బహుశా గడిచిన రాత్రి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రికార్డు కావచ్చునేమో! చీకటి రాజకీయ శక్తులు చీకటి మాటున మిణుగురు పువ్వుల పై దాడికి పాల్పడితే, అవి చీకటి రాత్రిని ఏకంగా ఉద్యమ వెలుగులు వెదజల్లే వెలుగుల రాత్రిగా మార్చిన ఘన చరిత్ర అది! శ్రమ భారత్ ఆదమరిచి గాఢంగా నిద్రించే నిషి రాత్రి వేళ ఏమి జరిగిందో తెల్లరితే తప్ప శ్రమ భారత్ కి తెలియదు. 5వ తేదీ గడిచి పోయింది. 6వ తేదీలోకి ప్రవేశిస్తున్నాం. నూతన సంవత్సరం లోకి అడుగుపెట్టి వారం కూడా నిండలేదు. ఈ గడిచిన రాత్రి ఎన్నెన్ని సంచలన సంఘటనల కి చరిత్రలో సాక్షీభూతంగా నిలుస్తుందో! ఒకసారి స్మరిద్దాం!

నిజానికి ఆ సంచలన వార్తలు తెల్లారకే ప్రజలకు తెలుస్తాయి. అవి కూడా మీడియాలో కనిపించవు. సోషల్ మీడియా లో కొంతవరకు దొరుకుతాయి. అది కూడా ఇంకా ప్రభుత్వాలు దానిని నిషేధించే పరిస్థితి రాని కారణంగానే సుమా! వాటి వైపు ప్రత్యేక ఆసక్తిని కలిగించే ఒక చిన్న ప్రయత్నమిది. అదే విధంగా ఈరోజు పౌరులుగా మనం మన కనీస కర్తవ్యంపై దృష్టి పెట్టే ఉద్దేశ్యంతో కూడా!

గత కొంత కాలంగా JNU పై మోడీ షా ప్రభుత్వ గురి… ప్రధానంగా ఆర్.ఎస్.ఎస్. ఎంచుకున్న లక్ష్యంగా… జామియా పొరుబాటకు ప్రేరణ కూడా JNU అనేది ఇంటిలిజెన్స్ అంచనా… దాడికి చీకటి రాజకీయ శక్తుల చే ఒక ఫాసిస్టు దాడికి రంగం సిద్ధం… ఏదో ఓ రూపంలో దాడి జరగవచ్చనే అంచనాతో అప్రమత్తతతో JNU విద్యార్ధిలోకం… 4వ తేదీ మధ్యాహ్నం కొందరు బయటి వ్యక్తులు అనుమానాస్పద కదలికలు… ఆ రాత్రి మరిన్ని సందేహాలు… నిన్న 5వ తేదీ ఉదయం నుండి క్యాంపస్ లోకి పెరిగిన ఆగంతకుల ప్రవేశం… ఫిర్యాదులు… పట్టించుకోని అధికారులు… పిడికెడు మంది ABVP కార్యకర్తల రూముల్లోకి చేరిక… నిన్నరాత్రి 6-30 గంటల సమయంలో హఠాత్తుగా 200 మందికి పైగా ముసుగుల్లో కర్రలు, ఇనుప చువ్వలు, కత్తులతో స్థైర్వ విహారం చేస్తూ.. ఒక్కొక్క హాస్టల్ పై పడి.. కనిపించిన విద్యార్థుల్ని, ముఖ్యంగా ఆందోళన కారుల్ని కొడుతూ… భయంకరమైన అరుపులతో… యథేచ్ఛగా రెండు గంటలకు పైగా సాగిన బీభత్స దాడి! JNUSU అధ్యక్షురాలితో సహా పాతిక మందికి పైగా తీవ్ర గాయాలు… క్యాంపస్ లో ఎప్పుడుండే పోలీసు వుంది, ఐతే గుడ్లప్పగిస్తూ చూస్తూ మాత్రమే… అదనపు పోలీస్ బలగాల కోసం ఫిర్యాదులు… కానీ ఎవరూ రాలేదు. అదో భయానక దాడి!

వాళ్ళు ప్రశ్నించకుండా, తలలు ఎత్తకుండా, వెలుగు రవ్వలుగా ఉండకుండా, చీకట్లు ముసిరే కాలంలో మిణుగురులై మెరవకుండా… ఈ భయానక దాడి! వారి లొంగుబాటు కోసం చేసిన ప్రయత్నం… గత రాత్రిని వారి జీవితాలకు శాశ్వత చీకటిరాత్రిగా మారుద్దామని పన్నిన పథకం.. మళ్లీ పగటి బ్రతుకు లేకుండా చేద్దామని… ఐతే గత రాత్రి అదే జరిగిందా? లేదంటే దానికి విరుద్ధంగా మరొకటి జరిగిందా?

