‘హైకోర్టు ఏం చెప్తది? కొడ్తదా? సంకల సంస్కాన ఉంటెనే కదా? ఇచ్చేది? హైకోర్టుకు దీనిపై తీర్పు చెప్పే అధికారం లేదు.’ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 25వ తేదీన విలేకరులతో చేసిన వ్యాఖ్యలివి.

‘అట్ల కామెంట్ చేయడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా…డబ్బులు ఇచ్చేది. ఒక్క హుజూర్ నగర్ కే ఇస్తదండీ? మేం పాలకు కూడా రూ. 4 ప్రోత్సాహకం కింది ఇస్తున్నం. రూ. 2 వేలు ఫించన్ ఇస్తున్నం. రూపాయికి కిలోబియ్యం ఇస్తున్నం. వికలాంగులకు రూ. 3 వేలు ఫించన్ ఇస్తున్నం. చాలా ఇస్తుంటం. చాలా ఇస్తం. ప్రభుత్వం ఒకటి ఇస్తదా? నువ్వు గాడ ఎట్ల ఇచ్చినవ్? ఈడ ఎట్ల ఇచ్చినవ్? అంటరు. అలా ఉంటదానండీ లెక్క? ఆ పని మాది కదా?’ ఉప ఎన్నికలు జరిగిన హుజూర్ నగర్ కు రూ. 100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు ఇవ్వడానికి రూ. 47 కోట్లు లేవా? అని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా మరో రోజున విలేకరుల సమావేశంలో కేసీఆర్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే కదా?

ఇదిగో ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికిన సందర్భంగా, కేసీఆర్ అర్జంట్ గా తక్షణ అవసరాల కోసం ఆర్టీసీకి రూ. 100 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశారు. రాత్రికి రాత్రి ఉత్తర్వు కూడా జారీ కావడం విశేషం. అన్నీ మర్చిపోయే విధంగా, అంతిమంగా ఆర్టీసీ కార్మికుల హదయాలను కేసీఆర్ కొల్లగొట్టేశారు. బేషరతుగా విధుల్లో చేరుతామని కార్మికులు వీధుల్లోకి వచ్చి కన్నీళ్ల పర్యంతమైన మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు కేసీఆర్ మనసు కరిగింది. రాజు ప్రజలను తమ బిడ్డలుగా భావించాలని న్యాయమూర్తులు హితవు పలికినా పట్టించుకోని సీఎం ఆర్టీసీ కార్మికులు కూడా తమ బిడ్డలేనని ఎట్టకేలకు గురువారం అంగీకరించారు. తెలంగాణాలోని సగం బస్సు రూట్లను ప్రయివేట్ వారికి ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ అంశంలో మంచి స్పష్టత కూడా ఇచ్చారు. తాము అనుకున్నది వేరని, బయట సన్నాసులు ప్రచారం చేసింది వేరని చెబుతూ, రిటైరైన సిబ్బందికే ప్రయివేట్ పర్మిట్లు ఇవ్వాలన్నది తమ అభిమతంగా వెల్లడించారు. యూనియన్ల మాటలు వింటే బజారున పడతారని, తన మాట వింటే బాగు పడతారని కార్మికులకు మంచి పాఠం చెప్పారు. కార్మికులను బజారున పడేసిందే యూనియన్లు, విపక్ష పార్టీల నేతలని నిందిస్తూ, సెక్షన్ 22 (1ఏ), 1బీ ప్రకారం ఇప్పటికీ కార్మికులు చట్ట వ్యతిరేక సమ్మెలోనే ఉన్నారని, లేబర్ కోర్టు ప్రకటించాల్సింది ఏమీ లేదని కూడా తేల్చిపడేశారు. తెలంగాణాలో తాము ఎవరి పొట్టలు కొట్టలేదని, ఆర్టీసీ కార్మికులు హ్యాపీగా డ్యూటీలో చేరవచ్చని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

యాభై రెండు రోజుల నిరవధిక సమ్మె, సుమారు 30 మంది కార్మికుల బలిదానం, అనేక ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు దారి తప్పి ప్రమాదానికి గురైన ఘటనలు, టికెట్ల గోల అన్నీమర్చిపోయే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు ఆనందంలో మునిగిపోయారు. కార్మికులను తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే దాదాపు పోయినట్లే అనుకున్న ఉద్యోగాలను కేసీఆర్ దయతలచి ఇచ్చినంత పరిణామాలు మరి. అందుకే కేసీఆర్ ను ‘మనసున్న మారాజు’ గా అధికార పార్టీ ప్రసార సాధనాలు కీర్తిస్తున్నాయి కూడా.

ఆర్టీసీ సమ్మెలో ఆందోళన చిత్రం (ఫైల్ ఫొటో)

కానీ మొత్తం ఎపిసోడ్ లో ప్రజల ‘పర్సు’ కకావికలమయ్యే పరిణామం. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు. పల్లె వెలుగు, రాజధాని, వోల్వో, గరుడ సర్వీసులంటూ తారతమ్యం ఏమీ లేదు. గతంలో శాతం చొప్పున ఆర్టీసీ చార్జీలు పెరిగేవి. తొలిసారి  అన్ని సర్వీసుల్లో ప్రతి కిలోమీటరుకు 20 పైసల చొప్పన పెంపు. సర్కారు లెక్కల ప్రకారం ఏడాదికి రూ. 725.00 కోట్ల వరకు అదనపు ఆదాయం రావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సమ్మె చేసిన కార్మికుల డిమాండ్లేవీ తీరలేదు. అవి తీరుతాయా? లేదా? అనే విషయాన్ని లేబర్ కోర్టు తేల్చాల్సి ఉంది. మొత్తంగా రాజు దయ తలిచారు. బస్సులు రోడ్లెక్కాయి. ఇక మీ జేబులు సర్దుకోండి. ఓ వంద కిలోమీటర్లు ప్రయాణిస్తే మరో ఇరవై రూపాయలు అదనంగా పర్సులో ఉంచుకోండి. ఇదే ఆర్టీసీ సమ్మెలో మర్చిపోలేని విశేషం.

Comments are closed.

Exit mobile version