టేకులగూడెం గ్రామంలో ఉన్న రెండు పార్టీలు ఇటు టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు తీసుకున్న నిర్ణయం:
మాచర్ల మహేష్ మరియు పొడిషెట్టి ప్రభుదాసు వల్ల గ్రామంలో గొడవలు మరియు అశాంతి అవుతున్నందున ఇరు పార్టీలు ఇక మీదట ఈ ఇద్దరు వ్యక్తులను పార్టీ కార్యక్రమాలకు గాని,  ఇతర పార్టీ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉంచుటకు ఇరు పార్టీ వర్గాలు నిర్ణయం తీసుకోవడం అయినది. ఇక మీదట గ్రామంలో గ్రామ ప్రజలకు ఎలాంటి హాని జరిగిన ఇరు పార్టీలు కలిసి సమస్యను పరిష్కరించుకుందాం. ఒక వేళ మా గ్రామంలో పరిష్కారం కానపుడు మడికొండ సీఐగారి ద్రుష్టికి తీసుకునివస్తాము. గ్రామంలో మా ఇరు పార్టీల సారం ఒక్కటే. గ్రామంలో శాంతియుత వాతావరణం కోరుకుంటున్నాము.

ఏమిటీ…ఇదంతా? అనుకుంటున్నారు కదూ? కుల బహిష్కరణ, సంఘ బహిష్కరణ లేదా సామాజిక బహిష్కరణ టైపు అన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే పార్టీ బహిష్కరణ, లేదంటే రాజకీయ బహిష్కరణ అన్నట్లు. పార్టీ బహిష్కరణ అయితే సంబంధిత పార్టీ తమ కార్యకర్తపైనో, నాయకుడిపైనో క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది కదా? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనో, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపైనో చర్యలు తీసుకుంటున్నట్లు పొలిటికల్ పార్టీలు ప్రకటిస్తుంటాయి. కానీ అధికార, విపక్ష పార్టీలు కలిసి ఓ గ్రామంలోని ఇద్దరు వ్యక్తులపై ‘సయుంక్త బహిష్కరణ నిర్ణయం’ తీసుకోవడమే ఇక్కడ అసలు విశేషం. ఇంతకీ ఈ మహేష్, ప్రభుదాస్ అనే వ్యక్తులు ఎవరంటే వరంగల్ జిల్లా కాజీపేటకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో టేకులగూడెం గ్రామస్తులు.

ఇంతకీ విషయమేంటంటే టేకులగూడేనికి చెందిన మహేష్, ప్రభుదాస్ అనే వ్యక్తుల వల్ల గ్రామంలో గొడవలు జరిగి అశాంతి కలుగుతోందట. అందుకే గ్రామంలో గల కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఐక్యంగా తీసుకున్న నిర్ణయపు సారాంశం మొదటి పేరాలోనే చదివారు కదా? ఈ ప్రకటనను గ్రామానికి చెందిన రెండు పార్టీల నేతలు బాహాటంగానే విడుదల చేయడం విశేషం.

ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరంలో మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు వస్తున్నాయట. కొద్ది రోజుల క్రితం వరంగల్ నగరానికి చెందిన పలువురు నాయకులపై, తాజాగా కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై మావోయిస్టు పార్టీ నేత వెంకటేష్ పేరుతో హెచ్చరిక లేఖలు విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ లేఖలు అసలువో, నకిలీవో తెలియని మీమాంసలో ఆరోపణలు ఎదుర్కున్నవారు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే ఆయా లేఖల వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని, మావోయిస్టు నేత ఏసోబు కొడుకు మహేష్ ను ఉపయోగించుకుని నకిలీ ఉత్తరాలను రాయిస్తూ, తన హత్యకు కుట్ర పన్నారని రాఘవరెడ్డి ఆరోపించిన విషయమూ విదితమే. ఈ లేఖల వెనుక మహేష్, ప్రభుదాసులతోపాటు ఓ పత్రికా విలేకరి కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఇంతకీ… మొత్తంగా సబ్జెక్టు సింక్ అవుతున్నట్లే కదా? టేకులగూడెం గ్రామంలోనే కాదు సమాజంలో ఎక్కడ అలజడి, అశాంతి చెలరేగినా చట్ట ప్రకారం పోలీసులు చర్య తీసుకోవాలి. ఇది పోలీసుల విద్యుక్త ధర్మం కూడా. ఇందుకు విరుద్ధంగా టేకులగూడెంలో గల రెండు పార్టీలు ‘అశాంతి’కి కారకులనే అభియోగంపై ఇద్దరు వ్యక్తులపై ఓ రకంగా ‘బహిష్కరణ’ అస్త్రం వేసిన పరిణామాల్లోనే మావోయిస్టుల లేఖలు విడుదలయ్యాయనే వాదన వినిపిస్తోంది. ఏసోబు కొడుకు మహేష్ చేత ఏవో అదృశ్య శక్తులు ఈ లేఖలు రాయిస్తున్నాయని టేకులగూడెం గ్రామానికే చెందిన జంగా రాఘవరెడ్డి చేస్తున్న ఆరోపణ కూడా ఈ సందర్భంగా గమనార్హం. ఇంతకీ మొత్తం పరిణామాలకు మూల కారణాలేమిటో బోధపడుతున్నట్లే కదా? టేకులగూడెం గ్రామంలో అశాంతి, అలజడి ఏర్పడితే… అందుకు బాధ్యులుగా ఓ ఇద్దరు వ్యక్తులను పేర్కొంటూ, వారిని ప్రత్యక్షంగా పార్టీ బహిష్కరణకు, పరోక్షంగా ‘రాజకీయ సామాజిక’ బహిష్కరణకు గురి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? అని మాత్రం ప్రశ్నించకండి. వాళ్ల ఇబ్బందులు వాళ్లకు ఉండవచ్చు.

Comments are closed.

Exit mobile version