గతరాత్రి ఒకవైపు క్యాంపస్ లో దాడి జరుగుతుండగానే, మరోవైపు నిరసన ప్రదర్శనలకు JNUSU సమన్వయ కమిటీ పూనుకుంది. రాత్రి 10 కి ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్ ఎదుట నిరసన కోసం రావాలని ఆకస్మిక నిర్ణయం! అదే ఆ తర్వాత మారిన పిలుపు! పిలుపు ఇచ్చిన కమిటీలో మెజార్టీ సభ్యులు JNU లో ఆర్.ఎస్.ఎస్. గుండాల చక్ర బంధంలో చిక్కిన స్థితి! అయితేనేమి వాళ్ళు ఇచ్చిన పిలుపు జయప్రదం! మిగిలిన విద్య సంస్థల విద్యార్థులతో పాటు ప్రజాతంత్ర మేధో వర్గాల రాక! గడ్డకట్టే చలి… ఐనా తరలి వచ్చిన వందలాది మంది….. రాత్రి సుమారు 10-30కి నిరసన ప్రారంభం!

మరోవైపు షాహీన్ బాగ్ లో జామియా విశ్వవిద్యాలయం విద్యార్థుల నిరసన! అక్కడ పోలీస్ బెదిరింపులు! లెక్క చేయని ధిక్కార చైతన్యం! రాత్రి సుమారు 11 గంటలకు JNU గేటు బయట మరో నిరసన ప్రదర్శన ప్రారంభం… అప్పటికీ క్యాంపస్ లోపల సాయుధ మూకల యథేచ్ఛ సంచారం.. అర్ధరాత్రి 12 గంటలకు గేటు బయట వెయ్యు మందికి పైగా చేరిక… క్యాంపస్ లో గుండాలు లోపలి రోడ్లపై నుండి క్రమంగా వెనక్కి తగ్గుదల…

ఇంతలో మరో సంచలన పరిణామ క్రమం… అర్ధరాత్రి దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ విద్యార్థుల నిరసనల వెల్లువ… కోల్కత్తా జాదవపూర్ విశ్వవిద్యాలయం లో…. ముంబై గేట్ వే వద్ద… పూణే FTII లో… పాట్నా విశ్వవిద్యాలయంలో… ఎల్లెడలా నిరసనలే! అర్ధరాత్రే, పైగా చలికాలంలో, ముఖ్యంగా ఉత్తరాదిన గడ్డకట్టే చలిలో… నిరసన ప్రదర్శనలు…

ఇంతలో మరో సంచలన పరిణామం… JNU క్యాంపస్ లో అంతవరకూ వివిధ హాస్టళ్ల లో విద్యార్థులు ఎవరికి ఏం జరిగిందో, ఎవరు ఏమయ్యారో ఎవరికీ తెలియని స్థితి! తమ హాస్టల్ పై దాడి తర్వాత ఇంకే హాస్టల్ పైకి ఆ సాయుధ గుండా మూకలు దాడికి వెళ్తాయో తెలియని స్థితి! (11 మంది ఆచూకీ తెలియడం లేదని ప్రాధమిక వార్త, తెల్లరితే తెలుస్తుంది) ఆ భయంకర కాలరాత్రిలోనే ఫోన్లలో పరస్పరం సమాలోచన చేసుకొని రాత్రి 12-30 తర్వాత క్యాంపస్ లోపలి విద్యార్థులు సమీకృతులు కావడం ప్రారంభమైనది. హఠాత్తుగా అర్ధరాత్రి ఒంటిగంట సమయం లో JNU క్యాంపస్ ఔట్ గేటు వద్దకు చేరారు. గేటుకు బయట వెయ్యుమందికి పైగా వివిధ విశ్వవిద్యాలయాల, కళాశాలల విద్యార్థులతో అప్పటికే సాగే నిరసన ప్రదర్శన… మరోవైపు అదే గేటుకు లోపలి వైపు JNU విద్యార్థుల ప్రదర్శన… అర్ధరాత్రి సుమారు 2గంటలకి విద్యార్థుల నిరసన ధర్మాగ్రహానికి JNU ఔట్ గేటు తెరుచుకుంది. ఆ సమయంలో విద్యార్థుల్లో పెల్లుబికిన ఆనందం వర్ణనాతీతం! (ఆ వీడియో చూస్తే అర్ధమౌతుంది) ఆ తర్వాత సుమారు మూడు వేలమంది విద్యార్థులు అర్ధ రాత్రి 2 గంటల నుండి JNU క్యాంపస్ లో ప్రదర్శనగా ఇంకా క్యాంపస్ లో దూరదూరాన వుండే హాస్టళ్లను ఒకటి తర్వాత ఒకటి సందర్శిస్తూ… పరామర్శిస్తూ… తమలో తాము పరస్పరం ధైర్యం చెబుతూ, చెప్పుకుంటూ.. ఓదార్పు యాత్ర అనుకోవచ్చో, లేదా ఇంకేమనుకోవచ్చో తెలీదు. తెల్లవార్లూ ఓదార్పు యాత్రగా సాగే ప్రయత్నంలో వుంది ఆ ప్రదర్శన!

