తెలంగాణా సీఎం కేసీఆర్ పిలుపే ఓ ప్రభంజనం. ఆయన పిలుపునిచ్చారంటే లక్షలాదిగా ప్రజలు తరలి రావలసిందే. పిడికెడు మందితో ప్రారంభించిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో తెలంగాణా సమాజం యావత్తూ ఆయన అడుగులో అడుగులేసింది. కదం తొక్కుతూ, పదం పాడుతూ ముందుకు కదిలింది. కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ సొంతం. తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకన్నా కేసీఆర్ మిన్నగా తెలంగాణా ప్రజలు భావించారు. ఇందులో భాగంగానే 2014 ఎన్నికల్లో గులాబీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సీఎం సీట్లో కేసీఆర్ ను కూర్చోబెట్టారు. అరు నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికల సమరశంఖం పూరించిన కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు రెండోసారి పట్టం గట్టారు. గతంకన్నా అత్యధిక స్థానాల్లో గెలిపించారు. అంతెందుకు ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిక్యతను ప్రజలు అప్పగించారు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కంచు కోటకు బీటలు వారుస్తూ గులాబీ పార్టీకి అద్భుతమైన మెజారిటీతో విజయం చేకూర్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ‘సారు-కారు-పదహారు’ నినాదం మినహా, అనేక ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన సమర పిలుపునకు తిరుగే లేదని ప్రజలు నిరూపించారు. ఇదే జోష్ లో మున్సిపల్ ఎన్నికల్లోనూ తమదే విజయమని టీఆర్ఎస్ అధినేత భారీ విశ్వాసంతో ఉన్నారు. ‘నేను చెప్పిన్నంటే నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది’ అని కేసీఆర్ అనేక సందర్భాల్లో పదే పదే చెబుతుంటారు. అటువంటి కేసీఆర్ పాచికలు ఆర్టీసీ సమ్మెలో ఎందుకు పారడం లేదు? ఇదీ ప్రస్తుతం రాజకీయ పరిశీలకుల్లో ఉద్భవిస్తున్న ప్రశ్న.

‘ఆర్టీసీ సమ్మె ముగియడం కాదు…ఆర్టీసీనే ముగుస్తున్నది‘ అంటూ గత నెల 24న హుంకరించిన పరిణామం నుంచి, ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే. వారి పొట్టకొట్టే ఉద్దేశం మాకు లేదు. మరో అవకాశం ఇస్తున్నా…బేషరతుగా విధుల్లో చేరండి’ అంటూ ఈనెల 2వ తేదీన కాస్త అభ్యర్థన రీతిలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కోరినా పెద్దగా ప్రయోజనం కనిపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ‘బయట ఎల్లయ్య ఏదో మాట్లాడ్తడు. ఓ సీఎంను… నన్ను పట్టకుని ఆ ప్రశ్న అడుగుతవానవయా? సోయి ఉండి మాట్లాడాలె.’ అంటూ పాత్రికేయుని ప్రశ్నపై ఎదురుదాడి చేసిన సంగతి విదితమే కదా? మరి… ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిస్తే ఆర్టీసీ కార్మికులు వినడం లేదేమిటి? ప్రతి ఎన్నికలోనూ అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్న గులాబీ బాస్ కు ఆర్టీసీ సమ్మె మింగుడు పడుతున్నట్లు లేదనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. దశలవారీగా భిన్న రకాలుగా స్పందిస్తున్నా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపునకు స్పందనగా ఆదివారం రాత్రి వరకు కేవలం 12 మంది మాత్రమే విధుల్లో చేరారు. ఇందులో వరంగల్‌లో అత్యధికంగా నలుగురు సిబ్బంది చేరారు. అయితే ఈ నలుగురు కూడా మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్న వారని సమాచారం. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ డిపో పరిధిలో అసిస్టెంట్ డిపో మేనేజర్‌, కామారెడ్డి, సత్తుపల్లిలలో ఒక్కొక్క డ్రైవర్‌, మిర్యాలగూడ, సిద్దిపేటలలో ఒక్కొక్క కండక్టర్‌.. బండ్లగూడలో మహిళా కండక్టర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరో ఇద్దరు  సిబ్బంది చేరారు. వీరిలో ఎక్కువ మంది పదవీ విరమణ తేదీ సమీపించినవారుగా తెలుస్తున్నది. రిటైర్మెంట్ చివరి రోజున విధుల్లో ఉండాలన్న నిబంధన కారణంగా ఇటువంటి వారు డ్యూటీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కార్మికవర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రాత్రి వరకు గల సమాచారం ప్రకారం 12 మంది మినహా, సోమవారం కార్మికులు విధుల్లో చేరిన దాఖలాలు కనిపించడం లేదు.

