‘‘ఇదంతా ఎవరో కావాలనే చేయించారు. ప్రతిరోజూ ఒంటి గంటకు భోజనానికి ఇంటికొచ్చేవాడు. సోమవారం మాత్రం రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. ఇంత ఘాతుకానికి పాల్పడే ధైర్యం వాడికి లేదు. మతిస్థిమితం సరిగ్గా లేదు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు.’’

‘‘మేం ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న భూములు వివాదంలో ఉన్నాయి. నేను లేదా సురేష్‌ తండ్రి కృష్ణ రెవెన్యూ కార్యాలయానికి వెళ్తుంటాం. అసలు వివాదంతో సురేష్ కు సంబంధమే లేదు. సురేష్‌ ఆర్నెల్ల నుంచి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు.’’

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో నిందితుడైన కూర సురేష్ తల్లి కూర పద్మ, పెద నాన్న దుర్గయ్యల వాదనలివి. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల్లో తవ్ర భయాందోళన కలిగించిన విజయారెడ్డి హత్యోదంతంలో నిందితుడైన సురేష్ కుటుంబీకులు, సంబంధీకులు చెబుతున్న వాదనలు పోలీసులను కూడా విస్మయానికి గురి చేస్తున్నాయనే చెప్పాలి.

కూర సురేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతాడు. పెట్రోల్ బంకుకు లేదా చిల్లర వర్తకం చేసే వ్యాపారుల వద్ద పెట్రోల్ కొనుగోలు చేస్తాడు. ఇందుకు అతను డబ్బులు కూడా ఇస్తాడు. ఎందుకంటే పెట్రోల్ ఊరకే ఎవరూ పోయరు కదా మరి? ఎవరెవరికో ఫోన్లు కూడా చేస్తాడు. సురేష్ ఫోన్ వినియోగిస్తాడని స్వయంగా  అతని తల్లి పద్మ చెబుతోంది. మేడం రమ్మన్నారని రెవెన్యూ సిబ్బందితో చెప్పి తహశీల్దార్ ఆఫీసు లోనికి వెడతాడు. తహశీల్దార్ విజయారెడ్డితో వాగ్వాదానికి దిగుతాడు. ఆమెపై పెట్రోల్ పోస్తాడు. నిప్పంటిస్తాడు. తనకూ మంటలు అంటుకోవడంతో రోడ్డుపై పరుగెత్తుతాడు. చివరికి ఆసుపత్రి పాలవుతాడు. వివాదాస్పద భూమికి పట్టా ఇవ్వనందుకే తహశీల్దార్ ను సజీవ దహనం చేశానని స్వయంగా నిందితుడే వైద్యుల సమక్షంలో వాంగ్మూలం ఇస్తాడు. ఈ ఘటనకు ముందు తన పెదనాన్న దుర్గయ్యతో అనేకసార్లు ఫోన్లో మాట్లాడుతాడు. కానీ…సురేష్ కు మతిస్థిమితం లేదని అతని కుటుంబీకులు మీడియాతో వెల్లడిస్తారు. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి ఇన్ని పనులు చేయడం సాధ్యమేనా? ఏ పని ఎందుకు చేస్తున్నాడో మానసిక రోగికి గుర్తుంటుందా? లక్షలే కాదు రంగారెడ్డి వంటి జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి మానసిక స్థతి సరిగ్గా లేని వ్యక్తి లావాదేవీలు నిర్వహించడగలడా? తాను వినియోగిస్తున్న మొబైల్ లో ఎవరి నెంబరు ఏమిటో మతిస్థిమితం లేని వ్యక్తి గుర్తు పట్టగలడా? కాలిన గాయాలతో ఆసుపత్రి పాలైన మానసిక రోగి వైద్యుల సమక్షంలో వాంగ్మూలం ఇవ్వగలడా? ఇవీ ప్రశ్నలు.

