జర్నలిస్టు అన్నాక కాస్త క్రియేటివిటీ చూపించాలి. లేకుంటే గుర్తింపు ఎలా వస్తుంది? టీఆర్పీ రేటింగ్ ఎలా పెరుగుతుంది? విషయం ఏదైనా సంచలనాత్మకంగా మార్చాలి. అప్పుడే వీక్షకుడు చూపు తిప్పుకోకుండా ఉత్కంఠగా ఆ టీవీని చూస్తూనే ఉంటాడు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కొందరు విలేకరుల అత్యుత్సాహం తెలిసిందే కదా? ప్రిన్స్ డయానా నుంచి అందాల నటి శ్రీదేవి వరకు జర్నలిస్టులు వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. డయానా మృతికి కొందరు జర్నలిస్టులే కారణమనే ఆరోపణలు కూడా వచ్చాయి. జర్నలిస్టులు వెంటాడడం వల్లే డయానా కారు వేగం పెరిగి ప్రమాదానికి గురైందనే వార్తలు కూడా వచ్చాయి. నటి శ్రీదేవి బాత్ టబ్బులో పడి చనిపోతే ఓ టీవీ జర్నలిస్టు అదే టబ్బులో పడుకుని అసలు శ్రీదేవి ఎలా చనిపోయింది? టబ్బు పొడవు ఎంత? వెడల్పు ఎంత? శ్రీదేవి హైటెంత? అంటూ విశ్లేషించిన తీరుపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అంతెందుకు తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో తన కారును వెంబడిస్తున్న విలేకరుల భద్రతపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు.

తనను వెంబడిస్తున్న జర్నలిస్టులను ఉద్దేశించి ఎంపీ సుప్రియా సూలే షేర్ చేసిన ఫొటో ఇదే.

ఇంతకీ అసలు సంగతి ఏంటంటారా? ఎంతసేపూ మీరే వెంబడించి ప్రముఖులను ఇబ్బందులకు గురి చేస్తారా? మిమ్మల్ని వెంటాడితే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానంటూ ఓ పంది ప్రత్యక్ష ప్రసారంలో గల పాత్రికేయుని వెంట పడింది. గ్రీక్ కు చెందిన మాంటికోస్ అనే రిపోర్టర్  పంది వల్ల మర్చిపోలేని చేదు అనుభవాన్ని చవి చూశారు. ఏఎన్టీ1 అనే టీవీలో ఉద్యోగం చేస్తున్న మాంటికోస్ కైనెటా నగరంలో వరద నష్టంపై లైవ్ ద్వారా రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో తన వద్దకు వచ్చిన ఓ పందిని తప్పించుకునేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక స్టూడియోలోని జర్నలిస్టులతో మాంటికోస్ మాట్లాడుతూ, ఓ పంది తమను ఉదయం నుంచీ వెంటాడుతోందని, తనను కొరకడానికి ప్రయత్నిస్తోందని, అందువల్ల ఓ చోట స్థిరంగా నిలబడలేకపోతున్నానని, తనను క్షమించాలని లైవ్ లోనే వేడుకున్నాడు. ఈ సీన్ ను చూస్తున్న స్టూడియోలోని జర్నలిస్టులు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. అందుకే తమదాకా వస్తేగాని అసలు బాధ ఏమిటో తెలియదంటారు.  ప్రస్తుతం మాంటికోస్ ను వెంటాడిన పంది వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరూ ఆ వీడియోను చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version