తుళ్లూరి బ్రహ్మయ్య… ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక పరిచయం అక్కరలేని రాజకీయ నేత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇటీవలి వరకు అంటే గత పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు కూడా ఆయన అదే పార్టీలో ఉన్నారు. అప్పటి వరకు టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నారు కూడా. దివంగత ఎన్టీ రామారావు జీవించి ఉన్న కాలంలోనూ ఆయనకంటూ ఓ గుర్తింపు ఉంది. అప్పట్లో ఎన్టీఆరే కాదు ప్రస్తుతం చంద్రబాబునాయుడి వరకు తుళ్లూరి బ్రహ్మయ్యను గుర్తుపట్టి, పేరు పెట్టి పలకరిస్తారంటే ఆతిశయోక్తి కూడా కాకపోవచ్చు.

మణుగూరు ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగిడి మండల స్థాయి ప్రజాప్రతినిధిగా, ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షునిగా, డీసీసీబీ డైరెక్టర్ గా, సాధారణ కార్యకర్త స్థాయి నేత నుంచి నియోజకవర్గ ఇంచార్జిగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. గత డీసీసీబీ ఎన్నికల్లో చైర్మెన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటి ఎన్నికల్లో సీల్డ్ కవర్లో చంద్రబాబునాయుడు బ్రహ్మయ్య పేరునే పంపినప్పటికీ, తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ చక్రం తిప్పిన కారణంగా త్రుటిలో ఆ పదవి బ్రహ్మయ్య చేజారి, మువ్వా విజయబాబుకు దక్కిందనే వార్తలు వచ్చాయి. దీంతో అప్పటి వరకు తుమ్మల అనుచరునిగానే ఉన్న బ్రహ్మయ్య తీవ్రంగా నొచ్చుకుని నామా నాగేశ్వరరావు వర్గంలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రహ్మయ్య నామా వెంటే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు విజయానికి బ్రహ్మయ్య తీవ్రంగానే శ్రమించారు.

మారిన రాజకీయ పరిణామాల్లో గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నామా నాగేశ్వరరావు వెంటే బ్రహ్మయ్య కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తాజా రాజకీయ దృశ్యమైన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ పదవిని బ్రహ్మయ్య ప్రస్తుతం మరోసారి ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే తుళ్లూరి బ్రహ్మయ్య తనకు చైర్మెన్ పదవి దక్కేలా చూడాలంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఈ ఫొటో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మయ్య అభిమానులు ఈ ఫొటోను చూసి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. బ్రహ్మయ్యకు మంత్రి అజయ్ ఆశీర్వాదం లభిస్తుందో లేదో చూడాలి మరి.

Comments are closed.

Exit mobile version