ఓ పెద్ద గొయ్యి…అందులో అత్యంత పదునైన ఇనుప చువ్వల్లాంటి కర్రలు. పొరపాటున ఎవరైనా అందులో పడితే ఇక అంతే సంగతులు. ‘ఏమవుతుంది… చువ్వల్లాంటి కర్రలే కదా… బరువు పడితే విరిగిపోతాయ్ …’ అని భ్రమిస్తే మాత్రం ‘స్పైక్ హోల్స్’లో కాలేసినట్లే. ఇందులో పడినవారి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవేవో చెత్తా, చెదారంతో కూడిన కర్ర పుల్లలు కావు. మావోయిస్టు నక్సల్స్ ఏర్పాటు చేసిన ‘స్పైక్ హోల్స్’. తెలంగాణా పోలీసుల పరిభాషలో చెప్పాలంటే ‘బూబీ ట్రాప్స్’.

ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మావోయిస్టు నక్సల్స్ ఏరివేతకోసం ‘ఆపరేషన్ ప్రహార్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వివిధ రకాల పోలీసు బలగాలు ఇటు తెలంగాణా నుంచి అటు మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వరకు అడవులను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు నక్సల్స్ శిబిరాలపై ముప్పేట దాడులు నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని తీవ్రవాద ప్రభావం గల బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్, సుక్మా తదితర జిల్లాల్లో నక్సల్స్, పోలీసుల మధ్య తరచుగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. వేర్వేరు ఘటనల్లో ఇరువర్గాలకూ నష్టం వాటిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మావోయిస్టులు ఏర్పాటు చేసిన ‘స్పైక్ హోల్’

ఈ నేపథ్యంలోనే పోలీసు బలగాలు తమ ఆధీన ప్రాంతాల్లోకి రాకుండా నిలువరించే చర్యల్లో భాగంగా అడవుల్లో నక్సల్స్ ఇటువంటి స్పైక్ హోల్స్ తవ్వారు. ఈ గొయ్యి పైభాగాక ఎండుటాకులు, దుబ్బ, ధూళితో కప్పేస్తారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఏమరుపాటుగానో, ప్రమాదవశాత్తు ఇందులో పడితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. అందులో పడగానే ఇనుప చువ్వలకు ఏమాత్రం తీసిపోని పదునైన కర్రలు కాళ్లకు దిగుతాయి. షూ ధరించిన కాళ్లకు సైతం ఈ కర్రలు దిగుతాయంటే వాటి పదును తీవ్రతను అవగతం చేసుకోవచ్చు. అత్యంత పదునైన చువ్వల్లాంటి ఈ కర్రలకు నక్సల్స్ విష పదార్థాలు పూస్తారనే ప్రచారం కూడా ఉంది. భద్రతా బలగాలు ఇందులో పడగానే నక్సల్స్ కాల్పులు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ‘బూబీ ట్రాప్స్’గా తెలంగాణా పోలీసులు వ్యవహరించే ఈ ‘స్పైక్ హోల్స్’లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఉదంతాలు అనేకం.

ఛత్తీస్ గఢ్ పోలీసులు ‘ఆపరేషన్ ప్రహార్’ ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో మావోయిస్టులు తమ రక్షణ కోసమేగాక, భద్రతా బలగాలకు వల వేసేందుకు ‘స్పైక్ హోల్స్’ను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. దంతెవాడ జిల్లా బుర్గం మార్గంలో గుర్తించిన వీటిని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. బుర్గువామ్-ముడి మార్గంలో పెద్ద ఎత్తున నక్సల్స్ తవ్విన ‘స్పైక్ హోల్స్’ను భద్రతా బలగాలు ఛేదించాయి. ‘ఆపరేషన్ ప్రహార్’లో పాల్గొంటున్న పోలీసు బలగాలను ‘స్పైక్ హోల్స్’ ప్రస్తుతం బేజారెత్తిస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version