అయితే అధికార పార్టీకి చెందిన టీ న్యూన్ ఛానల్ మాత్రం సీఎం కేసీఆర్ పిలుపునకు భారీ స్పందన లభిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేస్తోంది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపోల బాట పట్టినట్లు ఊదరగొడుతున్నది. డ్యూటీలో చేరేందుకు డిపో మేనేజర్లకు కార్మికులు సమ్మతి పత్రాలు సమర్పిస్తున్నట్లు బ్రేకింగ్ న్యూస్ పేరిటి స్క్రోలింగ్ లు దంచుతున్నది. అయితే ఖచ్చితంగా ఎంత మంది చేరారు అనే విషయాన్ని మాత్రం టీ న్యూస్ స్పష్టం చేయలేకపోతున్నది. సీఎం పిలుపు మేరకు విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు తాము భద్రత కల్పిస్తామని పోలీసు యంత్రాంగం సైతం భరోసా ఇస్తున్నది.  డ్యూటీలో చేరేందుకు ఆసక్తి గలవారిని ఆర్టీసీ యూనియన్ నాయకులుగాని, మరెవరైనాగాని ప్రలోభాలకు గురి చేసినా, అడ్డంకులు కల్పించినా, బెదిరింపులకు పాల్పడినా, భౌతిక దాడులకు దిగినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు అధికారికంగానే ప్రకటనలు జారీ చేశారు. మరోవైపు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ‘ఆఫర్’ ను అంగీకరించాలని, చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని కూడా ఆయన సూచించారు. ఆర్టీసీ కార్మికులెవరూ భయాందోళన చెందవద్దని, ఆత్మగౌరవాన్ని చంపుకుని విధుల్లో చేరవద్దని ఇంకోవైపు ఆర్టీసీ జేఏసీ కోరింది. ఆయా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీలో తిరిగి విధుల్లో చేరిన కార్మికుల సంఖ్య ఆదివారం రాత్రి వరకు 12 మంది మాత్రమే. ఇంకా 49 వేలకు పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటూ వీధుల్లోనే ఉన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పిలుపునిస్తే ఆర్టీసీ కార్మికులు తండోపతండాలుగా విధుల్లో చేరుతారని అధికార పార్టీ వర్గాల అంచనా తలకిందులవుతోందనే వాదన వినిపిస్తోంది. అయితే సీఎం ఇచ్చిన గడువు సగానికిపైగా ముగిసింది. మంగళవారం అర్థరాత్రి వరకు గడువు ఇంకా మిగిలే ఉంది. సుమారు మరో 34 గంటల్లో అంటే ఈనెల 5వ తేదీ అర్థరాత్రి వరకు ఎంత మంది కార్మికులు విధుల్లో చేరుతారో వేచి చూడాల్సిందే. కాగా ఈ వార్తా కథనం రాస్తున్న సమయంలోనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ముబీన్ అనే డ్రైవర్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు డ్యూటీలో చేరిన కొద్ది గంటల్లోనే ముబీన్ తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. తోటి కార్మికులందరూ సమ్మె ఉద్యమంలో ఉండగా, తాను డ్యూటీ చేయడం సరికాదని ముబీన్ స్పష్టం చేశారు.

Comments are closed.

Exit mobile version