తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17న జరిగిందేమిటో నేటికీ మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకర్ల, దేశ్ ముఖ్ ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు. ఆ క్రమంలోనే 1948 సెప్టెంబర్ 17న దాడులు జరిగాయని తెలుసు. ఇంతకీ ఆ రోజు జరిగిందేమిటి? విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? అనేది ప్రతీసారి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏడు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్ర సెప్టెంబర్ 17వ తేదీని విద్రోహ దినంగా తేల్చి చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆనాటి భారత పాలకవర్గం వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో పేరుతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను దురాక్రమణ చేశారు. చెరపలేని చరిత్రను, గత చారిత్రక సత్యాన్ని వివాదాస్పదం చేసి ప్రజల మన్నలను పొందాలని పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు పదే పదే మోసపోతుంటారని లెనిన్ అన్నట్టు… నిజమైన చరిత్ర, ప్రజల త్యాగాలు నేటి తరం ప్రజలకు వివరించనంత కాలం పాలకవర్గాలు చెప్పిందే ప్రజలు నమ్మి మోసపోతారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాలకవర్గం తెలంగాణ ప్రజల త్యాగాలను తక్కువ చేస్తున్నారు. ఆనాటి పాలక పార్టీ కాంగ్రెస్ విలీనమని, మత కోణంలో లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ విమోచనని, ప్రజల ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న కమ్యూనిస్టులు ముమ్మాటికీ విద్రోహమంటున్నారు.
హైదరాబాద్ సంస్థానంలో పాలన రెండు విధాలుగా సాగింది. నిజాం రాజ్యం ప్రత్యక్ష పాలనలో ఉండే ప్రాంతం ఈ ప్రాంతాన్ని సర్ఫేఖాస్ అనేవారు. రెండోది నిజాం పరోక్ష పాలనలో ఉండే ప్రాంతం. పరోక్ష పాలన అంటే జమీందార్లు, దొరలు, భూస్వాములు, దేశ్ ముఖ్ ల ఆధీనంలో ఉండే ప్రాంతం. వీరు ఆ ప్రాంతం నుండి శిస్తులు వసూలు చేసి నిజాంకు చెల్లించేవారు. ఆయా ప్రాంతాల్లో పాలన చేసిన జాగీర్దార్లు నిజాం అండతో చేయని దుర్మార్గాలు లేవు. భూస్వాములు, దొరల నిరంకుశత్వం వల్ల 1910 లోనే నిజాం రాజు నిషేధించిన వెట్టి చాకిరి తెలంగాణ పరోక్ష పాలనలో కొనసాగింది.
అణగారిన వర్గాల ప్రజలకు ప్రత్యక్ష పాలనలో దొరికిన చట్టపరమైన వెసులుబాట్లు భూస్వాముల పరోక్ష పాలనలో లభించలేదు. వెట్టి చాకిరికి, దొరల పీడనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఉద్యమానికి ఆనాటి కమ్యూనిస్టులు నాయకత్వం వహించి ప్రజలను సాయుధ పోరాటం వైపు మరలించి గ్రామ గ్రామన స్వయం రక్షక దళాలను ఏర్పాటు చేసి దొరల, భూస్వాముల ఆగడాలను, దోపిడీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర మహాసభ పేరుతో ప్రారంభమైన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటం హైదరాబాద్ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసింది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఆర్య సమాజం జమీందార్లకు, భూస్వాములకు వత్తాసు పలికాయి. నిజాం రాజుకు, దొరలకు ఈ సంస్థలు వ్యతిరేకం కాదు. న్యాయమైన హక్కుల కోసం, విముక్తి కొరకు పోరాటం చేస్తున్న అణగారిన వర్గాల ప్రజలకు ఈ సంస్థలు వ్యతిరేకంగా పని చేశాయి.
నిజాం నిరంకుశ పాలనలో దేశ్ ముఖ్ లు, దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకరి లాంటి ఆగడాలపై ఎర్రజెండా అండతో పోరాటం ఉదృతం కాగా దొరలు గడీలు విడిచి హైదరాబాద్ పారిపోయేలా చేసింది. వేలాది మంది మాన, ప్రాణాలను దోచుకున్న ఊర్లలోని దొరలే కాదు, నిజాం కూడా గద్దె దిగే పరిస్థితిని రైతాంగ సాయుధ పోరాటం కలిగించింది. నలువైపుల నుండి వస్తున్న పోరాట వార్తలు నిజాంను ఉక్కిరి బిక్కిరి చేసాయి. అదే సమయంలో సంస్థానాల విలీనం పేరుతో నెహ్రూ ప్రభుత్వం నిజాం ప్రభుత్వంతో రాయబారాలు నడిపి, అతని డిమాండ్లకు ఒప్పుకుని రాజాభరణం ఇచ్చి మరీ లొందీసుకుంది.
