ విస్తీర్ణం ఎంత? ఇవీ అసలు ప్రశ్నలు. ఎవరి మెప్పు కోసం అటవీ అధికారులు ఇటువంటి చర్యకు దిగారన్నదే అసలు సందేహం. అంతేకాదు ఈ కొండరెడ్లకు అటవీ హక్కుల చట్టం కింద ప్రభుత్వం ఇచ్చిన భూములను సైతం గిరిజనేతరులు కబ్జా చేశారట. న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారట. కేసీఆర్ సారూ… చూస్తున్నారా? అటవీ అధికారుల దురాగతం. మీ చుట్టూరా గల పెద్ద పెద్ద రెడ్లనే కాదు సార్… కాస్త ఈ గోచీ గుడ్డల కొండ రెడ్ల జీవనానికి దయ చూపాల్సింది కూడా మీరే!

Comments are closed.

Exit mobile version