పండుగలు, పాండమిక్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని హుజూరాబాద్ ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంతకీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏ పండుగ తర్వాత జరగనుంది? ఇదీ తెలంగాణా రాజకీయ పక్షాల్లో తాజాగా జరుగుతున్న చర్చ.

పశ్చిమ బెంగాల్ లోని మూడు ఎమ్మెల్యే స్థానాలకు, ఒడిశాలోని ఓ శాసన సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆయా స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది

ఇదే దశలో తెలంగాణ, ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు ఇప్పట్లో లేవని ఎన్నికల సంఘం వెల్లడించింది. పండుగలు, పర్వదినాలు, కరోనా మహమ్మారి పరిస్థితులను చూసి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది.

అయితే పండుగ అంటే దసరానా? దీపావళా? ,క్రిస్మసా? అనే అంశాలపై క్లారిటీ లేదదనేది రాజకీయ వర్గాల సందేహం. దీంతో రాష్ట్రంలోని హుజురాబాద్ ఉప ఎన్నికపై సందిగ్ధం నెలకొన్నట్లు భావిస్తున్నారు.

వరుసగా వస్తున్న పండుగలను ఓసారి పరిశీలిస్తే వినాయక చవితి అనంతరం దసరా పండుగ వచ్చే నెలలో వస్తున్నది. ఈ పండుగ తర్వాతగా భావిస్తే నవంబర్ లో ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దీపావళి తర్వాత అయితే కూడా నవంబర్ చివరి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ క్రిస్మస్ పండగ తరువాత అంటే మాత్రం ఈ సంవత్సరంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల లేనట్లుగానే రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది జనవరిలోనే ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

మొత్తంగా ఆయా పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మరో మూడు నెలలపాటు, లేదంటే నాలుగు నెలల వరకు ఖరారైన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించక తప్పదు. ప్రతి కార్యకర్తను, చోటా, మోటా నేతలను ‘మర్యాద’గా చూసుకోక తప్పదు మరి.

Comments are closed.

Exit mobile version