తెలంగాణాలో దాదాపు ఏడాది క్రితం ముందస్తుగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు తెలిసిందే కదా? టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్లవారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన తీర్పు ఇది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖమ్మం మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన ఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్రంలోని మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లా తీర్పు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే, ఖమ్మం జిల్లా తీర్పు ప్రతికూలంగా వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి టీడీపీకి చెందిన నామా నాగేశ్వరరావుకు గులాబీ కండువా కప్పిన అధికార పార్టీ నాయకులు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు అది వేరే విషయం. ఖమ్మంలో విపక్ష పార్టీల నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు అనంతర పరిణామాల్లో అధికార పార్టీ పంచన చేరారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య (కాంగ్రెస్), అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు(టీడీపీ)లు మినహా మిగతా ఆరుగురూ అధికార పార్టీ పంచన చేరారు. ఇలా గులాబీ పాట పాడిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రస్తుతానికైతే విప్ పదవి ద్వారా కొంత ఫలితం ఒనగూరిందనే చెప్పాలి. కానీ మిగతా అయిదుగురికి ఇప్పటి వరకు లభించిన ప్రయోజనం ఏమిటనే విషయం పక్కనబెడితే…కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పొదెం వీరయ్యపై సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియోవైరల్ అవుతోంది. దీని సారాంశం ఏమిటంటే ‘ఆర్టీసీ సమ్మెపై విచ్చలవిడిగా భద్రాచలం ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని, ఇందుకు ఆగ్రహించిన జనం, సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యేను కొట్టారని, ప్రజల్లో మార్పు మొదలైందని, పోలీసు రక్షణలో ఎమ్మెల్యే తప్పించుకుని పారిపోయారని….తదితర అక్కసు వ్యాఖ్యలతో వీడితోయోతో పాటు ఓ పోస్ట్ కూడా వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతోంది.

భద్రాచలం ఎమ్మెల్యేపై వైరల్ అవుతున్న ఫేక్ వీడియో ఇదే.

ఇది నిజమేనా సార్? అంటూ అనేక మంది ఆ వీడియోను ts29.in కు పంపిస్తూ ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విద్యావంతుడు. గిరిజనాభ్యుదయ సంఘం నాయకుడి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన ఆదివాసీ నేత. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి. గత ఎన్నికల్లో అనివార్యంగా భద్రాచలం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి. భద్రాచలం నియోజకవర్గ భౌగోళిక స్వరూపం తెలుసుకునేలోపే పోలింగ్ జరిగిన పరిస్థితుల్లోనూ విజయం సాధించిన చరిత్ర వీరయ్యది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిని అనేక మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ పంచన చేరినా, తాను మాత్రం ప్రజల తీర్పునకు కట్టుబడే ఉండడం గమనార్హం. అనుచరగణం కథనం ప్రకారం అనేక ప్రలోభాల ఆశ చూపినా వీరయ్య కాంగ్రెస్ ను వీడడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలోనే వీరయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నియామమకపు ఆదేశ పత్రం జారీ చేసింది. అంతేకాదు దశాబ్ధాల రాజకీయ జీవితంలో వీరయ్య ఎప్పడూ నోరు జారిన దాఖలాలు లేవు. అటువంటి వీరయ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి ఇలా మాట్లాడి ఉంటారా? జరిగిన ఘటన నిజమేనా? అని ఆరా తీస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

ఆర్టీసీ సమ్మె విషయంలో వీరయ్య గడచిన 37 రోజులుగా కార్మికుల పక్షాన్నే ఉన్నారు. భద్రాచలంలో కార్మికుల సమ్మె కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. రెండు నెలలుగా వేతనాలు లేని ఆర్టీసీ కార్మికులకు దాతలు ఇచ్చే బియ్యాన్ని, ఇతర సరుకులను స్వయంగా పంపిణీ చేస్తున్నారు. అటువంటి వీరయ్య కార్మికులకు వ్యతిరేకంగా మాట్లడారనే ప్రచారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవం ఏమిటంటే…‘ఆర్టీసీ కార్మికులు తిన్నది అరగక సమ్మె చేస్తున్నారని, అటువంటి వారికి దాతలు బియ్యం ఇస్తున్నారని’ అధికార పార్టీ అనుబంధ సంస్థకు చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించాడట. ప్రస్తుతం అతను ఓ నామినేటెడ్ పోస్టులో కూడా ఉన్నాడట. అంతేగాక ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరం వద్దకు వచ్చి మరీ తిన్నది అరక్క సమ్మె చేస్తున్నారని మరోసారి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడట. దీంతో ఆగ్రహించిన కార్మికులు, ప్రజలు భద్రాచలం బ్రిడ్జి సెంటర్ నుంచి అతన్ని తరిమి తరిమి కొట్టారు. చివరికి పోలీసులు అప్రమత్తమై అధికార పార్టీకి చెందిన సదరు నాయకున్ని అతికష్టం మీద ఆటోలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, పోస్ట్ అధికార పార్టీ నేతకు జరిగిన శాస్తికి సంబంధించినదే కావడం విశేషం. అయితే అకస్మాత్తుగా ఆ వీడియోను, పోస్ట్ ను భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యకు అన్వయిస్తూ ఈ వీడియో, పోస్ట్ రంగులు మార్చుకోవడమే అసలు కుట్రగా కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది అధికార పార్టీ చేస్తున్న దుష్ప్రచారమని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా తనపై తప్పడు ప్రచారం చేస్తున్నతీరుపై భద్రాచలం ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments are closed.

Exit mobile version