‘‘ఏదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాం…ఈ తరహా ఘోరం జరుగుతుందని మాత్రం ఊహించలేదు. మమ్మల్ని సమాజంలో అవినీతి పరులుగా ముద్ర వేశారు. అక్రమ సంపాదన పరులుగా చిత్రీకరించారు. ప్రతి రంగంలో, ప్రతి వర్గంలో మంచీ, చెడూ ఉంటాయి. వాటి శాతంలో తేడా ఉండవచ్చు. కానీ పరిపాలించేవారే మమ్మల్ని దొంగలుగా, దోపిడీదారులుగా ప్రజల్లో ముద్రవేస్తే ఉపద్రవం తప్పదని కొంత కాలంగా ఆందోళన చెందుతూనే ఉన్నాం. జరగరాని ఘోరం జరిగిపోయింది. ఓ తహశీల్దార్ సజీవ దహనానికి బలైంది.’’  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ ఘటన నేపథ్యంలో ఓ రెవెన్యూ అధికారి ఆందోళన…ఆవేదన ఇది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సురేష్ ముదిరాజ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేయడంపై రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విజయారెడ్డి హత్యకు ఓ భూవివాదం కారణంగా తెలుస్తోంది. బాచారంలోని ఏడెకరాల భూ పట్టా విషయంలో నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే భూవివరాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయలేమని కార్యాలయ సిబ్బంది పేర్కొన్నట్లు వార్తల సారాంశం. విజయారెడ్డి దారుణ హత్యతో తెలంగాణాలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విధుల నిర్వహణలో తమకు రక్షణ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మెజిస్టీరియల్ అధికారాలు గల ఓ రెవెన్యూ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించి, పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేస్తే, ఏ ధైర్యంతో తాము విధులు నిర్వహించాలని రెవెన్యూ అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

వాస్తవానికి గత కొంత కాలంగా రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రెవెన్యూ శాఖను రద్దు చేస్తారని, వీఆర్వోలను తొలగిస్తారనే ప్రచారం జరిగింది. అంతేగాక తమను అవినీతిపరులుగా చిత్రీకరించడానికి పాలకవర్గ నాయకులే ఎక్కువగా ప్రయత్నించారని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రశంసలు కురిపించిన పాలకులే ప్రజల్లో తమను చులకన చేసే విధంగా మాట్లాడారని, ఫలితంగా రెవెన్యూ శాఖపై ప్రజల్లో గౌరవం లేకుండా పోయిందని ఓ తహశీల్దార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రెవెన్యూ సంఘాల నాయకుడు లచ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ అధికారులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు విజయారెడ్డి హత్యపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే తహశీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని రెవెన్యూ సంఘ నాయకులు తెలిపారు.

Comments are closed.

Exit mobile version