వీసీ సజ్జన్నార్… ప్రస్తుత సైబరాబాద్ పోలీస్ కమిషనర్. ఈ ఐపీఎస్ అధికారి వరంగల్ జిల్లా వాసులకే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పడు మళ్లీ, మళ్లీ గుర్తుకు వస్తున్నారు. ఎందుకో తెలుసా? సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఆయన వరంగల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏకశిలా నగరంలో ఆయన విధుల్లో ఉండగానే ఓ ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినిలు 2008 డిసెంబర్ మొదట వారంలో తమ కళాశాల నుంచి ఇళ్లకు వెడుతుండగా, ముగ్గురు యువకులు వారిపై యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు యువకులను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి ఉదంతంలో విచారణ కోసం పోలీసులు వారిని తీసుకువెళ్లి సాక్ష్యాలను సేకరిస్తున్న క్రమంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారు. దేశవాలీ తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు నిందితులు ప్రయత్నించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో యాసిడ్ దాడి నిందితులు ముగ్గురు మృతి చెందారు. యాసిడ్ దాడి జరిగిన కొద్ది రోజుల్లోనే జరిగిన ఈ ఎన్కౌంటర్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పటి వరంగల్ ఎస్పీ వీసీ సజ్జన్నార్ ను కళాశాల విద్యార్థినులే కాదు అనేక వర్గాల ప్రజలు స్వయంగా ప్రశంసించారు. సజ్జన్నార్ ను ఆయన నివాసం బయట కలిసి పూలబొకేలు, స్వీట్లు అందించారు.  ఈ ఎన్కౌంటర్ ఘటనలో మానవ హక్కులు తదితర అంశాలను పక్కన పెడితే ప్రజలు భారీ స్థాయిలో హర్షం వ్యక్తం చేసిన ఉదంతమిది. అంతేకాదు మళ్లీ వరంగల్ లో యాసిడ్ దాడి జరిగిన దాఖలాలు లేవు.

యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ తర్వాత వరంగల్లో అప్పటి ఎస్పీ సజ్జన్నార్ ను అభినందిస్తున్న విద్యార్థినులు (ఫైల్ ఫొటో)

ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఘటనలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యోదంతం మహిళల భద్రతకే సవాల్ గా పరిణమించినట్లు రాజధాని వాసులు భావిస్తున్నారు. ప్రియాంకారెడ్డి హత్యోదంతాన్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కేసును సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించడమేగాక, హైదరాబాద్ కు ఓ బృందాన్ని కూడా పంపించింది. ఓ నిస్సహాయురాలిపై తోడేళ్లలా విరుచుకుపడి దారుణానికి ఒడిగట్టారని కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డి దారుణ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించినట్లు తాజా సమాచారం. ప్రియాంకారెడ్డి హత్యపై అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments are closed.

Exit mobile version