ఓ సందర్భంలో లెనిన్ ‘శ్రామికవర్గం డైనమైట్లు, విద్యార్థులు నిప్పురవ్వలు’ గా పేర్కొన్నట్లు గుర్తు! ఔను నిజమే కదా! వాస్తవానికి పేలుడుశక్తి శ్రామికజనమే! వాటి వత్తుల్ని ముట్టించి ప్రేలుడుకు ఉపయోగపడే నిప్పురవ్వలు విద్యార్థులు! పేలుడు శక్తిని తమ గర్భంలో దాచుకున్న డైనమైట్లు తొలుత పేలకుండా చాలా కాలం నిద్రావస్థలోనే ఉంటాయి. వాటిని రగుల్కొలిపే చారిత్రిక బాధ్యత విద్యార్థులు, మధ్యతరగతి విద్యావంతుల పై పడుతుంది. నిజానికి వాళ్లే ముందుగా మెలకువలోకి వస్తారు. నిద్రావస్థలోని శ్రమ జన సమూహాలను మేల్కొలిపే కర్తవ్యాన్ని అవి చేపడతాయి. ఔను, ఫాసిస్టు రాజ్యంగా మారే నేటి కాలంలో నిజంగానే సమాజాన్ని, ముఖ్యంగా శ్రామిక భారతాన్ని మేల్కొలిపే అట్టి బాధ్యతల్ని అవి నిర్వహిస్తాయి. అది సమాజ సహజ పరిణామ సూత్రమే! అందుకు గడిచిన రాత్రి ఓ నిదర్శనం! వెలుగు రవ్వగా గుర్తింపు పొందిన JNU పై నిన్న రాత్రి చీకటి శక్తులు ఫాసిస్టు దాడికి దిగాయి. శ్రమ దోపిడీ వ్యవస్తచే శ్రమభారత్ పగలంతా పీడించబడి, రాత్రి అలసట తీర్చుకునే నిషిరాత్రి వేళ, గత రాత్రంతా ఆ నిప్పు రవ్వలు మెలకువతోనే వున్నాయి. ఔను, మున్ముందు ఫాసిజాన్ని బద్దలు కొట్టాల్సిన శ్రమ భారత్ అనే డైనమైట్ కి గల వత్తి దగ్గరకు నిప్పురవ్వల్ని చేరనివ్వకూడదని రాజ్యం కంకణం కట్టుకుంది. అట్టి రాజకీయ నిబద్ధత రాజ్యానిది. ఆ నిప్పురవ్వలను కూడా శాశ్వతంగా నిద్ర పుచ్చుదామనే వ్యూహంలో భాగంగా నిన్న రాత్రి చీకటి రాజకీయ శక్తులు నిప్పురవ్వలపై దాడికి దిగాయి.

కానీ అవి శాశ్వత నిద్రలోకి జారిపోలేదు. పైగా అవి గత రాత్రంతా మెలకువతోనే ఉన్నాయి. దేశ ప్రజల్ని మేల్కొలిపే పనిలోనే మునిగి ఉన్నాయి. వాటికి నిద్రలేదు. కునుకు లేదు. సమాజాన్ని మేల్కొలిపే బాధ్యతను అవి విడిచిపెట్ట లేదు. రేపటి భారత్ ని ఫాసిస్టు శిబిరంగా మార్చ జూసే చీకటి రాజకీయ శక్తుల వాస్తవ అంతిమ లక్ష్యం విద్యార్ధి లోకం కాదు. నిజానికి శ్రమ దోపిడీ వ్యవస్థ అంతిమ లక్ష్యం శ్రమ భారత్ మాత్రమే! అట్టి శ్రమ భారత్ ని మేల్కొలిపే చారిత్రిక కర్తవ్యం కోసం నిద్ర పోకుండా గతరాత్రి తమను తాము మిణుగుర్లుగా, నిప్పు రవ్వగా నిలిచిన JNU కి విప్లవ జేజేలు పలుకుదాం. మీ వెంట బాసటగా నిలుస్తామని చాటి చెబుదాం. ఈరోజు వీలున్న అన్ని రూపాల్లో నిరసన తెలియజేద్దాం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధిలోకం తమవంతు పాత్రను పోషిస్తుందని ఆశిద్దాం.

-ఇఫ్టూ ప్రసాద్

Comments are closed.

Exit mobile version