అసలు విషయం బోధపడుతోంది కదా? విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడైన సురేష్ కాలిన గాయాలతో ప్రస్తుతం ఆసుప్రతిలో ఉన్నాడు. అతన్ని ఉరి తీయాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ సురేష్ మానసిక స్థతిపై అతని తల్లి, పెద నాన్న చెబుతున్న మాటలు పరస్పర విరుద్ధంగా ఉండడం గమనార్హం. మానసిక స్థతి బాగోలేదంటారు…ఎవరో రెచ్చగొట్టారు అంటారు…రెవెన్యూ ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో తెలియదు అంటారు. అసలు భూ వివాదంతో సురేష్ కు సంబంధమే లేదు అంటారు. పరస్పర విరుద్ధంగా ఉన్న కుటుంబీకులు వాదన సురేష్ ను రక్షించడం కోసమేనని రెవెన్యూ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎలా అంటే… తుపాకీతో కాల్పుల ఘటన నుంచి బయటపడేందుకు ఓ సినీ హీరో తన మానసిక స్థతి సరిగ్గా లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నట్లు అన్నమాట. సురేష్ మానసిక స్థతి సరిగ్గా ఉందా? లేదా? అనే విషయాన్ని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చే అవకాశం ఉంది. కానీ ఇదే దశలో విజయారెడ్డి సజీవ దహనానికి దారి తీసినట్లు భావిస్తున్న భూవివాదంలో గల ఓ రాజకీయ ప్రముఖుడైన ప్రజాప్రతినిధికి, రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధమున్నట్లు తాజా వార్తల సారాశం. ఆ ప్రముఖుడు ఎవరనేదే ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సురేష్‌ స్వగ్రామమైన గౌరెల్లిలో ఔటర్ రింగ్ రోడ్ పక్కనున్న భూముల్లో సురేష్‌ తాత వాటా ఏడెకరాలుగా సమాచారం. పెద్ద కుమారుడు దుర్గయ్య కాగా, చిన్న కుమారుడు కృష్ణ(సురేష్‌ తండ్రి). ఏడెకరాల్లో తమ వాటా రెండెకరాలు మాత్రమేనని కృష్ణ  ఓ మీడియా సంస్థకు చెప్పారు. ఈ భూములపై ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను పడినట్లు వార్తా కథనాల సారాంశం.  ఓ ముఖ్య ప్రజాప్రతినిధి సాయంతో ఆయా రియల్ ఎస్టేట్ సంస్థ రంగంలోకి దిగి,  ఒత్తిడి తెచ్చి భూమిని విక్రయించే విధంగా రైతులతో ఒప్పందం చేసుకుందట.  అయితే ఈ భూమికి కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాకపోవడంతో రిజిస్ట్రేషన్‌ సాధ్యపడలేదట. ఈ నేపథ్యంలోనే ఓ ముఖ్య ప్రజాప్రతినిధి మరోసారి రంగప్రవేశం చేసి ఒత్తిడి తెచ్చినట్లు వార్తా కథనాలు వచ్చాయి. అయితే కోర్టు విచారణలో గల  కేసు తేలేవరకు పాస్ పుస్తకాలు జారీ చేసేది లేదంటూ రెవెన్యూ అధికారులు చెప్పారని,  దీంతో తహసీల్దార్‌పైకి రైతులను ఉసిగొల్పినట్లు గ్రామస్థులు పేర్కొన్నట్లు ఆయా వార్తా కథనాల సారాంశం. ఈ నేపథ్యంలో అసలు ఈ భూవివాదంలో తలదూర్చిన ఆ ముఖ్య ప్రజాప్రతినిధి ఎవరు? ఏ పార్టీకి చెందినవారు? భూమిని క్రయం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థతో ఈ ప్రజాప్రతినిధికి గల లింకులేమిటి? అనే ప్రశ్నలకు జవాబు లభిస్తే విజయారెడ్డి సజీవ దహనానికి దారి తీసిన పూర్తి వ్యూహం బహిర్గతమయ్యే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం ఆ దిశగా దర్యాప్తు జరిపి విజయారెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తుందనే ఆశాభావంతోనే రెవెన్యూ ఉద్యోగ వర్గాలు ఉన్నాయి.

Comments are closed.

Exit mobile version