‘పులితో వేట… నాతో ఆట’ పనికి రాదు అనే ఓ సినిమా డైలాగ్ గుర్తుంది కదా? నేను పులితోనే స్నేహం చేసి చూపిస్తాను…దానితో ఆడుకుంటాను అని ప్రాక్టికల్ గా చేసి చూపించింది ఓ గొర్రె. పులిని చూసి ఆ గొర్రె ఏ మాత్రం భీతిల్లలేదు. పైగా నాలుగేళ్లపాటు స్నేహం చేసినా… పులి ఆ గొర్రెను ఏమీ చేయలేకపోయింది. నువ్వు నన్నేం చేయగలవ్? అంటూ గొర్రె రెచ్చగొట్టినా పులి పట్టించుకోకపోగా, గొర్రెతో స్నేహం చేయడం విశేషం, రష్యాలోని ప్రిమోరియ్ పార్కులో 2015 చివరలో అధికారులు టిముర్ అనే గొర్రెను వదిలేశారు. చిత్రం ఏమిటంటే ఇదే పార్కులో గల అముర్ అనే సైబేరియన్ టైగర్ ను చూసి టిముర్ అనే పేరు గల గొర్రె ఏ మాత్రం జంకలేదు. పైగా పులిని చూసి రెచ్చగొడుతూ దాన్ని తెగ ఆట పట్టించేది. గొర్రె ధైర్యాన్ని చూసి అముర్ అబ్బురపడి దాంతో స్నేహం చేసింది.  పులి, గొర్రె కలిసి తింటూ, ఒకే బోనులో పడుకునేవి. కలిసి ఆడుకునేవి కూడా. పైగా జంతువులను ఎలా వేటాడాలో గొర్రెకు పులి నేర్పించేది. పులి, గొర్రె మధ్య స్నేహం పెరిగాక పులిని టిముర్ గొర్రె మరీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేది. సహనం నశించిన పులి 2016 జనవరిలో తన పంజాతో గొర్రెను ఎత్తి బండకేసి కొట్టింది. తీవ్రంగా గాయపడిన గొర్రెను సఫారా అధికారి ఒకరు మాస్కో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినా, పూర్తి స్థాయిలో దాని ఆరోగ్యం కుదుటపడలేదు. ఈనెల 5వ తేదీన టిముర్ మరణించింది. దాదాపు అయిదేళ్లపాటు పులితో సావాసం చేసిన గొర్రెను ఖననం చేసిన పార్క్ నిర్వాహకులు దానికి కాంస్యంతో సమాధి నిర్మించాలని యోచిస్తున్నారట. పులి-గొర్రె స్నేహం గురించి పార్క్ అధికారి స్వయంగా వివరించడం విశేషం. అయితే పులి పంజా ఫలితంగా గొర్రె ఆరోగ్యం దెబ్బతిందా? లేక అది సహజ మరణం చెందిందా? అనే అంశంపై స్పష్టం లేదు.

Comments are closed.

Exit mobile version