అశ్వత్థామరెడ్డి…ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్. ఆర్టీసీ సమ్మెను 52 రోజులపాటు కొనసాగించిన చారిత్రక నేపథ్యం. సీఎం కేసీఆర్ వైఖరి, కోర్టులో వాద, ప్రతివాదనలు, చివరికి లేబర్ కోర్టుకు చేరిన పరిణామాలు. ఈ నేపథ్యంలోనే సమ్మె విరమిస్తున్నామని, విధుల్లో చేరుతామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె విషయంలోనే కాదు, దానికి నేతృత్వం వహించిన అశ్వత్ధామరెడ్డి అంటే కూడా ప్రస్తుతం కేసీఆర్ భగ్గుమంటున్నారు. యూనియన్ల గురించి, అశ్వత్థామరెడ్డి గురించి కేసీఆర్ గతంలో ఏం మాట్లాడారు? తాజాగా నిన్న సాయంత్రం ఇదే యూనియన్ల గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? ఇప్పడు కార్మిక వర్గాల్లో ఇదే పెద్ద చర్చ. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన సందర్భంగా అశ్వత్థామరెడ్డి పేరును కేసీఆర్ ప్రస్తావింకపోయినా, పదే పదే ఆర్టీసీ యూనియన్లనే టార్గెట్ చేయడం గమనార్హం. సాధారణ ఎన్నికలకు ముందు ఆర్టీసీ యూనియన్లు, వాటి అవసరం, ఆవశ్యకత గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చదవండి.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

‘‘సింగరేణి మీద గులాబీ జెండా ఎగిరింది. హైదరాబాద్ నగరంలో, జీహెచ్ఎంసీ యూనియన్లో అద్భుతమైన విజయాన్ని సాధించి టీఆర్ఎస్ అనుబంధ సంస్థనే గులాబీ జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ ఎన్నికల్లో అందరి ఊహలు తలకిందులు చేసి, సంస్థ ఆవిర్భవించి ఇంత స్పీడ్ గా విస్తరించడం, రాకెట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్ తోని విస్తరించి, అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఫలితాన్ని ఈరోజు సాధించడం జరిగింది. దీన్ని బట్టి అర్థమయ్యేది, తెలంగాణా ద్రోహులెవరైతే ఉన్నరో? రేపు రాబోయే రోజులల్ల జరగబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ లో కూడా తెలంగాణా ప్రజలు ఇదే రకంగా బుద్ధి చెప్తరు. అయితే…టీఎంయూ నాయకులకు నాదొక్కటే విజ్ఞప్తి. కార్మికులు ఇంత ఆవేశపూరితంగా మనకు విజయం చేకూర్చిండ్లు కాబట్టి, కార్మికుల యొక్క కాలికి ముల్లు గుచ్చితే మన పంటితోని పీకేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలె. కార్మికలోకానికి మనం అంత సేవ చేయాలె. కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు రానియ్యెద్దు. వాళ్లందరు కూడా, వాళ్లకు సంబంధించిన సమస్యలకు సంబంధించి మన మీద చాలా పెద్ద విశ్వాసం పెట్టిండ్రు కాబట్టి, అశ్వత్థామరెడ్డిగారితోని, థామస్ రెడ్డిగారితోని, మిగతా మిత్రులందరితోని నేను కోరేదేందంటే? కార్మికులతో వినయంగా, మంచి పద్ధతిలో, కార్మికుల రక్షణ కవచంగా ఉండే పద్ధతుల్లో మనం ముందుకు పోవాలె. అప్పడే మన విజయానికి కూడా సార్థకత వస్తదని మనవి చేస్తూ, ఈరోజు ఖచ్చితంగా ఈ విజయాలన్నీ కూడా, అల్టిమేట్ గా తెలంగాణా ఉద్యమం, తెలంగాణావాదం యొక్కవిజయం. ఆ వైపే ఈ ఉద్యమం దారి తీసింది. ఇయ్యాల మరొక్కసారి తెలంగాణావాదాన్ని నెత్తకెత్తుకున్నటువంటి ఆర్టీసీ కార్మిక లోకానికి నేను హదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంక ఏ యూనియన్లు కూడా లేవ్. మేజర్…మేజర్గా ఉన్నటువంటి సింగరేణిలో, మేజర్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఆర్టీసీలో, మేజర్ గా ఉండేటువంటి జీహెచ్ఎంసీలో అద్భుతంగా ఇయ్యాల… తెలంగాణ వాదమే అప్రతిహతంగా గెలుస్తా ఉంది. ఈ విజయ పరంపర ఇట్లాగే కొనసాగుతది. రాబోయే రోజులల్లో ఖచ్చితంగా మనం కలలు గంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని యాచించి కాదు, శాసించి తెచ్చుకునే విధంగా, రేపు జనరల్ ఎన్నికల్లో కూడా కార్మిక లోకానికి నా విజప్తి. మీరు తల్చుకుంటే చాలా అద్భుతంగా పని చేయగల్గుతరు కాబట్టి, అనునిత్యం మీరు ప్రజల్లో ఉంటరు కాబట్టి, మా మహిళా కండక్టర్ సోదరీమణులు కూడా వచ్చిండ్రు, వాళ్లందరు కూడా అద్భుతంగా పని చేసిండ్రు, బస్సులల్ల రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను చేరవేసే బాధ్యతల్ల మీరుంటరు కాబట్టి, మీరు తల్చుకుంటే రేపు జనరల్ ఎలక్షన్స్ లల్ల కూడా తెలంగాణావాదాన్ని గెలిపించడానికి ఇదే ఊపుతోని మనకు లాభం జర్గుతది కాబట్టి, ఈ విధంగా ముందు పని చేయాలని, యూనియన్ నాయకులు కార్మికుల పట్ల చిత్తశుద్ధితోని, కార్మికుల సంక్షేమం పట్ల పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మరొక్కసారి ఆర్టీసీ కార్మిక లోకానికి అభినందనలు తెలియజేస్తున్నాను.’’

ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్న సందర్భంగా కేసీఆర్ మీడియా సమావేశంలో యూనియన్ల గురించి చేసిన ప్రసంగం కూడా ఆయన మాటల్లోనే…

‘‘యూనియన్ల మాట విని ఆర్టీసీ కార్మికులు పెడదారి పడుతున్నరు. చెడిపోతున్నరు. సంస్థను దెబ్బతీస్తున్నరు. జీవితాలు పాడు చేసుకుంటున్నరు. లేని టెన్షన్ కు గురైతాండ్లు. ప్రధాన సమస్య అదే. దానివల్లనే ఈరోజు అసంబద్ధమైన డిమాండ్లతో అనాలోచితమైన సమ్మెను ఇంత దూరం తెచ్చిండ్రు. దీనికి పూర్తి బాధ్యత వారే వహించాల్సి ఉంటది. ఈ బాధ, అవస్థకు, అనవసరమైన ప్రయాసకు ఇంక ఎవరూ బాధ్యత వహించరు. అవునన్నా, కాదన్నా ఇది చరిత్రలో ఉంటది. మీకు ఏ యూనియన్ సహాయపడదు. యూనియన్ లేకపోతే ఎట్లా అని మీకు అనుమానం ఉంటది. బానిస కార్మికులుగా ఉండాలా? యాజమాన్యం వేధింపులు భరించాలా? అని అనుకోకండి. మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ పెడతా. సానుభూతితో వ్యవహరించే సీనియర్ మంత్రిని ఇంచార్జిగా పెడతా. ప్రతి నెలా నిర్ణీత తేదీలో సమావేశం జరిగేట్లు ఏర్పాటు చేస్తా. యాజమాన్యం మిమ్మల్ని వేధించకుండా చూస్తా. సంస్థ వేరు, కార్మికులు వేరు అనే అభిప్రాయాన్ని యూనియన్లు కలిగించాయి. యూనియన్ల ఉన్మాదంలో పడి మీ బతుకుల్ని పాడు చేసుకోవద్దు.’’ ఇవీ కేసీఆర్ తాజా వ్యాఖ్యలు.  

తెలంగాణా ఉద్యమంలో ముమ్మరంగా పాల్గొన్న నేపథ్యంలోనే తాను యూనియన్ ఏర్పాటు చేశానని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. అంతే తప్ప యూనియన్ లీడర్ గిరిపై తనకేమీ సోకు లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. యూనియన్లు, వాటి నేతల గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అశ్వత్థామరెడ్డి స్పందన ఇది.

కాగా ఈ వార్తా కథనం రాస్తున్న సమయంలోనే మరో తాజా సమాాచారం అందింది. తెలంగాణాలోని 97 ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులతో డిసెంబర్ 1వ తేదీన ప్రగతి భవన్లో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఇద్దరు మహిళా కార్మికులు ఖచ్చితంగా ఉండాలని కూడా ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే కార్మికులకు ప్రగతి భవన్లోనే భోజనాలను కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ స్వయంగా కార్మికులతో మాట్టాడుతారని అధికారిక సమాచారం.

Comments are closed.

Exit mobile version