ఆపరేషన్ పోలో పేరుతో వచ్చిన భారత సైన్యం, నిజాం లొంగిపోయినా తిరిగి వెళ్లలేదు. ఊర్లలో నుండి పారిపోయిన దొరలు కాంగ్రెస్ టోపీతో గ్రామాల్లోకి చేరుకునేలా సైన్యం అండనిచ్చింది. ప్రజల వైపున పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను మట్టుబెట్టేందుకు నెహ్రు సేనలు పూనుకున్నాయి. హైదరాబాద్ రాష్ట్రం మీద నెహ్రూ-పటేల్ సర్కార్ సైనిక చర్య తెలంగాణ చరిత్రలో మాయని మచ్చ. ఆ సైనిక చర్య పురోగమిస్తున్న తెలంగాణ పీడిత ప్రజల విప్లవాన్ని ఊబిలోకి నెట్టింది. నిజాంను లొంగదీసుకునే పేరుతో వచ్చిన సైన్యం అప్పుడప్పుడే భారత జనతా ప్రజాతంత్ర విప్లవానికి దారి చూపిస్తున్న వేగు చుక్కను అది హతమార్చింది. ఇంతటి దుర్మార్గాన్ని, దురాక్రమణను, విద్రోహాన్ని రాజకీయ పార్టీలు సుదినంగా చిత్రించబోవడం విషాదకరం.
హైదరాబాద్ స్టేట్ ఇండియాలో భాగం కానప్పటికీ అవకాశవాద పాలనకు అలవాటుపడిన నిజాం పాలకులు మొదటి నుండి బ్రిటిష్ పాలకులతో సన్నిహితంగానే మెదులుకున్నారు. టిప్పు సుల్తాన్ ను హతమార్చడంలో ఇంగ్లీష్ పాలకులతో విద్రోహ బుద్ధితో చేతులు కలిపిన నిజాం పాలకులు 1948 సెప్టెంబర్ 17న నెహ్రూ ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణ ప్రజలను వంచించి, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ప్రజల స్వేచ్ఛను హరించివేశారు. తెలంగాణ ప్రజా పోరాటాన్ని ఎదుర్కోలేని నిజాం పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ పోరాటాల ద్వారా భవిషత్ లో మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్ లు కలసి సెప్టెంబర్ 17 దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా చరిత్రలో నిలిచిపోయింది.
ఇండియాకు స్వాతంత్రం ఇచ్చే క్రమంలో తెలంగాణ లాంటి స్వతంత్ర సంస్థానాలు మా పాలనలో ఎన్నడూ లేవని వారి సంస్కృతి, జీవనం, సామాజిక, ఆర్ధిక స్థితిగతులు వేరని వారికి ఇష్టం లేకుంటే ఆ ప్రాంతాలను మీరు స్వతంత్రంగానే వొదిలెయ్యాలని బ్రిటిష్ పాలకులు చాలా సూటిగా చెప్పారు. దేశంలో అధికారమే పరమావధిగా స్వాతంత్ర ఉద్యమం చేసిన బ్రాహ్మణీయ శక్తులు అంబేడ్కర్ ఉద్యమం వల్ల దళిత, ముస్లింల ఐక్యత గమనించిన నాయకులు కావాలనే గాంధీని ముందుపెట్టి లార్డ్ మౌంట్ బాటన్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకొని ముస్లింలు అధిక జనాభా కలిగిన ప్రాంతాన్ని పాకిస్థాన్ దేశంగా విభజించారు. పాకిస్థాన్ విభజన వల్లనే దేశంలో బ్రాహ్మణ బనియా వర్గాలకు అధికారం వచ్చింది. బ్రిటిష్ వాళ్ల నుండి బ్రిటిష్ పాలించిన ప్రాంతానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. హైదరాబాద్, కాశ్మీర్ లాంటి పెద్ద సామంత రాజ్యాలకు ఇది వర్తించదు. బ్రిటిష్ పాలనకన్నా ముందు నుండే స్వతంత్రంగా ఉన్న తెలంగాణపై కన్నేసిన కాంగ్రెస్ పాలకులు ఎలాగైనా తెలంగాణను వశపరుచుకోవాలని తెలంగాణపై పోలీసు దాడి చేసి దుర్మార్గానికి ఒడికట్టారు.
నెహ్రూ సైన్యం దురాక్రమణ చేసిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది? ఎవరికి లాభం జరిగింది? ప్రజల పోరాటాలకు జడిసి పట్టణాలకు పారిపోయిన దొరలు, భూస్వాములు పల్లెలకు వచ్చారు. 1948 వరకు పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో 400 మంది మరణిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చి తెలంగాణ దురాక్రమణ జరిగిన 1948 నుండి 1950 వరకు సైన్యం జరిపిన హత్యాకాండలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, మరట్వాడ ప్రాంతాల్లో మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను సుమారు రెండు లక్షల మందిని ఊచ కోత కోశారని సుందర్ లాల్ కమిటీ నిర్ధారించింది. పోలీసు యాక్షన్ వల్ల గ్రామాలు వల్లకాడుగా మారాయి. లక్షల మంది హింసించబడ్డారు. రెండు లక్షల మంది కాన్సంట్రేషన్ క్యాంపులో నిర్బంధం అనుభవించారు. వెయ్యికి పైగా ఏజెన్సీ గిరిజన గ్రామాలను తగులబెట్టారు. గిరిజన మృతుల సంఖ్య వెలుగులోకి రాలేదు. ఐదు వేల మంది మహిళలు మిలటరీ అత్యాచారాలకు గురయ్యారు.
