ఈ నెలాఖరులో తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున వినాయక చవితి ఉత్సవాల అనంతరం తెలంగాణా అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆరు నెలల్లోపు అంటే ఈ నెల 25వ తేదీ లోపు శాసనసభ, మండలి తిరిగి సమావేశం కావాల్సి ఉంది. జూన్ ఒకటో తేదీన ఉభయసభలను ప్రొరోగ్ చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్​ సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్ జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అయితే ఈ నెల పదో తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యాకే సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఆయా ప్రాతిపదికన ఈ నెల నాలుగో వారంలో అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కావచ్చంటున్నారు.

దళిత బంధు పథకంతోపాటు ఇతర అంశాలు సమావేశాల్లో ప్ఱధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఇటీవల జారీ చేసిన అర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదం పొందనున్నట్లు అధికార వర్గాల అంచనా.

Comments are closed.

Exit mobile version