నిరుద్యోగులకు తెలంగాణా సీఎం శుభవార్తను ప్రకటించారు. తెలంగాణాలో 91,142 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే రోజులలో షెడ్యూల్ 9, 10 పరిష్కారం అయితే ఆంధ్రాలోనూ అవకాశాలు ఏర్పడుతాయని చెప్పారు. ఇవి కాకుండా మొత్తం ఉద్యోగుల విభజన అనంతరం 91, 142 ఖాళీలు ఏర్పడినట్లు చెప్పారు. ఈరోజు నుంచే నోటిఫై చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం.

తెలంగాణా ఉద్యోగాలు 95 శాతం శాశ్వత ప్రాతిపదికన స్థానికులకే దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకువచ్చామన్నారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే దక్కుతాయన్నారు. కేవలం ఐదు శాతం మాత్రమే నాన్ లోకల్ నియామకాలు ఉంటాయన్నారు.

రాష్ట్రంలో 1.56 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. మొత్తం 1.22 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేసినట్లు చెప్పారు. మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మొత్తం లక్షా 33 వేల 940 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు.

నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధానంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగిందన్నారు. నీళ్లు తీసుకువచ్చామని, నిధులు బడ్జెట్ లో కేటాయిస్తున్నామన్నారు. మన బడ్జెట్ నిధులు మనకే ఖర్చవుతున్నాయని చెప్పారు.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టంగా అభివర్ణించారు. తెలంగాణా కోసం దశాబ్ధాల ఉద్యమాలు జరిగాయన్నారు. అంతులేని వివక్షతో తెలంగాణా సమాజం నలిగిపోయిందన్నారు.

ఆకలి చావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు ఉండేవన్నారు. ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు నిరాశతో వివక్షకు గురయ్యారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా ప్రజలకు న్యాయం జరగదని డిప్యూటీ స్పీకర్ పదవిని త్యజించి పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. అనేక పోరాటాల మధ్య ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు.

రాజకీయాలంటే తమకు ఓ టాస్క్ గా కేసీఆర్ పేర్కొన్నారు. వేరే పార్టీలకు, వేరే నాయకులకు రాజకీయాలంటే ఓ గేమ్ గా ఆయన వ్యాఖ్యానించారు. తమ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారన్నారు. ఏకాగ్రత దెబ్బతినకూడదని బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నామని చెప్పారు. కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని అవినీతి రహితంగా పాలిస్తున్నట్లు చెప్పారు.

Comments are closed.

Exit mobile version