ప్రజల ప్రాణాలను మానాలను హరించి చేసిన సైనిక చర్యను కాంగ్రెస్ నేతలు విలీనం అంటున్నారు. విలీనమంటే ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా జరగాలి. ముస్లింలను ఊచ కోత కోసి, ముస్లిం పాలన పోయి బ్రాహ్మణ పాలన వచ్చినందున ఇది విమోచన అంటున్నది బీజేపీ. నిజాం రాజు అధికారాలేవీ 1956 వరకు తొలిగించలేదు. సైనిక చర్య తర్వాత నిజాం సైన్యం, నెహ్రూ సైన్యం, కాంగ్రెస్ పార్టీ వాలేంటీర్లు ఒక్కటై నరమేధం సాగించాయి. హైదరాబాద్ సర్వోన్నత అధికారిగా, రాజప్రముఖ్ గా నిజాం రాజు విశేష అధికారాలు అనుభవించాడు. ఆయన ఆస్తుల, అధికారాలకు బ్రాహ్మణ పాలకులు రక్షణ కల్పించారు. తెలంగాణ ను ఆంధ్రాలో కలిపే 1956 వరకు నిజాం రాజు చేతిలోనే అధికారం ఉంది. శాంతి భద్రతలు, విదేశాంగ వ్యవహారాలు, రక్షణ ఇండియన్ ప్రభుత్వ పరిధిలో ఉండగా సివిల్, క్రిమినల్, రెవిన్యూ జ్యడిషియల్ అధికారాలన్నీ పాత పద్దతిలో నిజాం రాజు ఆధీనంలో ఉన్నాయి.
ఎవరినుండి ఎవరికి విమోచన వచ్చినట్లు? ప్రజల నుండి నిజాం పాలకులకు విమోచన కలిగింది. ప్రజల నుండి దొరలు, భూస్వాములకు విమోచన కలిగింది. నిజాం నుండి కాంగ్రెస్ పార్టీకి అధికార మార్పిడి జరిగింది. దీన్ని ఎలా విమోచన అంటారో ఉత్సవాలు జరుపుకునే బీజేపీ చెప్పాలి. కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటున్నారు. ద్రోహం చేయాలంటే ముందు విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాసానికి విరుద్ధంగా వ్యవహరిస్తే అది విద్రోహం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 1946 నుండి నేటివరకు అలాంటి విశ్వాసం కల్పించలేదు. అది నేరుగా దురాక్రమణకే తెగబడింది. తెలంగాణను ఆంధ్రలో కలపడం కూడా దురాక్రమణే. అందువల్ల కమ్యూనిస్టులు చెపుతున్నట్లు ఇది విద్రోహ దినం కాదు. ఏ కోణంలో చూసిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల మీద జరిగిన దురాక్రమణ. ఈ దురాక్రమణ వల్లే తెలంగాణ ప్రాంతాన్ని బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో బ్రాహ్మణ పాలకులు ఆంధ్ర రాష్ట్రంలో బలవంతంగా కలిపారు. ఇది రెండో దురాక్రమణ. రెండు సార్లు దురాక్రమణకు గురైన తెలంగాణ ప్రపంచంలోనే అత్యంత దోపిడీకి గురైంది.
కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసుకుని వినోభా బావే భూదానోద్యమం ఎవరికి మేలు చేసిందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. దురాక్రమణలను, దోపిడీ పీడనలను తట్టుకోలేని ప్రజలు మళ్ళీ విప్లవ బాట పట్టారు. నక్సలైట్ల ఉద్యమంలో చేరి దొరల, భూస్వాముల ఆగడాలపై తిరగబడ్డారు. రూపం మార్చి దోపిడి కొనసాగిస్తున్న దొరలను గ్రామాల నుండి మళ్లీ పారదోలారు. 1995లో మలిదశ ఉద్యమం మొదలు పెట్టి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. త్యాగాల పునాదుల మీద రాష్ట్రాన్ని సాధించాక మళ్ళీ అదే తంతు పునరావృతమైంది. భూములు వదిలి వెళ్లిన దొరలు, భూస్వాములు గ్రామాల్లోకి వచ్చి అణగారిన వర్గాల ప్రజల నుండి భూములు గుంజుకొని దోపిడీని కొనసాగిస్తున్నారు. తెలంగాణ అణగారిన శ్రామిక వర్గాల విముక్తి కోసం మరో పోరాటం అవసరమని ప్రజల నుండి మరో బలమైన పోరు నినాదం వినిపిస్తోంది.
✍️ సాయిని నరేందర్
9701916091